Home తాజా వార్తలు కెసిఆర్ … అతిపెద్ద హిందువు : కెకె

కెసిఆర్ … అతిపెద్ద హిందువు : కెకె

TRS MP KK Comments On CM KCRహైదరాబాద్‌: తెలంగాణ సిఎం, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను మించిన హిందువు దేశంలో ఎవరూ లేరని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు స్పష్టం చేశారు. మనుషలందరూ ఒక్కటేనన్నది తమ పార్టీ విధానమని ఆయన పేర్కొన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామని కెకె వెల్లడించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 85 శాతం సీట్లను వెనుకబడిన వర్గాలకే కేటాయించి, సామాజిక న్యాయం పాటించామని ఆయన చెప్పారు.  జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ వంద సీట్లకు పైగా గెలిచి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించి, వారి మద్ధతు కూడగట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. శనివారం కెకె తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ వరదలను చూసి చలించిన సిఎం కెసిఆర్ బాధితులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారని, అయితే వరదబాధితులకు సాయం అందకుండా బిజెపి నాయకులు అడ్డుకున్నారని, వారిని నిలదీయాలని ఆయన నగర ప్రజలను కోరారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత  ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో దళితులు, మహిళల మీద దాడులు పెరిగిపోయాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమం పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని, వారికి గట్టి గుణపాఠం చెప్పి, టిఆర్ఎస్ ను గెలిపించాలని కెకె నగర ప్రజలను కోరారు.