Home తాజా వార్తలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

TRS accuses BJP govt of corporatising agriculture

 

కేంద్రం వ్యసాయ బిల్లు ఉపసంహరించుకునేంతవరకు ఆందోళన ఆగదు
టిఆర్‌ఎస్ రాజ్యసభ పక్షనాయకుడు కేశవరావు

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్ ఆందోళన కొనసాగిస్తోంది. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన విపక్షాల సభ్యులకు మద్దతు తెలుపుతూ టిఆర్‌ఎస్ రాజ్యసభ పక్షం ఆందోళన బాట పట్టింది. కేంద్రం ఏకపక్షంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లు ఉపసంహరించేంతవరకు టిఆర్‌ఎస్ ఆందోళనబాట విడిచే ప్రసక్తే లేదని టిఆర్‌ఎస్ రాజ్యసభ పక్షనేత కె.కేశవరావు స్పష్టం చేశారు. రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన సభ్యుల ఆందోళనలకు మద్దతుగా టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహందగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. రైతుల హక్కులను కేంద్రం కాలరాస్తుందని ఆయన దుయ్యబట్టారు. రైతుల హక్కులను హరించేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

రైతాంగ వ్యతిరేక బిల్లును తప్పుబట్టి రాజ్యాంగ నిబంధనల మేరకు నిరసన తెలిపిన విపక్షాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేయడాన్ని కెకె తప్పుబట్టారు. ఈచర్య రాజ్యాంగ విరుద్ధమని కెక పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్ 256 నిబంధన చదివి వినిపించారని ఆయన తెలిపారు. అయితే అదేవిధంగా 252 నిబంధనను సైతం చదివివినించాల్సి ఉండాలని ఆయన చెప్పారు. సభ్యుల కోరిక మేరకు 252 నిబంధన మేరకు బిల్లుపై ఓటింగ్ జరపాలని ఉందనే విషయం చైర్మన్‌కు తెలియదాని ప్రశ్నించారు. కార్పొరేటు సంస్థలకు దేశంలోని వ్యవసాయ రంగాన్ని అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబిల్లు పై సభలో విపక్షాలు డివిజన్ అడిగినా ఎందుకు ఆమోదించలేదని ఆయన ప్రశ్నించారు. అధికార బిజెపికి రాజ్యసభలో మెజారిటీలేదని కేవలం అధికారం చలాయిస్తూ ఏకపక్షంగా బిల్లును ఆమోదించుకుందని నిందించారు.

మెజారిటీ ఉంటే డివిజన్‌కు ఎందుకు కేంద్రం బయపడిందని కెకె నిలదీశారు. ప్రజాస్వామ్యంగా సభ్యులను సస్పెండ్ చేయ డం సరికాదని ఆయన ఆక్షేపించారు. విపక్షాలన్నీ రైతుల పక్షాన దేశవ్యాప్తంగా పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. టిఆర్‌ఎస్ కూడా కేంద్ర రైతుబిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విపక్షాల ఆందోళనకు టిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కెకె చెప్పారు. రైతుల హక్కులను పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటాలు చేస్తామని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విపక్షాల సందేహాలను తీర్చి బిల్లుపై నిర్ణయం తీసుకోవల్సి ఉండేది. మూజువాణి ఓటు తో బిల్లు ఆమోదించుకోవడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అయన అన్నారు.

ఈ బిల్లుతో బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా సంతోషంగాలేవన్నారు. వాస్తవానికి రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని చెప్పారు. టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యు డు వెంకటేష్ నేత మాట్లాడుతూ రాష్ట్రాల అధికారాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం అమోదించుకుందన్నారు. విపక్షాలతోకలిసి ఆందోళన చేసిన టిఆర్‌ఎస్ ఎంపి ల్లో కెకె. లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్, సురేష్‌రెడ్డి పాల్గొని రైతు వ్యతిరేకబిల్లును ఉపసంహరించుకోవాలని పెద్దపెట్టునా నినాదాలు చేశారు. రైతుసంక్షేమాన్ని నిజంగా కేంద్రం కోరుకుంటే తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పారు. రెవెన్యూచట్టంతో తెంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. విపక్షాల అభిప్రాయాలను పరిగణలోకకి తీసుకోకుండా విషపూరితమైన మూజువాణి ఓటుతో కేంద్రం బిల్లును ఆమెదించుకుందని నిందించారు. అలాగే ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభనుంచి సస్పెండ్ అయిన అమ్‌ఆద్మీ ఎంపి సంజయ్ సింగ్, తృణముళ్ కాంగ్రెస్ నుంచి డెరిక్ ఓబ్రెన్, డోలాసేన్, కాంగ్రెస్ నుంచి వాస్తవ్, రిపూన్ బోరా, సయ్యద్ నజీర్ హుస్సేన్, సిపిఎం కు చెందిన కరీం,కెకె రాజేష్ పాల్గొన్నారు.

విపక్షాలతో కలిసి కేంద్రంపై రాజీలేని పోరాటం

రైతుల ప్రయోజనాలు కాపాడటమే టిఆర్‌ఎస్ లక్ష్యం : ఎంపి సంతోష్‌కుమార్

రైతు ప్రయోజనాలకోసం రాజీలేని పోరాటం చేస్తామని కేంద్రప్రభుత్వాన్ని టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్ హెచ్చరించారు. ప్రజావ్యతిరేక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న కేంద్రాన్ని విపక్షాలతో కలిసి అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ సిద్దంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు కేంద్రంపై పోరాటానికి టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు సిద్దంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభ నుంచి అనైతికంగా సస్పెండ్ చేయబడిన ఎంపిలకు టిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆయన చెప్పారు. వ్యవసాయబిల్లును వ్యతిరేకించిన రాజ్యసభ సభ్యులను సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయడు సస్పెండ్ చేశారు.

సస్పెండ్ ఆయిన విపక్షాల సభ్యుల్లో డెరిక్ ఒబ్రెయిన్, సంజయ్‌సింగ్, రాజీవ్ సతావ్, కెకె రాజేష్, సయ్యద్ నజీర్ హుస్సేన్, రిపున్ బోరా, డోలా సేన్, కరీం ఉన్నారు. వ ్యవసాయబిల్లు ను కేంద్రం ఆమోదించవద్దని వెల్‌లోకి దూకి ఆందోళన చేసిన సభ్యులను చైర్మన్ సస్పెండ్ చేశారు. ఈసందర్భంగా విపక్షాలకు మద్దతు తెలుపుతూ టిఆర్‌ఎస్ ఆందోళన చేసింది. ఈఅంశంపై సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో స్పందిస్తూ రైతులకోసం, వారి హక్కులను కాపాడేందుకు సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు ఆందోళనలు కొనసాగుతాయని కేంద్రా న్ని హెచ్చరించారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన అనైతిక వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్‌తో కలిసి ఆందోళనలు చేసిన పార్టీలకు మద్దతు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులకు సంతోష్ కుమార్ సంఘీభావం తెలిపారు.

TRS accuses BJP govt of corporatising agriculture