Friday, March 29, 2024

సంపాదకీయం: బైడెన్‌కు సవాళ్ళు

- Advertisement -
- Advertisement -

Question is when will corona vaccine come

అమెరికా అధ్యక్ష భవనం తెల్లమేడలోకి డెమొక్రాటిక్ విజేత జో బైడెన్ సకాలంలో అడుగు పెట్టడం ఖాయమని తేలిపోయింది. ‘ఆపద్ధర్మ’ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను ఓడిపోయినట్టు అంగీకరించనంటూనే పీఠం దిగిపోడానికి సిద్ధమేనని ప్రకటించడం అధికార మార్పిడికి దారిని చదును చేసింది. బైడెన్ పాలనలో అమెరికా విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేదానిపై చర్చ బాగా జరుగుతున్నది. అమెరికాలోని కంపెనీలలో పని చేయడానికి విదేశీయులకు ఇచ్చే హెచ్1 బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలన్నింటినీ రద్దు చేస్తూ నార్తర్న్ కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఈ విషయంలో బైడెన్ ప్రభుత్వం పనిని తేలిక చేసింది.

ట్రంప్ సృష్టించిన అడ్డంకులను తొలగించి విదేశీయుల పని వీసాలను పెంచుతామని వాటిని సాధించుకోడం సులభతరం చేస్తామని బైడెన్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. అయితే కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయిన దశలో తక్షణమే ఆయన అందుకు సాహసించేవాడు కాదు. విదేశీయులకు ఇవ్వజూపే ఉద్యోగాల కనీస వేతనాలను ట్రంప్ ప్రభుత్వం 40 శాతం పెంచేసింది. ఆ విధంగా విదేశీ చవక ఉద్యోగుల కోసం అమెరికన్ కంపెనీల వెంపర్లాటను నిరుత్సాహపరిచింది. అలాగే హెచ్1బి వీసాల చెల్లుబాటు వ్యవధిని మూడేళ్ల నుంచి ఒక సంవత్సరానికి కుదించివేసింది. ఇటువంటి మరెన్నో కఠినమైన మార్పులను చట్టంలో తీసుకు వచ్చింది. కాలిఫోర్నియా కోర్టు తీర్పుతో ఇవన్నీ తొలగిపోయాయి. అమెరికా ఇస్తున్న హెచ్1బి వీసాలలో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. అందుచేత కోర్టు తీర్పు మనకెంతో ఆనందదాయకమైనది.

ట్రంప్ ప్రభుత్వం అమెరికా విదేశాంగ విధాన వైఖరిలో దాని అంతర్జాతీయ పాత్రలో అనేక వ్యతిరేక మార్పులు తీసుకు వచ్చింది. బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను కొడిగట్టిచ్చింది. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికాను ట్రంప్ ఉపసంహరింపచేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమింపచేశాడు. ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల సంస్థకు నిధులు తగ్గించాడు. పాలస్తీనీయుల భూభాగమైన జోర్డాన్ పశ్చిమ తీరంలో ఇజ్రేయిలీలు నివాసాలు ఏర్పర్చుకోడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్న అమెరికా చిరకాల విధానానికి తిలోదకాలిచ్చాడు. ఇజ్రేయిల్లో అమెరికా రాయబారి కార్యాలయాన్ని జెరూసలేమ్‌కు మార్పించాడు. పాలస్తీనా భూభాగాలను మరింతగా ఆక్రమించుకున్న ఇజ్రేయిల్ వైఖరికి దన్నుగా నిలిచాడు. పశ్చిమాసియాలో ఒబామా ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఇజ్రేయిల్ తీవ్రంగా విభేదించింది. 2015లో ఒబామా సర్కారు ఇరాన్‌తో అణుశాంతి ఒప్పందానికి ఉద్యుక్తమైనప్పుడు ఇజ్రేయిల్ ప్రధాని నెతన్యాహూ అమెరికా అధ్యక్షుడిని దాటవేసి నేరుగా అక్కడి పార్లమెంటుతో మాట్లాడాడు.

ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే సహించబోమని కూడా హెచ్చరించాడు. ట్రంప్ ఈ ఒప్పందం నుంచి అమెరికాను వెనుకకు రప్పించి ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు విధించాడు. బైడెన్ ప్రభుత్వం దీనికి తిరిగి ప్రాణం పోస్తుందని ఇరాన్‌తో అమెరికా సంబంధాలలో సానుకూల మార్పులు వస్తాయని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇరాన్‌తో ఒప్పందం పునరుద్ధరణ వైపు బైడెన్ వేయబోయే అడుగులకు గట్టి అడ్డుగోడ కట్టాలని ట్రంప్ తన అధ్యక్ష పదవి ఆఖరు రోజుల్లో కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడింది. ఇటీవల జరిగిన ఇరాన్ అణుశాస్త్రజ్ఞుడు ఫక్రిజాదే హత్య ఇజ్రేయిలీ గూఢచారి సంస్థ మొస్సాద్ నిర్వాకమేనని దాని వెనుక ట్రంప్ ప్రోత్సాహం కూడా ఉన్నదని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఇరాన్ కీలక సైన్యాధిపతి జనరల్ సులేమానీని అమెరికా డ్రోన్ దాడితో హతమార్చిన ఘటన తెలిసిందే. ఇరాన్‌ను నానా చికాకులకు గురి చేసి పశ్చిమాసియాలో మళ్లీ మంటలు రాజేసి చలి కాచుకుందామనే రిపబ్లికన్ల, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని నీరుగార్పించడంలో బైడెన్ ఏ మేరకు కృతకృత్యుడవుతాడు అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సూటి సమాధానం కరువే. దేశంలోని ఓటర్లలో ట్రంప్ అభిమానులు గణనీయంగా ఉన్నారన్న విషయం మొన్నటి ఎన్నికలలో రూఢి అయింది.

ఆయనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువగా ఈసారి పడడం అమెరికా విధానాలలో ట్రంపిజం ఒక అనుల్లంఘనీయ అంశంగా ఉండబోతుందనే అభిప్రాయానికి తావు కలిగించింది. దిగిపోతున్న దశలో దేశాధ్యక్షుడు అమెరికా భావి అడుగులను నియంత్రించడానికి కుట్రలు పన్నడం అక్కడి ప్రజాస్వామ్యం, అధికార మార్పిడి ప్రక్రియల బలహీనతను చాటుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News