Home తాజా వార్తలు తులసి వనంలో గంజాయి మొక్క

తులసి వనంలో గంజాయి మొక్క

TRS Leader Balka Suman Criticizes Revanth Reddy

రేవంత్‌పై ఐటి దాడులతో టిఆర్‌ఎస్‌కు సంబంధం లేదు
కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన ఎంపి బాల్క సుమన్

హైదరాబాద్: తులసీవనంలో రేవంత్‌రెడ్డి గంజాయి మొక్కలాంటివాడని ఎంపి బాల్కసుమన్ ఆరోపించారు. శుక్రవారం టిఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, ఆయన బంధువులపై జరుగుతున్న ఐటి దాడులకు టిఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. టిఆర్‌ఎస్‌కు సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతల తీరు దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు రావొద్దని అనుకున్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారం ఉందన్నారు. 2009 ఎలక్షన్ అఫిడవిట్‌లో రూ.3.6 కోట్లుగా, 2014 అఫిడవిట్‌లో 13.2 కోట్లుగా రేవంత్ చూపించారని ఆయనకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలపాలన్నారు. రేవంత్‌రెడ్డి ఒక దేశద్రోహి అని ఐటికి చూపించకుండా దేశాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఇలాంటి దేశద్రోహి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి అసలు ఈ సమాజంలో ఉండడం కరెక్ట్ కాదని, జైలులో పెట్టాలన్నారు. చంద్రబాబుతో కలిసి రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారాలు నడిపించారన్నారు.

ఒకే అడ్రస్‌పై 18 కంపెనీలా…
జానారెడ్డి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని వారిపైన ఐటి దాడులు ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. సెటిల్‌మెంట్లు, భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్‌రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే అడ్రస్‌పై 18 కంపెనీలు పెట్టి అక్రమ వ్యాపారాలు చేయడం న్యాయమా కాదా అన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 14 కోట్ల రూపాయల ఒక యంత్రం చేతులు మారి ఒక కంపెనీ 80 కోట్లకు దాని కొనడం ఏమిటో దాని మర్మం బయటపెట్టాలన్నారు. ఆ కంపెనీ ఇచ్చిన కారులోనే రేవంత్ తిరుగుతున్నాడని ఆయన ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకులు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ఒక చోటా షకీల్, ఒక విజయమాల్యా, దావూద్ ఇబ్రహీం మాదిరిగా వ్యవహారించారన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన రూ.50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయో ఆరా తీస్తే ఈ డొంక కదిలిందన్నారు.

ఉత్తమ్ మద్దతు ఎందుకిస్తున్నారు
నారాయణగూడలో మాములుగా పెయింటర్‌గా పనిచేసిన రేవంత్ ఇన్ని కోట్లు ఎలా సంపాధించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసర ముందన్నారు. మిలట్రీలో పనిచేసిన ఉత్తమ్ మనీ లాండరింగ్ చేసిన రేవంత్‌కి ఎలా మద్ధతు తెలుపుతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ముఠా స్టువర్టుపురం దొంగల ముఠాగా ఆయన అభివర్ణించారు. వారిలో ఎవరినీ కదిలించినా వేల కోట్లు బయటపడతాయన్నారు. ఉమ్మడి ఏపిలో ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగి అక్రమార్జన చేశారని ఆయన ఆరోపించారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, చిల్లర రాజకీయాలతో తాము అధికారంలోకి రావాలనుకోవడం లేదని, కెసిఆర్ చేసిన అభివృద్ధే తమ అభ్యర్థులను గెలిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

రేవంత్ ఒక డేరా బాబా: గట్టు
రేవంత్‌రెడ్డి ఒక డేరా బాబాగా టిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు అభివర్ణించారు. చంద్రబాబు కూడా ఇలానే బ్యాంకుల నుంచి అక్ర మ లోన్లు తీసుకున్నాడని ఆయన ఆరోపించా రు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై పగ తీర్చుకోవడానికే రేవంత్‌ని ఆ పార్టీలోకి పంపాడని ఆయన ఆరోపించారు. బ్లాక్‌మనీ వైట్ చేసుకునేందుకు ఇదంతా చేశారని పేర్కొన్నారు. ఎల్‌బినగర్‌లో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్‌లో సభ్యత్వం కోసం పాకులాడిన చిన్న కార్యకర్త రేవంత్ ఇన్ని కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఐటి నోటీసులిస్తే అది టిఆర్‌ఎస్‌కు సంబంధం ఎలా ఉంటుందన్నారు. రేవంత్‌రెడ్డి పై దాడులు జరపడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ నేత అని కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలకు ఆ విషయం తెలుసన్నారు.