Friday, April 19, 2024

కారెక్కిన పురం

- Advertisement -
- Advertisement -

 Municipal elections

 

ఠారెత్తిన విపక్షం

పటిష్ట వ్యూహంతో గులాబీ పార్టీ జోరు
120 మున్సిపాలిటీలకు 110 టిఆర్‌ఎస్ కైవసం
ఏడు కార్పొరేషన్లలో భారీ విజయం
మరో రెండూ టిఆర్‌ఎస్‌కు దక్కే అవకాశం

తెలంగాణ గుండె దండోరాగా హృదయవీణగా సుస్థిరపడిన కెసిఆర్ దర్శకత్వంలో ఆబాలగోపాలం అభిమాన యువనేత కెటిఆర్ అనితర సమర్థసారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి విపక్షాలను తునాతునకలు చేస్తూ మరోసారి దిగ్విజయవిహారం చేసింది. ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీల్లో 110ని టిఆర్‌ఎస్ కైవసం చేసుకున్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ 4, బిజెపి 2 గెలుచుకుని సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఇతరులు 4 మున్సిపాలిటీలలో గెలుపొందారు. ఎంఐఎం భైంసా, జల్‌పల్లిలలో గెలుపొందింది. ఐజా, కొల్లాపూర్ లలో ఫార్వర్డ్ బ్లాక్ తరపున టిఆర్‌ఎస్ రెబల్స్ బరిలోకి దిగి వాటిని కైవసం చేసుకున్నారు.

ఇంకా ఎక్స్‌అఫీషియో ఓట్లతో మరి ఒకటి రెండు పురపాలికలను టిఆర్‌ఎస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లలోనూ గులాబీ కదం తొక్కింది. మొత్తం 9 కార్పోరేషన్లలోని 325 డివిజన్లకు గానూ 154 డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 40, బిజెపి 65, ఎంఐఎం 17 స్థానాల్లో గెలుపొందాయి. 49 డివిజన్లలో స్వతంత్రులు గెలిచారు. 9 కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్ ఏడింట సంపూర్ణ విజయం సాధించి మెజారిటీతో మేయర్ స్థానాలను కైవసం చేసుకోనుండగా, ఎక్స్‌అఫీషియో ఓట్లతో మరొక కార్పొరేషన్‌ను సొంతం చేసుకోనున్నది. మజ్లిస్‌తో కలిసి నిజామాబాద్‌ను సైతం తన ఖాతాలో వేసుకోనున్నది.

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జైత్ర యాత్ర అప్రతిహాతంగ సాగిపోయింది. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కొన్ని స్థానాలకే పరిమితమయ్యాయి. పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లలో ఎన్నికలలు జరుగగా, టిఆర్‌ఎస్ అత్యధికంగా 110 మున్సిపాలిటీల్లో భారీ విజయం నమోదు చేసుకోగా,కాంగ్రెస్, బిజెపి పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలలో, బిజెపి 2 మున్సిపాలిటీలలో గెలుపొందగా, ఇతరులు 4 మున్సిపాలిటీలలో విజయం సాధించారు. ఎంఐఎం పార్టీ భైంసా, జల్ పల్లి మున్సిపాలిటీల్లో గెలుపొందింది. ఐజా, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరపున టిఆర్‌ఎస్ రెబల్స్ బరిలోకి దిగి ఆ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. ఇవి కూడా అధికార పార్టీ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అలాగే ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఒకటి రెండు మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్‌దే ఆధిక్యం
మున్సిపల్ కార్పోరేషన్లలోనూ గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 9 మున్సిపల్ కార్పోరేషన్లలో 325 డివిజన్లకు గానూ 154 డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 40, బిజెపి 65, ఎంఐఎం 17 స్థానాల్లో గెలుపొందారు. 49 డివిజన్లలో స్వతంత్రులు విజయం సాధించారు. 9 మున్సిపల్ కార్పోరేషన్లలో ఏడింటిలో సంపూర్ణ విజయం సాధించి మెజారిటీతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోనుండగా, ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఒక కార్పోరేషన్‌ను కైవసం చేసుకోనుండగా, ముజ్లిస్ పార్టీతో కలిసి నిజామాబాద్ కార్పోరేషన్‌ను టిఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

