Wednesday, November 30, 2022

ఎంఎల్‌సి ఎన్నికల్లో కొనసాగుతున్న గులాబీ జైత్రయాత్ర

- Advertisement -

పోటీ లేకుండానే ఆరు స్థానాలు కైవసం
ధృవీకరణ పత్రాలను అందుకున్న టిఆర్‌ఎస్ అభ్యర్ధులు
మరో ఆరు స్థానాల గెలుపుపై పార్టీ అధిష్టానం దృష్టి

TRS Party candidate won on MLC Elections

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో గులాబీ పార్టీ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పోటీ లేకుండానే ఆరు ఎంఎల్‌సి స్థానాలను ఇప్పటికే గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా పార్టీ అభ్యర్ధులు సంబంధిత అధికారుల నుంచి ధృవీకరణ పత్రాలు కూడా పొందారు. వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు. కాగా కరీంనగర్‌లో రెండు స్థానాలు, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్ధులతో పాటు కొందరు స్వతంత్రులు కూడా బరిలో నిలవడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఈ స్థానాలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతుండగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.
అయితే ఎన్నికలు జరుగుతున్న ఆరు ఎంఎల్‌సి స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు అధికార టిఆర్‌ఎస్ పకడ్బంది వ్యూహరచన చేసింది. బరిలో నిలిచిన ప్రత్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా పోలింగ్ మొత్తం తమ వైపు పడేలా ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు, ఎంపిలకు, శాసనసభ్యులకు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించింది. ఎన్నికలు జరుగుతున్న స్థానిక సంస్థల నియోజకవర్గం పరిధిలో మొత్తం ఉన్న ఓట్లు ఎన్ని? అందులో తమ పార్టీ బలం ఎంత? ప్రత్యర్ధి పార్టీలకు ఏ మేరకు ప్రజాప్రతినిధుల (స్థానిక సంస్థల ఓటర్లు) బలం ఉంది? వారిలో ఎంత మంది తమవైపుకు తిప్పుకునేందుకు అవకాశం ఉంది? తదితర అంశాలపై ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులు దృష్టి సారించారు. ఈ మేరకు ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు జరిగే నాటికి ప్రత్యర్ధులను పూర్తిగా బలహీన పరిచే విధంగా పదునైన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అయితే అదే స్థాయిలో ప్రతిపక్షాలు కూడా అధికార పక్షం రచిస్తున్న వ్యూహాలను బెడిసికొట్టే విధంగా ప్రతివ్యూహాలను సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ప్రతిపక్షాలకు గెలిచే స్థాయిలో సంఖ్యా బలం లేకపోయినప్పటికీ ఉన్న ఓట్లను కాపాడుకోవడంతో పాటు వీలైతే అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులకు గాలం వేయాలని తహతహలాడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన అధికార పార్టీ ముందస్తుగానే తమ పార్టీ అభ్యర్ధులను రహస్య స్థావరాలకు తరలించారు. ఏ ఒక్క ఓటు చేజారకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్ధుల ఓట్లపై దృష్టి సారించి వాటిని గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు. దీంతో ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంత్రి కెటిఆర్‌ను కలిసిన ఎంఎల్‌సిలు

రంగారెడ్డి జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంఎల్‌సిలు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజులు శుక్రవారం సాయంత్రం టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌ను కలుసుకున్నారు. వారితో పాటు మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. కాగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు ఎంఎల్‌సిలను మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా పనిచేయాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Latest Articles