Home రాష్ట్ర వార్తలు కెసిఆర్ గాలిలో మేడలు కడుతున్నారు : కిషన్ రెడ్డి

కెసిఆర్ గాలిలో మేడలు కడుతున్నారు : కిషన్ రెడ్డి

Kishan-Reddy

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ లపై బిజెపి శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని అమెరికా, యూరప్‌, ఇస్తాంబుల్‌ లా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు గాలిలో మేడలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. తరుచూ విదేశీ పర్యటనలు చేసి మున్సిపల్ మంత్రి హైదరాబాద్ నగరం కూడా అలాగే ఉందనే ఊహల్లో తేలుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయాణిస్తున్న రోడ్డే అధ్వానంగా ఉన్న కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, మూడేళ్ల పాలనలో కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని కిషన్‌ రెడ్డి మండి పడ్డారు.

ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనం లోపించిందని ఆయన అన్నారు. నగరంలో వారానికి ఒకసారి కూడా మంచినీళ్లు రావడం లేదన్నారు. మెట్రో రైలు పనులు పడకేశాయని, పండగల సమయంలో కూడా సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఇదేనా విశ్వనగరమని కెటిఆర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారన్నారు.