Thursday, March 28, 2024

ఇక కేంద్రంపై యుద్ధమే..!

- Advertisement -
- Advertisement -

TRS MPs to fight for Telangana GST dues

కేంద్రం మిధ్యా అని ఎన్‌టిఆర్ ఒకనాడు గర్జించారు. నేషనల్ ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని కాపాడడమే కాకుండా కేంద్ర రాజకీయాలలో వాటి ప్రాధాన్యతను పెంచారు. ఆనాడు ఉన్న దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్‌టిఆర్ ఆ పని చేశారు. అప్పటి నుండి పూర్తి స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అవకాశాలు రాకపోయినా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత మాత్రం పెరుగుతూ వచ్చింది. నేడు మరోసారి కేంద్రంపై గర్జించాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా ఆ పరిస్థితులు గమనించే… తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రం పై యుద్ధానికి సిద్ధం అయ్యారనిపిస్తుంది. అందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. శుక్రవారం పార్లమెంట్‌లో తొమ్మిది పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులను కలుపుకుని జిఎస్‌టి విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు పూనుకున్నారు.

కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల పై సభలో నిలదీయాలని ఇతరులను కలుపుకొనిపోవాలని ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దశ దిశ కెసిఅర్ నిర్దేశించిన నేపథ్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు అని అర్థం అవుతుంది. కేంద్రం పై యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అని విశ్లేషణ చేస్తే మనకు అనేక అంశాలు కనపడతాయి. వాటిలో కొన్నింటిని మనం లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. బిజెపికి 2019లో సంపూర్ణ మెజారిటీ వచ్చింది. అయినా ప్రాంతీయ పార్టీలను విస్మరించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రాజకీయ వాతావరణం లేదు. అందుకే తన భాగస్వామ్య పక్షాలను కలుపుకొని నేషనల్ డెమొక్రాటిక్ అలియన్స్ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రాంతీయ పార్టీలతో ఎప్పటికైనా ముప్పు అని భావించాడో లేక వారి మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఇచ్చిన ఎజెండాను అమలు చేయాలంటే అవి అడ్డు పడతాయని అనుకున్నాడో తెలియదు. కానీ ప్రాంతీయ పార్టీల గొంతు పిసికే పని మాత్రం పెట్టుకున్నాడనిపిస్తుంది. ఎందుకు ఇంత పెద్ద మాట అనాల్సి వస్తుందంటే! జరుగుతున్న పరిణామాలు, మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. వారి మాతృ సంస్థ ఎజెండాను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ కూడా తయారయ్యిందనే అనుమానం వస్తుంది.

దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అని కూడా అర్ధం అవుతుంది. ఈ మాట కూడా ఎందుకు అంటున్నానంటే జమిలి ఎన్నికల చర్చను ఎజెండా మీదకు తెచ్చారు. ఈ చర్చను అధ్యక్ష తరహా పాలన వైపు తీసుకువెళ్లారు. దాని కనుగుణంగా పావులు కదుపుతున్నట్లుగా కనపడుతుంది. అంతే కాదు ఒకే దేశం ఒకే చట్టం పేరుతో రాష్ట్రాలకున్న కొద్ది పాటి హక్కులను కూడా లేకుండా చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పన్నుల వసూళ్ల కోసం తెచ్చిన జిఎస్‌టి, విద్యుత్ సంస్కరణల పేరుతో తెస్తున్న చట్టం, నదీ జలాల వివాదాల పరిష్కారం పేరుతో, ప్రాజెక్ట్‌ల భద్రత పేరుతో తెచ్చిన చట్టాలు మన కళ్ల ముందు ఉన్నాయి. నీతి అయోగ్‌లో నీతి లేకుండా చేశారు. రాష్ట్రాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. తమ మాట విననివారిని నయానో భయానో లొంగదీసుకునే చర్యలకు కూడా పాల్పడుతున్న సందర్భాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. బిజెపియేతర ప్రభుత్వాలను, పార్టీలను ఇబ్బంది పెడుతున్నారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే .. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అన్నట్లుగా.. రాష్ట్రాల డబ్బులే రాష్ట్రాలకు ఇచ్చి.. దయా, దాక్షిణ్యాలతో తెలంగాణకు నిధులు ఇచ్చినట్లుగా కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉంది. దానికి తోడు రాష్ట్ర బిజెపి నాయకులు తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్లగొండలో జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని లెక్కలు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించి మీడియా సమావేశంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను గణాంకాలతో సహా బయటపెట్టారు. దీని పై చర్చకు సిద్ధమని సవాల్ కూడా విసిరారు.

