Friday, April 19, 2024

వరి వార్

- Advertisement -
- Advertisement -

TRS MPs protest in both Houses of Parliament

కొనసాగుతున్న

ధాన్యం కొనుగోళ్లతో టిఆర్‌ఎస్ ధర్నాలతో మూడోరోజూ దద్దరిల్లిన పార్లమెంట్

ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకూ ఆందోళన ఆగదు
గందరగోళానికి సభలోనే తెరపడాలి, వ్యవసాయ మంత్రి సభలో ప్రకటించాలి
ఉభయసభల్లో నిరసన స్వరం పెంచిన టిఆర్‌ఎస్ ఎంపీలు
వెల్‌లో బైఠాయింపు, నినాదాలు
సభ్యుల నినాదాలతో హోరెత్తిన ఉభయసభలు.. నేటికి వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్ ఎంపిలు నిరసన స్వరం పెంచారు. రాష్ట్ర రైతాంగం పండించిన వడ్లు కొంటారా లేదా అంటూ ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వంను నిలదీశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి టిఆర్‌ఎస్ ఎంపీలు ఉభయసభల్లోనూ నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతులకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ లోపల, బయట ప్లకార్డులతో ఆందోళనలు చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ గురువారానికి వాయిదాపడగా.. లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా గట మూడ్రోజుల నుంచి టిఆర్‌ఎస్ ఎంపీలు ఉభయ సభలను స్తంభింపచేస్తున్నారు. గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని నినదించారు. కేంద్రం స్పష్టత ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై గందరగోళానికి సభలోనే తెరపడాలన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామన్న ఎంపి కేశవరావు.. 12 మంది రాజ్యసభ సభ్యులపైనా సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కేంద్రం రాజకీయం చేస్తోందని చెప్పారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యమంలో చనిపోయిన రైతుల లెక్కలు లేవని తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రకటించడం బాధాకరమన్నారు.

టిఆర్‌ఎస్ సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం

టిఆర్‌ఎస్ సభ్యులపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనల పట్ల అభ్యంతరం తెలిపారు. ఆందోళన విరమించి కూర్చొవాలని చెప్పారు. సభ్యులు శాంతించకపోవడం వల్ల లోక్‌సభను అరగంట పాటు వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభమైన మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంటోంది. పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై స్పష్టతనివ్వాలని టిఆర్‌ఎస్ ఎంపిలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభ్యుల ఆందోళన నడుమ సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుండటం పట్ల స్పీకర్ ఆగ్రహించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మంగళవారం కూడా టిఆర్‌ఎస్ ఎంపిలు నిరసనకు దిగారు. బుధవారం ఉదయాన్నే లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ధాన్యం సేకరణలో జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

వరదలు, పంటనష్టాలకు పరిహారంపై చర్చించాలని నోటీసులు సమర్పించారు. రాజ్యసభలో ఎంపి కెకె, లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నోటీసులు అందించారు. మరోవైపు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు నినాదాలు చేశాయి. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నివ్వాలంటూ టిఆర్‌ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాజ్యసభలో టిఆర్‌ఎస్ ఎంపీలు సంతోష్, సురేష్‌రెడ్డి, లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ నిరసన చేపట్టారు.ప్రభుత్వం విపక్షాల డిమాండ్‌లను వినిపించుకోకపోవడంతో కాంగ్రెస్, డిఎంకెలు సభనుంచి వాకౌట్ చేశారు. అయితే ఇతర పార్టీల ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ 750 మంది రైతులకు పరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న దృష్టా.. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటలకు చైర్మన్ వాయిదా వేశారు.

తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. విపక్షాల ఆందోళనల నడుమ డ్యామ్ సేఫ్టీ బిల్లు, 2019ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌పై విపక్షాలు పట్టువీడకపోవడంతో సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. మరల తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాలు పట్టువీడకపోవడంతో సభ గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన లోక్‌సభ కార్యకలాపాలు రాత్రి 7.30 వరకు సాగాయి. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రోడక్షన్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. పలు అంశాలపై చర్చించిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.

12 మంది ఎంపీలు క్షమాపణ చెబితే.. సస్పెన్షన్ ఎత్తివేస్తామన్న కేంద్ర మంత్రి

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే 12 మంది విపక్ష ఎంపిలు రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన సంగతి విదితమే. గత సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. అయితే సస్పెన్షన్ అయిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెబితే వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తామంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఎన్నో కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని, విపక్ష సభ్యులు ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొనాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియమావళి ప్రకారం ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రతి ప్రశ్నకు జవాబిస్తామని, ఇవ్వాల్టి(బుధవారం) నుంచి కీలక బిల్లులు సభలో ప్రవేశపెడతామంటూ మంత్రి జోషి పేర్కొన్నారు. అలాగే సభ హుందాగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.

వర్షాకాల సమావేశాలు చివరి రోజు అయిన ఆగస్టు 11న ప్రతిపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసిందని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. సస్పెండ్ అయిన 12 మంది సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిలు పూలోదేవి నేతం, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజామణి పటేల్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, తృణమూల్ పార్టీకి చెందిన డోలాసేన్, శాంతా ఛత్రి, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేదీ, అనిల్‌దేశాయ్, సిపిఐ, పిపిఎం పార్టీలకు చెందిన ఎంపీలు బినోయ్ విశ్వం, కరీం ఉన్నారు. ఇక మరోవైపు విపక్షనేతలు పార్లమెంట్‌లోని మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశంపై అనుసరించాల్సిన వ్యూహంపై వాళ్లు చర్చించారు. బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం తాము పోరాటం చేశామని, తాము క్షమాపణలు చెప్పబోమంటూ సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో బినోయ్ ఉన్నారు.

ఆ 12 మంది ఎంపీలకు ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సంఘీభావం

క్షమాపణలు చెప్పేది లేదని 12 మంది ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. టిఆర్‌ఎస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వీరికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ ఎంపి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ కూడా ధర్నాకు దిగిన 12 మంది ఎంపీలకు సంఘీభావం తెలిపారు. బుధవారం ఉదయం వారి దగ్గరకు వెళ్లారు. వారితో మాట్లాడారు. అనంతరం వారికి స్నాక్స్ పంచి ఇచ్చారు. ప్రభుత్వంపై పోరాడటానికి, నిరసన చేయడానికి శక్తి అవసరం అని ఆమె పేర్కొనట్లు తెలిసింది. ఈ సన్పెన్షన్‌పై అటు కాంగ్రెస్, ఇటు తృణమూల్ పార్టీలు నిరసన చేయాలని నిర్ణయించుకున్నాయి. రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ విమర్శించారు.

ధాన్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన

వరిసాగు, ధాన్యం సేకరణపై బిజెపి నేతలు, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ధాన్యం సేకరణపై తెదెపా ఎంపి కేశినేని నాని ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా సరఫరాల మంత్రిత్వశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో సేకరించిన ధాన్యం వివరాలు వెల్లడించింది. తెలంగాణలో 201819లో 51.99 లక్షల మెట్రిక్ టన్నులు, 201920లో 74.54 లక్షల మెట్రిక్ టన్నులు, 202021లో 94.53 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఎపి నుంచి 2018148.06 లక్షల మెట్రిక్ టన్నులు, 201920లో 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, 202021లో 56.67 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News