Home మహబూబాబాద్ గిరిజన తండాల్లో సీత్లా సందడి

గిరిజన తండాల్లో సీత్లా సందడి

Trible People Celebrate Seethla Pestiual In Mahabubabad
మహబూబాబాద్  :ప్రతీ ఏడాది వర్షాకాలం ఆరంభంలో పునర్వసు( పెద్ద పుషాల) కార్తెలో ఏదైనా ఒక మంగళవారం నాడు గిరిజనులు ఘనంగా జరుపుకునే పండుగ సీత్లా పండుగ, గోర్ బంజారాలు ఏడుగురు దేవతలను ఈ పండుగ పురస్కరించుకుని పూజిస్తారు. సీత్లా పండుగపై మన తెలంగాణ ప్రత్యేక కథనం. గోర్ బంజారాలు గ్రామాలకు దూరంగా అడవుల్లో ఎలాంటి రహదారి లేని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలేని ప్రాంతాల్లో విసిరి పరేసినట్లుగా ఉండే తండాల్లో నివసిస్తూ ఉంటారు. వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడల్లా విస్తరించే రోగాలను అరికట్టడానికై ప్రకృతి దేవతలను కొలవడం ఆనవాయితీగా వస్తోంది. వర్షాకాలం మొదలు కాగానే పశు సంపద అనేక రకాలైన రోగాలు విస్తరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తామి. పచ్చిక బయళ్ళలో, వ్యవసాయ పొలాల్లో , బహిర్గత ప్రదేశాల్లో వాటిని ఉంచడం మూలంగా ఒకే రకమైన జబ్బు లక్షణాలతో పశువులు పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురవుతాయి. ఆ లక్షణాలను గిరిజన భాషలో ‘లాళీ’ అని పిలుస్తారు. దాన్నే పశువైద్య విధానంలో గాలికుంటు వ్యాధిగా పిలుస్తారు. దీని లక్షణాలు పశువులకు జ్వరం, అతి విరేచనాలు, కాలు దెక్కలు చెడిపోవడం, నడవలేకపోవడం, నోరు చెడి సొల్లు కారుతూ ఉండడం, మేత మేయకపోవడం వంటి లక్షణాలతో బాధ పడుతూ ఉంటే వాటికి గాలి కుంటు వ్యాధి సోకిందంటారు.

ప్రకృతిని ఆరాధించే గోర్ బంజారాల ప్రకృతి దేవతలైన మేరామ, తోళ్ణా, మాత్రాల్, కంకాళి, మింగ్ళా, ధ్వాళాంగర్, సీత్లా దేవతలను ఆరాదించే పండుగే సీత్లా పండుగ. ఆ ఏడుగురు దేవతలతోపాటు వారికి రక్షణగా ఉంటే లుంకడ్యాను కూడా పూజిస్తారు. ప్రతి గిరిజన తండాల్లో సీత్లా పూజను తండా నుండి తూర్పు దిక్కున ఉండే చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. ఏడుగురు అక్కా చెల్లెళ్ళలో సీత్లా భవాని అందరికంటే చిన్నది. సీత్లామాత ప్రతిమ మధ్యభాగంలో, మిగతా భవానీలు ఇరువైపులా ముగ్గురు, ముగ్గురు అక్కల చొప్పున ఉండే విధంగా ఒకే వరుసలో చెట్టు క్రింద అన్ని ప్రతిమలు తూర్పున చూసే విధంగా ప్రతిస్టిస్తారు. పొడవాటి రాళ్ళతో తయారు చేసిన ప్రతిమల్లో మధ్యలో ఉండే సీత్లా భవాని ప్రతిమను మిగతా వాటికంటే పెద్దదిగా ఉండే విధంగా అమరుస్తారు. ఏడుగురు భవాని ప్రతిమల ఎదురుగా కొద్ది దూరంలో లుంకడ్యా పేరున ఇంకో రాయితో చేసిన ప్రతిమను భవానీ వైపు చూసే విధంగా ప్రతిష్టిస్తారు. లుంకడ్యా ప్రతిమ మీద పడ్డ నీరు గుంతలో పడే విధంగా లుంకడ్యా ప్రతిమ ఎదురుగా ఒక గుంతను తీసి ఉంచుతారు.
సీత్లా పూజా విధానం
సీత్లా పూజను అన్ని పండుగల్లాగే ఇంటి దగ్గర కాకుండా దగ్గరలో ఉండే చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. పునర్వసు కార్తెలో నిర్వహించే ఈ పండుగ రోజున తండా జూజారి సీత్లా పూజ అయ్యే వరకూ ఉపవాసంతో ఉంటారు. అతను అంది కంటే ముందే పూజా ప్రదేశానికి వచ్చి ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేసి, గోవు పేడతో అలికి బియ్యం పిండితో గుండ్రంగా ముగ్గులు వేస్తాడు. దాన్నే చ్వాక్వో అంటారు. తర్వాత భవానీ ప్రతిమలకు గేరు(జాజు) పూసి పూలతో మామిడాకులతో అలంకరిస్తారు, రైతులు తమ పశువులను సంగారించుకుని దాటుడు కొరకు తయారు చేసుకుంటారు. ఒక రోజు ముందు అంటే సోమవారం సాయంత్రం జొన్నలు, పప్పు ధాన్యాలు కలిపి నానబెట్టిన తర్వాత తయారైన ఘుగ్రిని(గుగ్గిళ్ళు) తెల్లవారి జరిగే సీత్లా పండుగకు నైవేద్యంగా తీసుకువెళతారు. దీన్నే వాసిండో అంటారు, ఈ వాసిండోతో పాటు లాప్సి(పాయసం) లేదా తెల్ల అన్నం, ఎండి మిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు, రూపాయి బిళ్ళలు ఒక వెడల్పు చెక్క పాత్రలో ఉంచి దానిపై పూల్యా గణోను కప్పి తండా కన్యలు తలమీద మోసుకుని సీత్లా పూజ ప్రదేశానికి తీసుకు వెళతారు. ఒక గొర్రెపోతును అలంకరించుకుని ఒక వ్యక్తి ముందు వరుసలో నడుస్తుండగా, మేళతాళాలు, డ్పు చప్పుల్ళకు అనుగుణంగా యువతీ యువకులు నృత్యం చేస్తూ ఉంటే తండా మహిళలు చెంబుల్లో సిగేరో పాణీ(బారి/బోరు నీరు) చేతబట్టి సీత్లా పాటలు పాడుతూ నడుస్తూ ఉండగా వెనుక తండా నాయకులు వారిని అనుసరిస్తూ సీత్లా పూజా ప్రదేశానికి చేరుకుంటారు. తండా పశువులన్నింటీని పశు కాపరులు పూజా ప్రదేశానికి కొద్ది దూరంలో నిలిపి ఉంచుతారు. తండా వాసులందరూ పూజా ప్రదేశానికి చేరుకున్నతర్వాత కన్యలు సీత్లా పూజకై తమతమ ఇండ్ల నుండి తీసుకువచ్చిన పూజా సామాగ్రిని ఒక్కొక్కరూగా పూజారికి అందిస్తారు.

