Thursday, April 25, 2024

తొలి ప్రాధాన్యత ఓట్లపైనే… ‘గులాబీ’ గురి

- Advertisement -
- Advertisement -

TRS Party concentrate on First preference vote

 

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడవు దగ్గర పడినకొద్ది ప్రచారం హోరేత్తుతుంది.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 14న పోలీంగ్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో బరిలో నిలిచిన 71మంది అభ్యర్థ్ధులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒక వైపు ఎండలతో పాటు ప్రచార వేడి కూడా రోజు రోజుకు రగులుతుంది. ఈ ఎన్నికల్లో ప్రచారం చేసే అభ్యర్థ్ధులంతా తొలి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని ఓటర్లను బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికి అంతర్గతంగా రెండో ప్రాధాన్యత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికార టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థ్ది, సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం ఈసారి ఏవిధంగానైనా తొలి ప్రాధాన్యత ఓట్లపైనే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారందరికి ఓటువేసే అవకాశం ఈ ఎన్నిక ప్రత్యేకత. అయితే ప్రాధాన్యత ప్రకారం అందరికి లేదా కొందరికి మాత్రమే ఓటు వేసే అవకాశం కూడా ఈఎన్నికల్లో ఉంది. పోటీలో ఉన్న 71మంది అభ్యర్థ్ధులంతా పైకి తొలి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని ఓటర్లను కలిసి విజ్ఞ్ఞప్తి చేస్తున్నప్పటికి అంతర్గతంగా మాత్రం వారంతా రెండో ప్రాధాన్యత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఇదే పట్టభద్రుల నియోజకర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధిగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఈసారి అలా కాకుండా తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలువాలనే వ్యూహంతో ఆయన ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 జిల్లాలో టిఆర్ ఎస్ శ్రేణులంతా పట్టభద్రుల ఓటర్లను కలిసి తొలి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని విజ్ణప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో ఉన్న వామపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే వారిలో కొందరూ తొలి ప్రాధాన్యత ఓట్లను టిఆర్‌ఎస్‌కు వేసి రెండో ప్రాధాన్యత ఓట్లను వారి అభ్యర్థ్ధికి వేయించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇక ఈ ఎన్నికలో రంగంలో ఉన్న తెలంగాణ వాదులంతా పైకి ప్రథమ ప్రాధాన్యత ఓటు అడుగుతున్నప్పటికి అంతర్గతంగా మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లపైనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. వివిధ రాజకీయపార్టీ సానుభూతి పరులను కలిసినప్పుడు తొలి ప్రాధాన్యత మీకు ఇష్టం వచ్చిన వారికి వేసుకొని రెండో ప్రాధాన్యత ఓట్లను మాత్రం తమకే వేయాలని తెలంగాణ వాదానికి చెందిన అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తుండటం గమనర్హం. ఎవ్వరూ తొలి ప్రాధాన్యత ఓటు ఎవ్వరికి వేసినప్పటికి రెండో ప్రాధాన్యత ఓటును మాత్రమే తనకే వేయాలని బాగా తెలిసిన ఓటర్లను వేడుకుంటున్నారు. కాంగ్రెస్, బిజెపి, తెలంగాణ ఇంటిపార్టీ, యువ తెలంగాణ, తీన్మార్ మల్లన్నలు తొలి ప్రాధాన్యత ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకున్నప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్లను ఎవ్వరికి అనుకూలంగా వేస్తారనేదానిపైన చర్చ కొనసాగుతుంది. న్యూడెమోక్రసి, టిడిపి పార్టీలు ఫ్రొపెసర్ కోదాండరామ్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో వారు రెండో ప్రాధాన్యత ఓట్లను ఎవ్వరికి వేస్తారనేది కూడా అసక్తికరమైన అంశమే. మొత్తం మీద అందరూ అభ్యర్థ్ధులు పైకి తొలి ప్రాధాన్యత ఓట్లను అభ్యర్థ్ధిస్తున్నప్పటికి అంతర్గతంగా రెండో ప్రాధాన్యత ఓట్లపైనే గంపెడు ఆశలు పెట్టుకుంటున్నారు.

