Home తాజా వార్తలు కాంగ్రెస్, టిడిపిల కలయిక అనైతికం, నీచం

కాంగ్రెస్, టిడిపిల కలయిక అనైతికం, నీచం

TRS MP Vinod Kumar Fires on TDP

రెండు పార్టీలనూ బొంద పెడతారు
తెలంగాణకు టిడిపి ద్రోహం జగద్విదితం – కరీంనగర్ ఎంపి వినోద్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ కోసం కొట్లాడిన టిఆర్‌ఎస్‌ను ఓడించడం కోసం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకుంటే అంతకంటే అనైతికం, నీచం మరొకటి ఉండదని, ఆ ప్రయత్నం ఆ రెండు పార్టీలకూ ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. పద్నాలుగేళ్ళపాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్‌ఎస్ కొట్లాడుతూ ఉంటే ఏనాడూ నోరు మెదపని కాంగ్రెస్ నేతలు, అడుగడుగునా తెలంగాణపై విషం చిమ్మే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలకూ సమాధి కడతారని అన్నారు. తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వనంటూ అప్పటి సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి నిండు సభలో వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులంతా మూకుమ్మడిగా ఖండించారని, నిరసన తెలిపారని, కానీ తెలంగాణకే చెందిన కాంగ్రెస్ సభ్యులు మాత్రం మౌనంగా ఉంటూ ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని వినోద్ గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అర్ధాంతరంగా విరమించుకోవడం, లోయర్ సీలేరు డ్యాంను విలీనం చేసుకోవడం, కృష్ణానది, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దంటూ కేంద్ర జల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాశారని, ఇవన్నీ తెలంగాణను ఇబ్బంది పెట్టడానికి కాదా అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చింది మేమే… ఇచ్చింది మేమే… అంటూ బీరాలు పలికే కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే అంతకంటే అపవిత్ర కలయిక మరొకటి ఉండబోదని, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురనున్నట్లు ఆ పార్టీల నేతలే వ్యాఖ్యానిస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లోనే ఖరారవుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ప్రజలే ఈ రెండు పార్టీలకు తగిన సమాధానం చెప్తారని, రెండింటినీ కలిపి బొందపెడతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికిలోకి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతోనని, ఎన్‌టిఆర్ కాలం నుంచి ఇటీవలి వరకు అదే సిద్ధాంతంతో వ్యవహరించిందని, కానీ అవకాశవాద రాజకీయాల కోసం ఇప్పుడు సైద్ధాంతికంగా బద్ధవిరుద్ధమైన పార్టీలు కేవలం టిఆర్‌ఎస్‌ను ఓడించడానికే పొత్తు కుదుర్చుకుంటున్నాయని అన్నారు. దీన్నిబట్టే ప్రజల్లో టిఆర్‌ఎస్‌కు ఎంత మద్దతు ఉందో, రానున్న ఎన్నికల్లో ఎంత భారీ మెజారిటీ వస్తుందో, కాంగ్రెస్ దానికి ఏ విధంగా భయపడుతుందో అర్థమవుతుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేకుండానే కృష్ణా, గోదావరి నదులపై సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని, టిఆర్‌ఎస్ ఎంపిలుగా తాము ఎంతో శ్రమకోర్చి కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీ, పర్యావరణ, హైడ్రాలజీ తదితర కీలకమైన అనుమతులు తెచ్చుకుంటూ ఉంటే అడ్డుకోడానికి విశ్వప్రయత్నాలు చేయడం మాత్రమే కాక కోర్టులను ఆశ్రయించి పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేసిందని, నిజంగా తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షిస్తే ఈ పనులు చేసేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రజలు గమనించారని, ఎన్నికల్లో తగిన బుద్ధి నేర్పుతారని అన్నారు. హైదరాబాద్‌మీదా, తెలంగాణ మీదా తన పెత్తనాన్ని కొనసాగించడానికి తెలుగుదేశం శతవిధాలా ప్రయత్నిస్తోందని, అధికార దాహంతో అల్లాడిపోతోందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా సాకారం చేసుకోవాలని భావిస్తోందని వినోద్ వ్యాఖ్యానించారు.

నాడు కాంగ్రెస్‌ను తిట్టి&తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తూర్పారబట్టిన చంద్రబాబు వ్యక్తిగతంగా సోనియాగాంధీని సైతం విమర్శించారు. ‘కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని& ’, ‘త్వరలో కాంగ్రెస్ పీడ విరగడవుతుంది’, ‘తెలుగుజాతిని చంపేస్తున్న సోనియాగాంధీ ఒక గాడ్సే’, ‘సోనియాగాంధీ అవినీతిలో అనకొండ&” ఇలా అనేక రకాలుగా చంద్రబాబు 2013, 2014 కాలంలో వ్యాఖ్యానించారు. పాదయాత్ర సందర్భంగా రేపల్లెలో ‘కాంగ్రెస్‌ను చంపేయాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇటలీ వనితకు తెలుగు ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు ఏం తెలుసంటూ 2013 డిసెంబరు 30న జరిగిన ‘తిరుపతి ప్రజాగర్జన’ సభలో వ్యాఖ్యానించారు. 2014 ఫిబ్రవరి 27న విజయనగరంలో జరిగిన సభలో ‘తెలుగు ప్రజలను విభజించిన సోనియాగాంధీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల పాలిట గాడ్సే’ అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలను వెన్నుపోటు పొడిచింది, దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ సోనియాగాంధే కారణం’ అని విమర్శించారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌తో తెలుగుదేశం జతకడుతోందని, ఒకప్పటి వైఖరికి, ఇప్పుడు ప్రదర్శిస్తున్నవైఖరికి తేడా ఎందుకో, ఏ ప్రయోజనాలను ఆశించో అనేది ప్రజలను తొలచివేస్తోంది.