కానీ ఇటు రాష్ట్ర బిజెపి నాయకత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సమాధానం ఇవ్వలేదు. కాకి లెక్కలు చెప్పి బుకాయించడం తప్ప చర్చలకు మాత్రం నిలబడరు. పన్నుల వసూళ్లలో నష్టం వచ్చినా కేంద్రమే భరిస్తుంది అని జిఎస్‌టి చట్టంలో పొందు పరిచారు. కానీ కోవిడ్ 19 కారణంగా లాక్‌డౌన్‌తో పన్నుల రాబడి తగ్గిందని చెప్పి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులకు కేంద్రం కోత పెట్టింది. పైగా ఉచిత సలహా ఒకటి ఇచ్చింది. రాష్ట్రాలు అప్పు చేసి ప్రభుత్వాన్ని నడుపుకోవడం లేదా కేంద్రం అప్పు చేసి రాష్ట్రాలకు సహాయం చేస్తే దాని భారాన్ని రాష్ట్రాలు భరించాలి అని చెప్పింది. ఇది ఎలా ఉందంటే మా ఇంటికి వస్తే నాకేమి తెస్తావు… మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు అన్నట్లుంది. ఇది న్యాయమా…. చట్టపరంగా హామీ ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేయడం ఎంతవరకు భావ్యం…. దీని మీద రాష్ట్ర బిజెపి నేతలు నోరు మెదపరు… రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే న్యాయంగా రావాల్సిన నిధులు కూడా రాకుండాపోతుంటే మాట్లాడకపోగా పైగా కేంద్రం నుండి నిధులు వరదలై పారుతున్నాయన్నట్లు మాట్లాడుతున్నారు. ఇదే ఆత్మ వంచన పర నింద అంటే.

రాష్ట్ర బిజెపి నాయకులు చెపుతున్న లెక్కలు చూస్తుంటే నవ్వొస్తుంది. కేంద్ర పథకాల కింద వచ్చిన నిధులను కూడా రాష్టానికి ఇచ్చినట్లుగా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. పన్నుల వాటాలో రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులను రావడం లేదు అని ప్రభుత్వం మొత్తుకుంటుంది. దానికి కేంద్రం నుండి సరైన సమాధానం లేదు. రాష్ట్ర బిజెపి నాయకత్వం దీనిపై నోరు విప్పకపోవడం విచారకరం. జిఎస్‌టి సెస్సు రూపంలో తెలంగాణ స్టేట్ నుంచి కేంద్రానికి రూ.18 వేల కోట్లు జమ అయ్యాయి. రాష్ట్రానికి పరిహారం రూపంలో వచ్చింది మాత్రం కేవలం 3 వేల కోట్ల రూపాయలు మాత్రమే. దీనిని బట్టి రాష్ట్రానికి అన్యాయం జరిగినట్ల్లా లేక … న్యాయం జరిగినట్ల్లా… దీనికి బిజెపి రాష్ట్ర న్యాయకత్వం చెప్పాలి.

యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో కరోనా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకొని కేంద్రం వృద్ధి రేటును 14 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. రాష్ట్రాలకు అన్యాయం చేసింది. కరోనాకు ముందు కేంద్రం అనుసరించిన ఆర్ధిక విధానాలు, పెద్ద నోట్ల రద్దుతో పాటు లాక్ డౌన్ కూడా తోడవడంతో దేశ జిడిపి ఘోరంగా క్షీణించింది. మైనస్ 23.9 కు చేరింది. దీనితో రాష్ట్రాలు చేయని తప్పుకు కష్టాలు పడాల్సి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఆర్ధికంగా కొంత నిలదొక్కుకుంది. దీనికి తలసరి ఆదాయం, వృద్ధి రేటులే నిదర్శనం. జాతీయ వృద్ధి రేటుకి, తలసరి ఆదాయానికి. తెలంగాణ వృద్ధిరేటు తలసరి అందానికి ఆస్మాన్ ఫరక్ తేడా ఉంది.

జాతీయ వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండగా తెలంగాణ వృద్ధి రేటు 11.8 శాతంగా ఉంది. అలాగే జాతీయ తలసరి ఆదాయం రూ. 1 లక్ష 34 వేల 432 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2 లక్షల 28 వేల 216 ఉంది. కేంద్రం ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దకపోగా రాష్టాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు దేశ వ్యాప్తంగా లౌకిక, ప్రజాస్వామిక విధానాలకు తిలోదకాలు ఇస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటుంది. దానిలో భాగంగా బిజెపి యేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇది దుర్మార్గం. ఇది దేశానికి మంచిది కాదు మనది గొప్ప పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన దేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశం. ఇప్పుడు మనం నిర్మించాల్సింది ప్రపంచ దేశాలను ఎదుర్కొనే బలమైన ఆర్ధిక, సైనిక సంపత్తి కలిగిన భారత్‌ను. అంతే కాదు ప్రజాస్వామిక, లౌకిక, విభిన్న సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే భారత ప్రతిష్ఠను ఇముడింపచేయాలి. అందుకు యావత్ దేశం కృషి చేయాలి. మోడీ నాయకత్వంలోని కేంద్రం పోకడల పై యుద్ధానికి సిద్ధం అవుతున్న కెసిఆర్‌కు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది.

పి.వి శ్రీనివాసరావు- (సీనియర్ జర్నలిస్టు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News