పూజారి అందరి పూజా సామాగ్రిని దేనికి దానిగా వేరుపరుస్తూ భవానీల ముందు రాశిగా పోస్తారు. నైవేధ్యంగా సమర్పించడానికి తీసుకువచ్చిన లాప్సీని ధనిక పేద తేడాలు లేకుండా ఒక శుభ్రమైన పెద్ద పాత్రలో సేకరించి పూజలో ఉంచుతారు. గొర్రెపొతును భవానీల ముందు నిలబెట్టి నీటితో శుభ్రం చేసి, పసుపు కుంకుమలతో నుదుట, ముందరి కాళ్ళకు బొట్టు పెట్టి భవానీకి బలి ఇస్తారు. మోదుగ ఆకులతో చేసిన దోనలో పూజారి వాంసిడోని తీసుకుని అందులో గొర్రెపోతు రక్తాన్ని కలుపుకుంటారు. గొర్రెపోతు పేగును బయటకు తీసి భవానీల ప్రతిమల నుండి లుంకడాయ ప్రతిమ వరకూ పరుస్తారు. తండా మహిళలు తీసుకువచ్చిన నీటిని లుంకడియా ప్రతిమ మీద పోసి మొక్కులు సమర్పించుకుంటారు. ఈ విధఃగా మహిళలు పోసిన నీటితో లుంకడ్యా ప్రతిమ ఎదురుగా ఉన్న గుంత నిండి పొర్లుతుంది. దేవతలకు సమర్పించిన నైవేద్యాన్ని పూజారి తండా మహిళలకు వరుస క్రమంలో పంచిపెడతారు. ఆ తర్వాత డప్పు చప్పుళ్ళను అనుగుణంగా గుంపులు, గుంపులుగా చేరి సీత్లా మాత పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. రైతులు తండా పశువన్నింటినీ పర్చిన పేగుల నుండి దాటిస్తూ ఉంటారు. పూజారి వాంసిడో మిశ్రమాన్ని అన్ని పశువులపై పడే విధంగా చల్లుతారు, అందుకే ఈ పండుగను దాటుడు పండుగ అని కూడా పిలుస్తారు. తండా వాసులు వరుసలో నిలబడి వ్యవసాయ దారుల పశువులు అనారోగ్యానికి గురి కాకుండా పశుసంపద బాగా పెరిగి, ప్రజలందరూ భోగభాగ్యాలతో ఉండాలని మొక్కులు సమర్పించుకుంటారు. ఆపై ప్రసాదంగా సళోయిన స్వీకరించి పూజారి ఉపవాస దీక్షను విరమిస్తారు. అనంతరం తండా వాసులు కూడా ప్రసాదం సేవించి వారి వంతు మాంసం తీసుకుని వారివారి ఇండ్లకు వెళ్ళిపోతారు.