పటిష్ట వ్యూహంతో కారు జోరు
మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే టిఆర్‌ఎస్ పటిష్టవ్యూహాన్ని రచించి కార్యరంగంలోకి దిగింది. టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావుతో పాటు మంత్రులు, స్థానిక నేతలు సమన్వయంతో కదిలారు.టికెట్ల అంశంపై పలు ప్రాంతాల్లో అసమ్మతి ఏర్పడినా సమస్యను పరిష్కరించి స్థానిక నేతలు, కార్యకర్తలు ఒక్కటిగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టికెట్లు దక్కని వారిని పార్టీ పదవుల్లో, ప్రభుత్వ నామినేటడ్ పదవుల్లో నియమిస్తామని హామీ ఇవ్వడంతో అసంతృప్త నేతలు సద్దుమణిగారు.

పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ ఎన్నికల ప్రణాళికలను రూపొందించారు. గడప గడపకీ ప్రచారం చేసి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు వివరించడం గులాబీ పార్టీకి కలిసివచ్చింది. తమ తమ జిల్లాల్లో మంత్రులే పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు చేపట్టాలని టిఆర్‌ఎస్ అగ్రనాయకత్వం సూచించింది. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు తమ జిల్లాల పరిధిలో చివరి వరకు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఓటూ కీలకమని భావించి వీలైనంత ఎక్కువమంది ఓటింగ్ చేసేందుకు వీలుగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కెటిఆర్ కోరారు. గత ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. పురపోరులో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పథకాల సమర్థ నిర్వహణ ఓటర్లపై ప్రభావం చూపాయి. టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి అన్న నినాదాన్ని పట్టణ ఓటర్లు విశ్వసించారు. అందుకు అనుగుణంగా ఓటు వేసి గెలిపించారు.

టిఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఓట్ల శాతం

పట్టణ ఓటర్లు టిఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టారు. ఓటర్లు ఇచ్చిన తీరు, టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పాజిటివ్ సంకేతాలు చూపుతున్నాయి. గత ఎన్నికలతో పోల్చితే, రాష్ట్రంలో పాజిటివ్ ఓటు పెరిగినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌కు 47 శాతం ఓట్లు రాగా, స్థానిక ఎన్నికల్లో సుమారు 51 శాతం ఓటు షేర్ వచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు విఫలం అయినట్లుగా చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోంది. గత ఆరేళ్లలో సాధించిన ఆ పురోగతి స్పష్టం కనిపిస్తుంది. అందుకే పట్టణ ఓటర్లు టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో వెల్లడవుతోంది.

కాంగ్రెస్‌కు నిరాశ
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన కాంగ్రెస్ పుర పోరులో ఎక్కువ సీట్లు సాధించాలని ఆశించినా ఫలితాలు వారికి నిరాశ మిగిల్చాయి. లోకసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు సీట్లను గెలుపొందిన కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. పార్టీలో వర్గపోరు, టికెట్ల పంపకాల్లో పెరిగిన అసమ్మతితో పాటు పలు అంశాలు పార్టీ పరాజయానికి దారి తీశాయి. దాంతో కాంగ్రెస్‌కు ఒక్క కార్పోరేషన్ కూడా దక్కలేదు.

వికసించని కమలం
మున్సిపల్ ఎన్నికల్లో భారీ గెలుపు సాధించి రాష్ట్రంలో విస్తరించాలనుకున్న బిజెపి ఆశలను ఈ ఎన్నికలు నిర్ఘాంతపరిచాయి. తుక్కుగూడ, ఆమన్‌గల్ పురపాలక సంఘాలను మాత్రమే గెలుచుకున్న బిజెపి నిజమాబాద్ నగరపాలక సంఘంలో మాత్రం అత్యధిక స్థానాలు సాధించిన పక్షంగా నిలబడినా మెజారిటీ సాధించలేకపోయింది.

TRS clean sweep Municipal elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News