Thursday, April 25, 2024

కెసిఆర్‌లా ఆలోచించే సిఎం దేశంలోనే లేరు: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

దళిత బాంధవ్యుడు సిఎం కెసిఆర్
దళిత సాధికారికతతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు
ఇకపై కెసిఆర్ వెంటనే దళిత వర్గాలు
భూమిలేని దళిత రైతుకు రైతుబీమా వర్తింపు
కెసిఆర్‌లా ఆలోచినంచిన వ్యక్తి దేశంలో మరే ముఖ్యమంత్రి లేరు
పిసిసి అధ్యక్షుడు ఎవరైనా…కాంగ్రెస్ మునిగిపోయే నావనే
బిజెపిది ముందు నుండి దళిత వ్యతిరేక భావజలమే
మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన దళిత సాధికారికత పథకంతో ఆయా వర్గాల జీవితాల్లో కొత్త వెలుగు ప్రసాదిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు. ఆర్ధికంగా చితికిపోయిన దళితుల కుటుంబాలను ఒక యూనిట్‌కు లెక్కించి రూ. 10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించాలనుకోవడం చాలా గొప్ప నిర్ణయామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పథకం కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కానుందన్నారు. సిఎం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని యావత్ దళిత జాతి పక్షాన కెసిఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో దళిత జాతి మొత్తం కెసిఆర్ వెంటనే ఉంటుందన్నారు. ఇప్పటికే కెసిఆర్ చిత్రపటాలకు రాష్ట్రమంతటా పాలాభిషేకం చేస్తున్నారన్నారు. రీసెర్చ్ స్కాలర్‌లకు స్టైఫండ్ ఇచ్చే విషయాన్నీ కూడా సిఎం పరిశీలిస్తామనడం మరింత సంతోషాని కలిగిస్తోందన్నారు.
సోమవారం టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మరో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపి పసునూరి దయాకర్, ఎంఎల్‌సి రాజేశ్వర్‌రావు, శాసనసభ్యులు క్రాంతికిరణ్, నోముల భగత్‌తో ఏర్పాటు మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ, దళిత సాధికారిత పథకాన్ని కొత్త గా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. దీనిరై రెండు రోజుల క్రితం జరిగిన అఖిల పక్ష సమావేశంలో అన్ని అంశాల పై కూలంకషంగా చర్చించామన్నారు. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 11,500 దళిత కుటుంబాలకు రూ.1200 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. గడిచిన ఏడేళ్లలో దళితుల అభ్యున్నతికి సుమారు రూ.55 వేల కోట్లు వెచ్చించామన్నారు. దళిత విద్యార్థుల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దళిత ఉద్యోగుల ప్రమోషన్లను పకడ్బందీగా అమలు చేయాలని అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే దళితులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు.

భూములులేని దళిత రైతుకు రైతుబీమా
భూములు లేని దళిత రైతులకు కూడా రైతు బీమా అమలు చేయాలని సిఎం కెసిఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని బాల్కసుమన్ అన్నారు. దళితుల కోసం ఈ స్థాయిలో ఆలోచించిన సిఎం ఇప్పటి వరకు భారతదేశంలోనే ఎవరు లేరన్నారు. దళిత సాధికారికత పథకం కింద త్వరలోనే దళిత కుటుంబాల సమగ్ర సర్వే చేసి లబ్ది దారుల ఎంపిక జరగనుందన్నారు. పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో దళిత వాడల్లో ప్రత్యేక పర్యటనలు ఉంటాయన్నారు. దళిత జాతి చరిత్రలో కెసిఆర్ అధ్యక్షత జరగిన సమావేశం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదన్నారు. ఏకంగా పదకొండు గంటల పాటు కెసిఆర్ ఎంతో చిత్తశుద్ధి తో సమావేశాన్ని నిర్వహించారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిలో ఆయన ఎలాంటి చిత్తశుద్ధిని ప్రదర్శించారో దళితుల ఉద్దరణకు కూడా అలాంటి చిత్తశుద్ధిని చూపుతున్నారన్నారు.

అంతకు ముందు అనేక మంది సిఎంలు వచ్చి పోయినా కెసిఆర్‌లా దళితుల అభివృద్ధికి ఇంతలా ఆలోచించలేదన్నారు. దళితులకు కల్యాణ లక్ష్మి ద్వారా రూ.1420 కోట్ల మేర లబ్ది జరిగిందన్నారు. ఎస్‌సి హాస్టల్ ల సంఖ్యను 870కి పెంచామన్నారు. దళిత విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ల మొత్తాన్ని భారీగా పెంచామన్నారు. అంబెడ్కర్ ఓవర్సీస్ విద్యానిధితో రూ.100 కోట్ల మేర లబ్ది జరిగిందన్నారు.600లకుపైగా దళిత విద్యార్థులకు ఈ పథకంతో మేలు జరిగిందన్నారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న దళితులకు ప్రోత్సాహక మొత్తాన్ని కూడా ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. దళిత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా 13లక్షల కుటుంబాలకు మేలు జరుగుతోందన్నారు.ఎస్‌సి స్పెషల్ డెవలప్‌మెంట్ పథకానికి చట్ట రూపం ఇవ్వడంతో నిధుల మల్లింపు జరగడం లేదన్నారు. దళితులకు ఏడేళ్లలో 16వేల ఎకరాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు.ఎకానమీ సపోర్ట్ స్కీం ద్వారా వేలాది దళిత కుటుంబాలకు మేలు జరిగిందన్నారు.

ఏడేళ్లలో గురుకుల విద్యాసంస్థలపై రూ.4438 కోట్ల ఖర్చు
దళిత విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం 238 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు నెలకొల్పిందని బాల్కసుమన్ అన్నారు. దీంతో దళిత విద్యార్థుల పై ప్రభుత్వం పెట్టే ఖర్చు భారీగా పెరిగిందన్నారు. గత ఏడేళ్లలో దళితుల గురుకుల విద్యాసంస్థల కోసం రూ.4438 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చుచేసిందన్నారు. ఫలితంగా ఏడు లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగిందన్నారు.

పిసిసి అధ్యక్షుడు ఎవరైనా ఒరిగేది ఏమీ లేదు
రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా ఒరిగేది ఏమీ లేదని బాల్కసుమన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగే నావ అని అన్నారు. అందువల్ల కొత్తగా రేవంత్‌రెడ్డి వచ్చినా… మరో నేత వచ్చినా ఆ పార్టీతో టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం అంటూ ఏమీలేదన్నారు. రేవంత్‌రెడ్డి గతంలో టిటిటిపిని ముంచాడు.. ఇప్పుటు కాంగ్రెస్‌ను కూడా పూర్తిగా నట్టేట ముంచడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌లో అపుడే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయన్నారు. రేవంత్ మాటలను రాష్ట్ర ప్రజులు ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని…ఇక కాంగ్రెస్ పెద్దలు అయితే ఆయన పేరు ఎత్తడానికి కూడా సముఖంగా లేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఆ పార్టీకి దళితులు ఓట్లేసే యంత్రాలు గానే కనిపిస్తారన్నారు. ఇక బిజెపిది ఎపుడు దళిత వ్యతిరేక భావ జాలమేనని ఆయన వ్యాఖ్యానించారు.

TRS MLA Balka Suman Press meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News