Home తాజా వార్తలు అప్పుడే విజయం ఖాయమైంది

అప్పుడే విజయం ఖాయమైంది

Pothuganti Ramuluకెసిఆర్ ఆశీర్వాదమే కొండంత అండ
నాగర్‌కర్నూల్‌ను సాగునీటి రంగంలో అభివృద్ధి చేస్తా
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు పోరాడుతా
నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లో రికార్డుస్థాయి మెజార్టీతో గెలుస్తా
నాగర్‌కర్నూల్ ఎంపి అభ్యర్థి పోతుగంటి రాములు

మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న నాకు గెలుపు ఎప్పుడో ఖరారు అయ్యిందని భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నామని టిఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి పోతుగంటి రాములు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోతుగంటి రాములును పలకరించిన ‘మన తెలంగాణ’ నాగర్‌కర్నూల్ ప్రతినిధికి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ విశేషాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు స్థానికేతరులే, దీనిపై మీ అభిప్రాయం ?
నాగర్‌కర్నూల్ పార్లమెంట్లో అనాదిగా స్థానికేతరులే పాగ వేశారు. అభివృద్ధిని మరిచారు. నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మొదటి సారి ఎన్నికల బరిలో నిలిచాను. స్థానికుడినైనందున ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి తోడు తాను టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉండండతో ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది. దీని అంతటికి కారణం కెసిఆర్ వల్లె అభివృద్ధి సాధ్యమనే భావన ప్రజల్లో ఉండడమే.కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న మల్లు రవి ఖమ్మం జిల్లాకు చెందిన వారు. బిజెపి నుంచి బరిలో ఉన్నబంగారు శృతి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు. అందుకే ఈ సారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. స్థానికులకే అవకాశం ఇవ్వాలన్న ప్రజల సంకల్పమే తన గెలుపునకు బాటలు వేస్తుంది.

పుట్టపాగ మహేంద్రనాథ్ గురించి మీ అభిప్రాయం ?
మాజీ మంత్రి , అభినవ అంబేద్కర్ పుట్టపాగ మహేంధ్రనాథ్ ఆశయ సాధనే లక్షంగా పనిచేస్తా. నేడు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం ఆయననే. పుట్టపాగ మహేంధ్రనాథ్ స్థాపించిన పాఠశాలలోనే చదివి ఈ స్థాయికి ఎదిగానూ. రాజకీయ గురువు కూడా పుట్టపాగ మహేంధ్రనాథ్. దళితులు , అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకున్ననిజమైన నిజాయితీ గల రాజకీయ నాయకునిగా పుట్టపాగ మహేంధ్రనాథ్‌కు పెట్టింది పేరు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అనగారిన వర్గాలకుసేవ చేయడమే లక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన ఆశయాలను నేరవేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తాను. తాను నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన వాడిని. పేద, దళితుల కష్టనష్టాలను దగ్గరి నుంచి చూసిన వాడిని ఆ వర్గాల అభ్యున్నతికి పాటు పడుతా. ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. టిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో కృతఙ్ఞత భావం ఉంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే టిఆర్‌ఎస్‌పట్ల విశ్వాసం పెరిగిందని తాను విశ్వసిస్తున్నాను. కొత్త పథకాలు , ప్రాజెక్టులనుసాధించే సత్తా టిఆర్‌ఎస్ పార్టీకే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు.ప్రజల నుంచి మంచి స్పందన రావడం తనకు భారీ మెజార్టీ ఇస్తుందన్ననమ్మకం ఉంది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా సాధిస్తారా ?
ప్రపంచంలోనే ఎంతో పెద్దదైన పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హో దాను సాధించడానికి పోరాడుతా. ఇప్పటికే ఎన్‌డి ఎ ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించాల్సి ఉండే కానీ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం గుర్తించలేకపోవడం బాధాకరం. 20 లక్షల ఎకరాలకు సాగునీ రు అందించే భారీ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే జాతీయ స్థూల ఆదాయం పెరగడం వల్ల దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని కేంద్రపాలకులు గుర్తించాలి. కెసిఆర్ సారధ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే వరకుపోరాడుతా .

నాగర్‌కర్నూల్ పరిధిలోని నల్లమల అటవీ ఉత్పత్తులతో ప్రాసెసింగ్ యూనిట్ల పై మీ అభిప్రాయం?
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సమీప గ్రామస్థులు , చెంచు, గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందుతున్నారు. సేకరించిన అటవీ సంపదతో వివిధ రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే అవకాశాలున్నాయి. వివిధ అటవి ఉత్పత్తులతో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడం ద్వారా శాంపోల తయారీ, వేపగింజలు, కుంకుడు కాయలు, తేనె, పసుపు, చింతపండు తదితర ఉత్పత్తులతో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే అవకాశాలున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గిరిజన కో ఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పా టు చేయడానికి కృషి చేస్తా.

ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తారు ?
టిఆర్‌ఎస్ పార్టీకి సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 4లక్షల 98వేల637మందికి రైతుబంధు పథకం అందిస్తున్నాం. 2లక్షల 66వేల 30మందికి ఆసరా పింఛన్లు , 6068మందికి ముఖ్యమంత్రి సహయనిధి , 15927మందికి కెసిఆర్ కిట్లు , 24254మందికి కళ్యాణలక్ష్మీ , షాదీముబారక్ , 51వేల 932మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ది చేకూరడం జరిగిందన్నారు. అదేవిధంగా 40వేల 990 గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. కొత్తగా 45రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పాం. కొత్తగా 1028 రోడ్లను నిర్మించడం జరిగిందని , 1840 మిషన్ కాకతీయ చెరువులు , సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టడం జరిగింది. పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్ , కల్వకుర్తి , అచ్చంపేట , కొల్లాపూర్, అలంపూర్ , వనపర్తి , గద్వాల నియోజకవర్గాలలో సంక్షేమ పథకాలతోపాటు అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది. ఇన్ని పథకాలు అందించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కింది. ఈ అంశాలే అజెండాగా ప్రచారంతో ముందుకు సాగుతున్నాం ఈ అంశాలే ప్రధానంగా ప్రజలను టిఆర్‌ఎస్ వైపుకు మొగ్గు చూపుతున్నాయి.

