Home జోగులాంబ గద్వాల్ శాస్త్రోక్తంగా తుంగభద్ర పుష్కరాలకు అంకురార్పణ

శాస్త్రోక్తంగా తుంగభద్ర పుష్కరాలకు అంకురార్పణ

TRS ministers attend tungabhadra pushkaralu

 

గద్వాల : పవిత్రమైన తుంగభద్ర నది తరంగములను చూసినంత మాత్రముననే కోటి జన్మలలో చేసిన పాపాలు సహితం నశిస్తాయన్న శాస్త్రాలకు అనుగుణంగా శుక్రవారం పవిత్రమైన తుంగభద్రానది పుష్కరాలు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించిన పిదప మద్యాహ్నం 1.23 గంటలకు పీఠాధిపతులు శాస్త్రోక్తంగా గద్వాల జిల్లా, అలంపూర్ వద్ద గల తుంగభద్రా నది పుష్కరాలను వేదమంత్రాలు, మంగళహారతుల మధ్య ప్రారంభమయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక , ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక పూజల్లో పాల్గొని పుష్కరాలను ప్రారంభించారు.

అలంపూర్ ఘాట్ వద్ద తోగుట పీఠాదిపతి మాధవనంద స్వామి హిందు దేవాలయ ప్రతిష్టాన్ పీఠాదిపతి కమలానంద భారతీస్వామిజి శాస్త్రోక్తంగా ఈ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి నదిలో పవిత్ర పుష్కర స్నానం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితిలు నెలకొని ఉన్నా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సాంప్రదాయరీతిలో శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేపట్టింది. నది పరివాహక ప్రాంతంలో 4 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచారు.

తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణా, గోదావరి వంటి పుష్కరాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తుంగభద్ర పుష్కరాలను సైతం ఘనంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ముగ్గురు మంత్రులను ఇంచార్జీలుగా నియమించారని రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పుష్కరాలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుంగభద్ర పుష్కరాలకు వచ్చేవారికి తక్కువ సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్ల పై యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండే విధంగా నదీమతల్లికి కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.

పుష్కరాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే పుష్కరాలకు రాష్ట్రప్రభుత్వం భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధం, రోడ్డు, విద్యుత్, మౌళిక సదుపాయాలు పూర్తి చేసి తుంగభద్ర పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు.పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రపాలనలో తెలంగాణలో వచ్చే పుష్కరాలకు అరకొర నిధులు కేటాయించి ఎక్కడ అభివృద్ధి చేయలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన గోదావరి, భీమా, కృష్ణ పుష్కరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ప్రస్తుతం తుంగభద్ర పుష్కరాలను సైతం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర కెసిఆర్ సారధ్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ కమీషనర్ అనిల్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మెన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ శృతిఓఝా, ఎస్పీ రంజన్, రతన్‌కుమార్, ఆలయ ఈఓ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

TRS ministers attend tungabhadra pushkaralu