Home మహబూబ్‌నగర్ రానున్నది టిఆర్‌ఎస్ ప్రభుత్వమే

రానున్నది టిఆర్‌ఎస్ ప్రభుత్వమే

TRS Ministers Speech In Election Campaign

ఉప ముఖ్యమంత్రి  మహమూద్ అలీ
ప్రచార కార్యాలయం ప్రారంభం
టిఆర్‌ఎస్ ఎన్నికల రథాన్ని ప్రారంభించిన కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్

రాష్ట్రంలో రానున్నది టిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవా రం స్థానిక న్యూటౌన్‌లో టిఆర్‌ఎస్ నూత న కార్యాలయాన్ని మంత్రి లకా్ష్మరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ లో గత 60 ఏళ్లలో  జరగని అభివృద్ధి ఈ నాలుగున్నరేళ్లలో జరిగిందని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణం చేయడంలో ఎంతగానో కృషి చేశారని తెలిపారు. దేశంలో రోజురోజుకు ప్రాబల్యం కోల్పోతున్న కాంగ్రెస్‌ని తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధ్దంగా లేరని విమర్శించారు. టిఆర్‌ఎస్ ని ఎదుర్కోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని అలీ ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని ప్రజలు ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడమే లాంఛనంగా మిగిలి ఉందని  జోష్యం చెప్పారు.

మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా తమ  పక్షానే ఉన్నారని స్పష్టం చేశారు. అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో  లేరని చెప్పారు. మహాకూటమి పేరుతో వస్తున్న టిడిపి, కాంగ్రెస్‌కు జిల్లాలో మహాఓటమి తప్పదని హెచ్చరించారు. తెలంగాణను వ్యతిరేకించిన టిడిపితో కాంగ్రెస్ విలువల్లేకుండా అనైతిక పొత్తు పెట్టుకోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఈ ఆగ్రహాన్ని వచ్చే ఎన్నికల్లో మహాకూటమికి తగిన గుణపాఠం ద్వారా వెలిబుచ్చనున్నారని పేర్కొన్నారు. ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని సీట్లలో టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరిగి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని పేర్కొన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే చూడాలనే కోరుకుంటున్నారని చెప్పారు.  జిల్లాలో అన్ని స్థానాల్లో టిఆర్‌ఎస్ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు అన్ని వర్గాలకు మెచ్చిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్  తెరాస అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నాలుగున్నరేళ్లలో చేసి చూపించానని పేర్కొన్నారు. మయూరి పార్క్, ట్యాంక్‌బండ్, ఐటీ పార్క్, మెడికల్ కాలేజ్, నూతన కలెక్టరేట్, బైపాస్, రైల్వే డబుల్‌లైన్, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, గ్రామ గ్రామానికి, వీధి వీధికి సీసీరోడ్లు, డ్రైనేజీ వంటి పనులకు దాదాపు రూ.3,019 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు. మరోసారి టిఆర్‌ఎస్‌కు అవకాశం  ఇస్తే మహబూబ్‌నగర్ జిల్లాను నందనవనం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు,  కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ ఎన్నికల ప్రచార రథాన్ని శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో ప్రారంభించారు.

TRS Ministers Speech In Election Campaign

Telangana News