Home తాజా వార్తలు రామగుండం, పటాన్‌చెరు ఎంఎల్‌ఎలకు కరోనా

రామగుండం, పటాన్‌చెరు ఎంఎల్‌ఎలకు కరోనా

TRS MLAs tests positive for covid-19

 

సినీ దర్శకుడు తేజకు వైరస్
జిహెచ్‌ఎంసి 273, జిల్లాల్లో 710 కేసులు
వైరస్ దాడిలో మరో 11 మంది మృతి
ప్రముఖులకు పట్టుకున్న కరోనా టెన్షన్
హెల్త్ కమిషనర్‌గా వాకాటి కరుణ బాధ్యతలు స్వీకరణ
గాంధీలో మంత్రి ఈటల పర్యటన
66,677కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కేసులు కాస్త తగ్గాయి. ఆదివారం 9443 టెస్టులు చేయగా, 983 పాజిటివ్‌లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. వీనిలో జిహెచ్‌ఎంసి పరిధిలో కేవలం 273 మంది ఉండటం గమనార్హం. గత నెల రోజులుగా ప్రతి రోజు సగటున 500లకు తగ్గని కేసులు ఆదివారం సగానికి తగ్గినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌లో ప్రకటించారు. దీంతో పాటు ఆదిలాబాద్‌లో16, భద్రాది 16,జగిత్యాల 12, జనగాం 13, భూపాలపల్లి 12,గద్వాల 12, కామారెడ్డి 28,కరీంనగర్ 54,ఖమ్మం 23, ఆసిఫాబాద్ 7,మహబూబ్‌నగర్ 21 , మహబూబాబాద్ 18, మంచిర్యాల 1, మెదక్ 18, మేడ్చల్ మల్కాజ్‌గిరి 48, ములుగు 14, నాగర్‌కర్నూల్ 32, నల్గొండ 11,నారాయణపేట్ 2, నిర్మల్ 2, నిజామాబాద్ 42, పెద్దపల్లి 44,సిరిసిల్లా 20, రంగారెడ్డి 73, సంగారెడ్డి 37, సిద్ధిపేట్ 6, సూర్యాపేట్ 11, వికారాబాద్ 4,వనపర్తి 26, వరంగల్ రూరల్ 25, వరంగల్ అర్బన్ లో 57, యాదాద్రిలో మరో 5మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 11 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 67,660కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 48,609కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 18,500 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 11,911మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 551కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రముఖులకు కరోనా టెన్షన్…
కరోనా వైరస్ సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులకూ వణుకుపుట్టిస్తుంది. తాజాగా వైరస్ సోకిన వారిలో రామగుండ ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్,ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్, అతని ఫ్యామిలీ, పటాన్‌చెరు ఎంఎల్‌ఏ మహిపాల్‌రెడ్డి ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా సినీడైరెక్టర్ తేజాకు కూడా వైరస్ తేలినట్లు సమాచారం. దీంతో అతని ప్రైమరీ కాంటాక్ట్‌లను ట్రేస్ చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

హెల్త్ కమిషనర్‌గా వాకాటి కరుణ బాధ్యతలు స్వీకరణ…
ఇటీవల హెల్త్ కమిషనర్‌గా నియామకమైన వాకాటి కరుణ సోమవారం బాధ్యతలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో మెడికల్ జాక్ ప్రతినిధులు ప్రత్యేకంగా కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కూడా ఆమె ఓసారి హెల్త్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, మళ్లీ తిరిగి హెల్త్‌డిపార్ట్‌మెంట్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని పలువురు వైద్యులు తెలిపారు.

గాంధీలో మంత్రి పర్యటన…

కోవిడ్ నోడల్ కేంద్రం గాంధీలో మంత్రి ఈటల రాజేందర్ సోమవారం పర్యటించారు. అనంతరం అన్ని విభాగాల హెచ్‌ఓడిలతో సమావేశమయ్యారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ…చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్ వివరాలు ఫోన్ ద్వారా ఉదయం, సాయంత్రం బంధువులకు తెలపడానికి సమన్వయ కర్తలను ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రతి రూంకి వెంటిలేషన్ సక్రమంగా ఉండాలని తెలిపారు. అయితే ప్లాస్మా ఇప్పటి వరకు 13 మందికి ప్లాస్మా చికిత్సను అందిస్తే 11 మంది బ్రతికారని వైద్యులు మంత్రికి తెలిపారు. ఈసందర్బంగా వారిని మంత్రి అభినందించారు. అనంతరం గాంధీలో అకాడమిక్ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 200 బెడ్స్‌ను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలోడిఎంఇ డా రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ డా రాజరావు, డా కరుణాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

TRS MLAs tests positive for covid-19