స్థానిక ఎమ్మెల్యేల ప్రోత్సాహం ఎలా ఉంది ?
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ , వనపర్తి, అలంపూర్, గద్వాలలో టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే భారీ మెజార్టీతో గెలుపొందారు. కొల్లాపూర్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సైతం టిఆర్‌ఎస్ కే మద్ధతు పలకడం, టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడం మరింత బలం చేకూరింది. మంత్రిసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎమ్మెల్యేలు మర్రిజనార్ధన్ రెడ్డి, గువ్వల బాల్‌రాజు, జైపాల్‌యాదవ్, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డిలు నియోజకవర్గాలలో విసృతంగా పర్యటిస్తూ నా విజయం, మెజార్టీ కోసం పాటు పడుతున్నారు.కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీలు కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు నా విజయం కోసం కష్టపడుతున్నాను. ప్రజల దీవెనలు కార్యకర్తల కష్టంతో భారీ మెజార్టీతో గెలుపొందుతా.

స్థానికేతర అభ్యర్థుల పై మీ అభిప్రాయం ?
స్థానికేతరులను నాగర్‌కర్నూల్ ఎంపిలుగా గెలిపించడం ద్వారా అభివృద్ధిలో వెనకబడ్డాము. తాను అచ్చంపేట వాసినని స్థానికుడైన నేను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను. గతంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి గెలిచిన నంది ఎల్లయ్య స్థానికుడు కాదని అతనికి సొంత ఇల్లు కాని ఆఫీసుకాని ఈ నియోజకవర్గంలో లేకపోవడం శోచనీయం. మల్లుఅనంత రాములు, మల్లురవిలు సైతం గతంలో ఇక్కడ ఎంపీలుగా స్థానికేతరులుగా ఉన్నా విధి లేని పరిస్థితిలో ప్రజలు గెలిపించారు. స్థానిక అభ్యర్థిగా తాను బరిలో ఉన్నాను. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలో సాధించిన ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే స్థానిక ప్రభుత్వాల తోడ్పాటు ఎంతో అవసరం. అందుకే టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం.

మాచర్ల, గద్వాల రైల్వేలైన్ నిర్మాణం పై మీ అభిప్రాయం ?
మాచర్ల నుంచి గద్వాల వరకు రైల్వేలైన్ నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తా. గతంలో మాచర్ల నుంచి రైచూర్ వరకు రైల్వేలైన్‌కు డిమాండ్ ఉండింది. గద్వాల నుంచి రైచూర్ వరకు నిర్మాణం పూర్తి అయ్యింది. మాచర్ల నుంచి వయా అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ , వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కేంద్రం పై వత్తిడి తేస్తాం. లేని యెడల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణానికి కృషి చేస్తా.

గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులోఉంటారా ?
ఎంపిగా గెలిచిన తరువాత ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా . నాగర్‌కర్నూల్‌లోనే ఇంటిని అద్దెకు తీసుకున్నాను.గతంలో నేను అచ్చంపేట ఎమ్మల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన నాడే ప్రజలకునిత్యం అందుబాటులో ఉన్నాను. నా హయాంలో అచ్చంపేట ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశాను. రామాన్‌పాడు పథకం ద్వారా 68 కోట్లతో అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లోని 130 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాను. అనేక అభివృద్ధి పథకాలతో పాటు రోడ్లు విద్యా, వైద్యం, వంటి సౌకర్యాలను కల్పించాను. మహేంధ్రనాథ్ స్పూర్తితో కెసిఆర్ ఆశీర్వాదంతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతాను. నా విజయాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు. భారీ మెజార్టీ ఏ లక్షంగా ముందుకుసాగుతున్నాము.

ఎంపిగా ఎంత మెజార్టీతో గెలుస్తామనుకుంటున్నారు ?
నాగర్‌కర్నూల్ ఎంపిగా కెసిఆర్ ఆశీర్వాదంతో బరిలో ఉన్నాను. నాగర్‌కర్నూల్ ఎస్సీరిజర్వుడ్ పార్లమెంట్ స్థానానికి తనను కెసిఆర్ అభ్యర్థిగా ప్రకటించిన నాడే నా విజయం ఖాయమైందని భావిస్తున్నారు. సుమారు రెండున్నర లక్షల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తానన్న ధీమా తనకు ఉంది. 6 నియోజకవర్గాలలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే సైతం టిఆర్‌ఎస్ పార్టీలో చేరబోతుండడం వల్ల అక్కడ కూడా భారీ మెజార్టీ సాధిస్తాం. దళితుడైన నాకు కెసిఆర్ పిలిచి టికెట్ ఇచ్చారు. గతంలో తనకు మంత్రిగా పని చేసిన అనుభవం ఉండడం నేను ఎంపిగా గెలిస్తే మరింతగా అనుభవంతో పనిచేసి కేంద్ర ప్రాజెక్టులన్నీ సాధిస్తాను. కెసిఆర్ ఆశీర్వాదం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తాను.

TRS MP Candidate Pothuganti Ramulu Interview with Mana Telangana