Friday, March 29, 2024

కమలం నేతలవి కాకి లెక్కలు

- Advertisement -
- Advertisement -

బండి సంజయ్, ఎంపి అరవింద్ అసత్య ప్రచారాలు
కొవిడ్ నివారణకు కేంద్రం ఇచ్చింది రూ.290 కోట్లే, రూ.7వేల కోట్లు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు
రాష్ట్రం నుంచి కేంద్రానికి వివిధ పద్దుల కింద రూ.50 వేల కోట్లు వెళ్లాయి
రాష్ట్రానికి మాత్రం వచ్చింది రూ.23 వేల కోట్లే, బిజెపి నేతల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది
హస్తినలో టిఆర్‌ఎస్ ఎంపిల ఫైర్

TRS MPs fires on BJP MPs in Delhi

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కేంద్రం కోతలు పెడుతున్నా బిజెపి ఎంపిలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంపిలు మండిపడ్డారు. తెలంగాణ నుంచి రూ.50 వేల కోట్లు కేంద్రానికి వెళ్లుతున్నా ఆ మేరకు తిరిగి రాష్ట్రానికి నిధులు రావడం లేదని టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, బిపి పాటిల్ విచారం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారానికి పాల్పడుతున్న రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలు ప్రజలు, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని టిఆర్‌ఎస్ ఎంపిలు సవాల్ విసిరారు. మంగళవారం కోవిద్‌పై జరిగిన చర్చలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి అశ్వినీ కుమార్ చౌదరి తెలంగాణకు రూ. 290 కోట్లు కేంద్రం పలు పద్దుల కింద ఇచ్చిందని స్పష్టం చేశారు. అయితే బిజెపి ఎంపిలు అరవింద్, సంజయ్ మాత్రం తెలంగాణకు రూ.7వేల కోట్లను కేంద్రం కోవిడ్ నిధులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ఎంపిలు రంజిత్ రెడ్డి, బిబిపాటిల్, వెంకటేష్ నేత ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలకు దమ్ము ఉంటే ప్రజల సమక్షంలో చర్చకు రావాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రతి సంవత్సరం కేంద్రానికి వివిధ పద్దుల కింద రూ.50 వేల కోట్లు ఇస్తుంటే తిరిగి కేవలం రూ.23 లేదా 24 వేలకోట్లు ఇస్తుందే కానీ కనీసం ఇచ్చిన డబ్బులను కూడా తిరిగి ఇవ్వడం లేదన్నారు. అదనంగా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కపైసా రావడం లేదన్నారు. రాష్ట్రం ఇస్తున్న నిధుల్లోంచి పిఎం జన్‌ధన్ కింద రూ. 750 కోట్లు, ఎల్‌పిజి సిలిండర్ల సబ్సిడీ కింద రూ.130 కోట్లు, పెన్షన్ కింద రూ.66 కోట్లు, పిఎఫ్ కోసం 82 కోట్లు ఇస్తుందని ఎంపి రంజిత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలువుతున్న ఒక్క రైతుబంధు పథకానికే రూ.7,500 కోట్లను సిఎం కెసిఆర్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అలాగే సుమారు రూ.50వేల కోట్ల రూపాయలతో తెలంగాణలో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే కేంద్రం నుంచి ఒక్కపైసా కూడా తీసుకురాని బిజెపి ఎంపిలు అసత్యప్రచారానికి మాత్రం పాల్పడతున్నారన్నారు. బిజెపి ఎంపిలు సిఎం కెసిఆర్‌ను కానీ, మంత్రి కెటిఆర్‌ను కానీ విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బిజెపి ఎంపిలు అరవింద్, సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తీవ్రంగా మందలించారు.
బండి సంజయ్ జాగ్రతగా మాట్లాడు:టిఆర్‌ఎస్ ఎంపి వెంకటేష్ నేత
కరోనాను కూడా బిజెపి ఎంపి బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారని టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా కరోనా నియంత్రణ చర్యలు సొంత నిధులతో తీసుకుంటుంటే బండి సంజయ్ కేంద్రం నిధులు ఇచ్చిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివిధ పద్దుల కింద కోవిడ్19 నివారణ కోసం కేంద్రం రూ.290 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలతో కరోనా నివారణ చర్యలు చెప్పట్టిందని చెప్పారు. కేంద్రం రూ.290 కోట్లు ఇస్తే బండి సంజయ్ రూ.7వేల కోట్లకు పైగా కేంద్రం ఇచ్చిందని అసత్యప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంజయ్ జాగ్రతగా మాట్లాడకపోతే ప్రజలు సహించరని సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు సంజయ్‌కి లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు ఆలోచించని సంజయ్ అసత్యప్రచారంతో కాలయాపన చేస్తున్నారని నిందించారు.

TRS MPs fires on BJP MPs in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News