Thursday, April 25, 2024

త్రిపురలో త్రిముఖం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం:  2024 సాధారణ ఎన్నికలకు దిక్సూచి అనదగిన కీలక ఘట్టం ఈశాన్యంలో నేడు త్రిపుర ఎన్నికలతో ప్రారంభమవుతున్నది. మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కలిసి మొత్తం 180 అసెంబ్లీ స్థానాలకు ప్రతినిధులను అక్కడి ప్రజలు ఎన్నుకోనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఈ నెల 27న జరుగుతాయి. అదే రోజు లక్షద్వీప్ పార్లమెంటరీ నియోజకవర్గం పోలింగ్ కూడా చోటు చేసుకొంటుంది. ఈశాన్యంలో ఎన్నికలు జరుగుతున్న 3 రాష్ట్రాల్లోనూ బిజెపి కూటమి అధికారంలో వున్నది.

త్రిపురలో స్థానిక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి) బిజెపి అధికార భాగస్వామిగా వున్నది. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ప్రవేశం ఎలాగైతే అక్కడ మొదటిసారిగా ముక్కోణపు పోటీకి తెర లేపిందో త్రిపురలో కూడా స్థానిక తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తిప్రామోతా పార్టీ రంగ ప్రవేశం అక్కడి ఎన్నికల రంగాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈసారి కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేయడం కూడా త్రిపుర ఎన్నికలను ఆసక్తిదాయకం చేస్తున్నాయి. అయితే బిజెపి పాలనలోని నియంతృత్వ పోకడలు ప్రజల నుంచి దానిని దూరం చేశాయి. చిరకాలం పాటు ప్రధాన ప్రత్యర్థులుగా వున్న కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య పొత్తును పలువురు కాంగ్రెస్ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలోని 20 గిరిజన రిజర్వుడ్ స్థానాల్లో 18 సీట్లను బిజెపి, దాని భాగస్వామి పార్టీ ఐపిఎఫ్‌టి గెలుచుకొన్నాయి. ఉన్నట్టుండి వామపక్ష కూటమిని తుడిచిపెట్టి బిజెపి అధికారంలోకి రావడానికి ఇదే దోహదం చేసింది.

ఈసారి పరిస్థితి అలా లేదు. గిరిజన స్వయం పాలక జిల్లా కౌన్సిల్ (టిటిఎఎడిసి) అధికారాన్ని అనుభవిస్తున్న తిప్రామోతా మూడవ బలమైన శక్తిగా రంగంలో వుండడమే ఇందుకు కారణం. ఈ కౌన్సిల్ పరిధిలోనే ఆ 20 రిజర్వుడ్ స్థానాలు న్నాయి. రాజ్యాంగం 6వ షెడ్యూల్ కింద గిరిజనులకు సంక్రమించిన ప్రత్యేక హక్కులు, అధికారాల్లో భాగంగా ఈ కౌన్సిల్ ఏర్పాటయింది. ప్రధానమైన పోటీ బిజెపి, కాంగ్రెస్ వామపక్షాల కూటమి మధ్య జరిగినప్పటికీ తిప్రామోతా ప్రభావం ఎన్నికల ఫలితాల మీద అపారంగా వుండే అవకాశం వుంది. ఈ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా తిప్రామోతా మద్దతుతోనే చేయవలసి వుంటుంది. ఆ విధంగా ఇది కింగ్ మేకర్ అనిపించుకొంటున్నది. బుబర్గా (మహారాజు) గా మన్ననలందుకొంటున్న ప్రద్యోత్ బిక్రమ్ కిశోర్ మాణిక్య దేబ్ బర్మ నాయకత్వంలో ఈ పార్టీ 19 ఆదివాసీ తెగల అభిమానాన్ని చూరగొంటున్నది.

ఈయన సారథ్యంలో ఆదివాసీ కౌన్సిల్ అనతికాలంలో అనేక మంచి పనులు చేసిందనే కీర్తి గడించింది. రాష్ట్ర రాజధాని అగర్తలాకు కేవలం 30 కి.మీ దూరంలో వున్న కౌన్సిల్ నాక్ స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ అధికార పీఠంగా వున్నది. బృహత్ తిప్రాలాండ్ రాష్ట్రాన్ని సాధించడమే తమ ఆశయంగా తిప్రామోతా చెప్పుకొంటున్నది. ప్రస్తుతం వున్న ఆదివాసీ కౌన్సిల్ ప్రాంతమే గాక మిగతా కొన్ని ప్రాంతాలను కలుపుకొని తిప్రా లాండ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నది. అది జరిగితేనే తమ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నది. 36.74 లక్షల త్రిపుర జనాభాలో ఆదివాసీ తెగల ప్రజలు 31.8 శాతంగా వున్నారు. అలాగే మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 40 గిరిజనేతరుల అదుపులో వున్నాయి.

1980లో ఆదివాసీ తీవ్రవాదులు మాండ్‌వీ అనే చోట పాల్పడిన ఊచకోత హత్యాకాండలో 255 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఎక్కువ మంది బెంగాలీలే. త్రిపురను మార్కిస్టులు చిరకాలం పాలించడానికి గిరిజనేతర నియోజక వర్గాల్లో బెంగాలీల ప్రాబల్యం అధికంగా వుండడమే కారణం. ఆనాటి ఊచకోతకు తమనే బాధ్యులను చేస్తున్నారనే నేర భావన అక్కడి గిరిజన తెగల్లో వుంది. తాము గిరిజనేతరులకు వ్యతిరేకం కామని వారితో సహజీవనం సాగించడమే తమ ధ్యేయమని తిప్రామోతా బాహాటంగా చెబుతున్నది. ఇది ఒక సానుకూల అంశం. బిజెపి ఈసారి తన మేనిఫెస్టోలో అనేక ఆకర్షణీయ వాగ్దానాలు చేసింది. ఇంకోవైపు తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేస్తున్నది. మోతాతో పొత్తు కుదుర్చుకోడానికి ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ వామపక్షాలు కూడా ప్రయత్నించి విఫలమయ్యాయి. బృహత్ తిప్రాలాండ్ రాష్ట్రం డిమాండ్ వల్లనే అది సాధ్యం కాలేదు. తన పాలనపై అసంతృప్తి గూడుకట్టుకొని వున్న నేపథ్యంలో ఇటు తిప్రామోతాను, అటు కాంగ్రెస్, వామపక్షాలను బిజెపి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News