Home తాజా వార్తలు చర్చలకు రండి… మధ్యవర్తిత్వంగా ఉంటా

చర్చలకు రండి… మధ్యవర్తిత్వంగా ఉంటా

TRS MP KK

హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి కార్మికుల సమ్మె పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు పేర్కొన్నారు. టిఎస్ ఆర్‌టిసి సమ్మెపై సోమవారం ఢిల్లీ నుంచి టిఆర్‌ఎస్ సెక్రటరీజనరల్, రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు కె.కేశవరావు ఒక ప్రకటన విడుదల చేశారు. టిఎస్ ఆర్‌టిసి కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు, పరిస్థితులు చేదాటిపోకముందే ఆర్‌టిసి యూనియన్ నేతలు సమ్మె విరమింపజేసి చర్చలకు రావాలని ఆయన కోరారు. ప్రభుత్వంలో టిఎస్‌ఆర్‌టిసి విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం పరిశీలించే విధంగా తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. టిఎస్ ఆర్‌టిసి నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేయాలని కెకె విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం గతంలో ఇతరరాష్ట్రాలకు ఆదర్శంగా అర్‌టిసి కార్మికుల సమస్యలను పరిష్కరించిందని ఆయన గుర్తుచేశారు. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయితే అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజ్ క్యారేజ్‌ల విషయంలో సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన ప్రస్తుత సమ్మెనేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని టిఎస్ఆర్టీసిని నాయకులకు కెకె చెప్పారు. 2018 ఎన్నికల టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నాకు అనేక విషయాలు, ప్రజల డిమాండ్లు, రాష్ట్రాభివృద్ధిపై పూర్తి అవగాహన ఉంది. టిఎస్ ఆర్‌టిసిని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదన టిఆర్‌ఎస్ ఎన్నికలప్రణాళికలో లేదు. అర్‌టిసియే కాదు.. ఏ ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే ప్రభుత్వ పాలసీని మార్చ్తుకోవడమే అవుతుందని తెలిపారు. కాగా, కెకె ప్రకటనను టిఎస్ ఆర్‌టిసి కార్మికులు, నాయకులు ఫోన్ ద్వారా స్వాగతించినట్లు తెలుస్తోంది.

TRS MP KK Rao offers to mediate on RTC Strike