Home అంతర్జాతీయ వార్తలు థాయ్‌లాండ్ లో’పబుక్’ బీభత్సం

థాయ్‌లాండ్ లో’పబుక్’ బీభత్సం

Tropical Storm Pabuk Strikes Thailand

బ్యాంకాక్ : థాయ్‌లాండ్ గజగజ వణుకుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన పబుక్ తుఫాన్ ధాటికి తీర ప్రాంతాలు బెంబేలెత్తుతున్నాయి. తుపాను థాయిలాండ్ దక్షణి తీరాన్ని తాకడంతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పాటు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. గాలుల వేగం కొంచెం తగ్గుముఖం పట్టిందని ఆదేశ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో ఇలాంటి భీకరమైన తుఫాను రావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. పట్టాని ప్రావిన్స్‌కు సమీపంలో ఉన్న తీరంలో చేపల వేటకు వెళ్లే బృందంలోని ఒక వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరొక వ్యక్తి గల్లంతయ్యాడు. థాయ్‌లాండ్ సౌత్‌లోని 15 ప్రావిన్స్‌లలో కుండపోత వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రపు అలలు 22 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో కొన్ని రోజులుగా సుమారు 6,176 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. థాయ్‌ను తుఫాను తాకనుండటంతో రెండు విమానాశ్రయాలను ముందస్తుగానే మూసివేశారు. తుపాను ఈ నెల 6న అండమాన్, నికోబార్ దీవుల్ని తాకొచ్చనని అంచనా వేస్తున్నారు. తుపాన్ నేపథ్యంలో ఒడిశా సైతం తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది.

Tropical Storm Pabuk Strikes Thailand