Thursday, April 25, 2024

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై లోక్‌సభలో రభస

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై లోక్‌సభలో రభస
వెల్‌లోకి దూసుకెళ్లిన టిఆర్‌ఎస్ ఎంపిలు
స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు
రెండు సార్లు వాయిదా తర్వాత నేటికి వాయిదా పడిన సభ

TRS MPs protest on paddy procurement in Lok Sabha

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో రోజూ లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమయి కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టగానే టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపిలు లేచి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని,ఆందోళన సందరంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. స్పీకర్ పోడియ ను చుట్టముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు కూడా పలు అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభా వ్యవహారాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, ఎన్‌సిపి, వామపక్షాలు, డిఎంకె పార్టీలకు చెందిన సభ్యులు వాకౌట్ చేశారు.

అయితే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు మాత్రం ఆందోళనలో కానీ, వాకౌట్‌లో కానీ పాల్గొనలేదు. గొడవ సద్దుమణగక పోవడంతో స్పీకర్ తొలుత సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టిఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయసాగారు. తెలంగాణలో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ ధాన్యం సేకరణపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న ఎ రాజా సభను మరో సారి మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల వేతనాలకు సంబంధించిన బిల్లును మంత్రి కిరెన్ రిజిజు సభకు సమర్పించిన తర్వాత స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. తొలుత దాద్రా నాగర్ హవేలి నుంచి ఇటీవల గెలుపొందిన శివసేన ఎంపి దేల్కర్ కలాబెన్ మోహన్ భాయ్ ప్రమాణ స్వీకారం చేశారు.

TRS MPs protest on paddy procurement in Lok Sabha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News