2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధిగా ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అప్పట్లో రెండో స్థానంలో బిజెపి పార్టీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, వామపక్షాల అభ్యర్థ్ధిగా లెక్చరర్ కూర ప్రభాకర్ పోటి చేసినప్పటికి పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ పార్టీ అభ్యర్థ్దికి మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లేక్కించాల్సివచ్చింది. గెలుపుకు అవసరం అయిన మ్యాజీక్ ఫిగర్‌కు ఎవ్వరు చేరుకోలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లేక్కింపు అనివార్యం అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థ్ది తీన్మార్ మల్లన్నను ఎలిమినేట్ చేసి ఓట్లను లేక్కించారు. ఆ ఎన్నికల్లో మొత్తం లక్షా53వేల547 ఓట్లు పోల్ కాగా 14039 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 5956 మంది నోటాకు ఓట్లు వేశారు. మిగిలిన ఓట్లలో లక్షా51వేల413 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. పోలైన ఓట్లలో యాభైశాతం కన్నా ఒక ఓటు అధనంగా వచ్చిన అభ్యర్థే విజయం సాధించినట్లుగా ప్రకటిస్తారు. మ్యాజీక్ ఫిగర్ 66777 ఓట్లకు గాను టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 67183 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థ్ధికి 55243 ఓట్లు లభించాయి.దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థ్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప బిజెపి అభ్యర్థ్ది ఎర్రబెల్లి రాంమోహన్‌రావుపై 11,940ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. తొలి ప్రాధాన్యత ఓట్లలలో పల్లా 59764 ఓట్లను దక్కించుకొని మొదటి స్థ్దానంలో నిలిచినప్పటికి మ్యాజీక్ ఫిగర్‌కు చేరుకోలేదు. రెండోస్థ్ధానంలో నిలిచిన బిజెపి అభ్యర్థ్ధికి 47041, కాంగ్రెస్ అభ్యర్థ్ది తీన్మార్ మల్లన్నకు 13033, వామపక్షాల అభ్యర్థి కూన ప్రభాకర్‌కు 11580 ఓట్లు పోల్ అయ్యాయి. మిగిలిన 18మంది స్వతంత్ర అభ్యర్థులందరికి కలిపి 2155 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 22మందిపోటీలో ఉండగా బిజెపి, టిఆర్‌ఎస్‌ల మధ్యనే పోటీ నెలకొంది. ఈసారి రంగంలో 71 మంది ఉన్నప్పటికి ప్రధాన పోటీ టిఆర్‌ఎస్, తెలంగాణ జనసమితిల మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నప్పటికి జిల్లాలో పార్టీ నిర్మాణం అంతగా బలంగా లేదు. అయినప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే పల్లా విజయం సాధించారు.

ఇప్పుడు అన్ని జిల్లాలో టిఆర్‌ఎస్ బలంగా ఉన్నందునా ఈసారి తొలి ప్రాధాన్యత ఓట్లతోనే బైట పడాలనే టిఆర్‌ఎస్ శ్రేణులు పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 5.55.565 ఓట్లు ఉండగా అందులోలక్షన్నర ఓట్లను టిఆర్‌ఎస్ శ్రేణులే చేర్పించారు. అయితే ఈ సారి మూడు లేదా మూడున్నర లక్షల ఓట్లు పోల్ అవుతాయని అంతా భావిస్తున్నారు. ఉదాహరణకు మూడు లక్షల ఓట్లు పోల్ అయితే అందులో యాభైశాతం ఓట్లకు ఓక ఓటు అదనంగావచ్చిన వారిని తొలి ప్రాదాన్యత ఓట్లలో విజయం సాధించినట్లుగా ప్రకటిస్తారు. అంటే తొలి ప్రాధాన్యతలో లక్షన్నరకుపైగా ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ లక్షన్నర ఓట్లకోసం టిఆర్‌ఎస్ అహోరాత్రులు శ్రమిస్తుంది. ఓటు నమోదు చేసుకొని వివధ ప్రాంతాల్లో ఉంటున్న వారిని పోలీంగ్ రోజు జిల్లాకు రప్పించే ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడోనివాసం ఉంటున్నవారిని పోలీంగ్ బూత్‌లకు రప్పించే చర్యలకు శ్రీకారం చుట్టారు. పట్టభద్రుల ఓటర్ జాబితా ప్రకారం ఓటర్ల కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రతి 50ఓట్లకు ఒకరిని ఇంచార్జ్‌గా నియమించిన బూత్ కమిటీ సభ్యులంతా ఓటర్లను పోలీంగ్ బూత్ వరకు నడిపించే బాధ్యతలను తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News