Wednesday, April 24, 2024

మేడ్చల్, నేరేడుచర్ల టిఆర్‌ఎస్ కైవసం

- Advertisement -
- Advertisement -

Nereducharla and Medchal

 

మేడ్చల్,నేరెడుచర్ల ః స్వల్ప ఉద్రిక్తతలు, వివాదాల నడుమ సోమవారం నాడు వాయిదా పడిన నేరేడుచర్ల, మేడ్చల్ మున్సిపాలిటీలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ ఛైర్మన్‌గా మర్రి దీపికానర్సింహ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికకాగా ,నేరెడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో ఓటుతో రెండు మున్సిపాలిటీని టిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. నేరేడుచర్లలో తీవ్ర ఉద్రిక్తతలు, ఆద్యంతం రసవత్తరంగా మారిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలక ఛైర్మన్ పీఠాన్ని చివరకు టిఆర్‌ఎస్ దక్కించుకుంది, ఛైర్మన్ గా జయబాబు, వైస్ ఛైర్ పర్సన్ గా శ్రీలత ఎన్నికయ్యారు. అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్ మధ్య ఆధిపత్యపోరుకు నేరేడుచర్ల వేదికగా మారింది. ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ అడ్డాలో ఎలాగైనా తన పాగా వేయాలనే పట్టుదలతో గులాబీ పార్టీ ఉండగా.. దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించడం ఆద్యంతం ఆసక్తిని రేపింది.అంతకుముందు నాటకీయ పరిణామాల నడుమ పురపాలక సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన పురపాలక సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ వాకౌట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్ అఫిషియో ఓట్ల జాబితాను మళ్లీ మార్చడం.. తాజాగా షేరి సుభాష్ రెడ్డి, వెంకటేశ్వరుల పేర్లు చేర్చడాన్ని ఉత్తమ్ తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమంగా నేరేడుచర్ల ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని అధికారపార్టీ చూస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వార్డు సభ్యులతోపాటు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అలాగే నేరెడుచర్ల మున్సిపాలిటీలో మొత్తం 15వార్డులకు గానూ టిఆర్‌ఎస్-7,కాంగ్రెస్-7,కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ ఒక స్ధానంలో గెలుపొందింది. దీంతో ఎక్స్ అఫీషియో ఓటుగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపిడి బడుగుల లింగయ్యయాదవ్, ఎంఎల్‌ఎ శానంపూడి సైదిరెడ్డి, ఎంఎల్‌సిలు బోడకుంటి వెంకటేశ్వర్లు, షేరి సుబాష్‌రెడ్డిలు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దీంతో టిఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. కాంగ్రెస్‌పార్టీ నుండి టిపిసిసి అధ్యక్షుడు, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఎల్‌సి కెవిపి రామచంద్రరావులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.

దీంతో వారి సంఖ్య 10కి చేరుకుంది.సుబాష్‌రెడ్డి పేరును ఎక్స్‌అఫీషియో ఓటుగా నమోదు చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించి బయటకు వెళ్ళిపోయింది. ఎన్నికలు నిర్వహించడానికి 11మంది కోరం సరిపోవడంతో నేరెడుచర్ల మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి సుందరి కిరణ్‌కుమార్, జిల్లా ఎన్నికల అబ్జర్వర్ చంపాలాల్ సమక్షంలో చైర్మన్,వైస్ చైర్మన్‌ల ఎన్నికలను నిర్వహించారు. చైర్మన్‌గా చందమళ్ళ జయబాబు, వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలతారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

TRS captures municipalities of Nereducharla and Medchal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News