Wednesday, April 24, 2024

ఖమ్మంలో టిఆర్‌ఎస్ నేత దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

రాజకీయ కక్షలతోనే మాటువేసి వేట కొడవళ్లతో హత్య
మృతుడు తుమ్మల అనుచరుడు.. సిపిఎం రాష్ట్ర
కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు
సోదరుడు ఆగ్రహించిన గ్రామస్తులు
తమ్మినేని సోదరుల ఇళ్లపై దాడి, విధ్వంసం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్ర టిఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, ఖమ్మం రూరల్ టిఆర్‌ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య(60) సోమవారం ఉదయం దారు ణ హత్యకు గురయ్యారు. గ్రామస్థులంతా స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల వేడుకల్లో బిజీగా ఉన్న సమయంలో ప్రత్యర్థులు ఇదే అదునుగా మాటువేసి పట్టపగలే వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామమైన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకోగా హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు. గ్రామంలో రాజకీయ అధిపత్యం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు వినవస్తోంది. తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులంతా ఆగ్రహంతో తమ్మినేని సోదరుడు తమ్మినేని కోటేశ్వర రావు ఇంటిపై, గ్రానైట్ ఫ్యాక్టరీ, క్వారీపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన ందిన ఆంధ్రాబ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్ తమ్మినేని కృష్టయ్య సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఉదయం పలు గ్రామాల్లో జెండావిష్కరణ చేశారు. తన కారు అందుబాటులో లేకపోవడంతో తన అనుచరుడైన ముక్తేశంతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. ముందుగా గుర్రాలపాడు గ్రామంలో తీగల కృష్ణయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో అతడిని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు ఆ తరువాత పొన్నేకల్ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామస్థులు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం ద్విచక్రవాహనంపై తిరిగి తన ఇంటికి వస్తుండగా తెల్దారుపల్లి గ్రామ శివారులో అతని ఇంటి సమీపంలోకి రాగానే ఎదురుగా ఆకస్మికంగా వచ్చిన ఆటో తమ్మినేని కృష్ణయ్య పయనిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనతో బైక్‌పై వెనుక కూర్చున్న కృష్ణయ్య రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయారు. ఆటో ఢీ కొట్టడంతో బైక్‌ను తొలుతున్న ముక్తేశం కాలికి గాయం కావడంతో అతను లేవలేని స్థితిలో పడిపోయారు.

వెంటనే ఆటోలో వచ్చిన ఆరుగురు ప్రత్యర్థులు వేటకొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులతో గుంతలో పడిపోయిన కృష్ణయ్యపై విరుచుకపడి దారుణంగా హత్య చేశారు. రెండు చేతులను నరికివేయగా మోచేయి తెగి విడిపోయాయి. తలపై నరకడంతో తలఛిద్రమై పోయింది. రక్తం మడుగులో పడిపోయి అక్కడికి అక్కడే చనిపోయారు. ఈ సంఘటన ఉదయం 10గంటల ప్రాంతంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. పోలీసులంతా స్వాతంత్ర వజ్రోత్సవాల్లో బిజిగా ఉన్నారు. సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో తమ్మినేని కృష్ణయ్య హత్య వార్త తెలిసి అగ్రహించిన గ్రామస్ధులు, తమ్మినేని కృష్ణయ్య బంధువులు ఈ హత్యకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరులే కారణమని అనుమానిస్తూ వాళ్ళ ఇళ్ళపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. హత్య జరిగిన సంఘటనకు కొద్ది దూరంలోనే ఉన్న తమ్మినేని కోటేశ్వర రావు ఇంటిపై దాడి చేసి ఇంట్లోని పర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇంటి కిటికీలను, తలుపులను, పూలకుండీలను పగలగొట్టారు. ప్రక్కనే ఉన్న గ్రానైట్ క్వారీపై కూడా దాడి చేశారు.

అక్కడ ఉన్న ప్రొక్లైన్‌కు నిప్పు పెట్టారు. అంతేగాక ఈహత్యలో పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్న ఆరుగురు నిందితులైన గజ్జి కృష్ణ స్వామి, నూకల చిన్న లింగయ్య, బోడపట్ల శ్రీను గౌడ్, బండారి (చెవిటి) నాగేశ్వర రావు, గుంటి బుచ్చి, రంజాన్ ఇళ్ళపై కూడా దాడి చేశారు. గ్రామస్ధులంతా ఆగ్రహంతో ఊగిపోతుండటంతో పోలీసులు తమ్మినేని సోదరుల ఇళ్లకు రక్షణకవచంగా నిలిచారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడిషినల్ డిసిపి శబరీశ్ నేతృత్వంలో గ్రామస్తులందరిని చెదరగొట్టారు. ఒక దశలో గ్రామంలో అప్రకటిత కర్ఫూ వాతావరణం ఏర్పడింది.

తుమ్మల వర్గానికి చెందిన పలువురు టిఆర్‌ఎస్ నాయకులు సాదు రమేశ్ రెడ్డి, జొన్నలగడ్డ రవి, శాఖమూరి రమేశ్, జంగం భాస్కర్ తదితర నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఖమ్మం రూరల్ పోలీసులు తమ్మినేని కృష్ణయ్య భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆసుపత్రిలో తమ్మినేని కృష్ణయ్య మృత దేహాన్ని సందర్శించి నివాళ్ళులర్పించారు. గ్రామంలో ఉద్రిక్తత వాతవరణం ఏర్పడటంతో స్పెషల్ పార్టీ పోలీసులతో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. తన తండ్రిని తమ్మినేని వీరభద్రం, తమ్మినేని కోటేశ్వర రావులే హత్య చేయించారని హతుడి భార్య, కుమార్తె, కుమారుడు ఆరోపించారు. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News