Home తాజా వార్తలు గల్లీ నుంచి ఢిల్లీదాకా గులాబీ జెండా

గల్లీ నుంచి ఢిల్లీదాకా గులాబీ జెండా

మై అకేలా హీ చలాతా జానిబ్ ఏ మంజిల్ మగర్.. లోగ్ సాత్ ఆతే గయే ఔర్ కార్వా బన్‌తా గయా ఈ కివిత అర్థం.. నేను ఒంటరిగానే గమ్యం వైపు ప్రయాణిస్తూ ఉన్నాను.. కానీ ప్రజలు నా వెంటే నడుస్తూ.. ప్రవాహంలా కలిసిపోయారు.

TRS Party

దేశం కెసిఆర్‌ను కోరుతోంది: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: విజయాలనుంచి పాఠాలు, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ టిఆర్‌ఎస్ పార్టీని అజేయమైన శక్తిగా తీర్చిదిద్ది తెలంగాణ సాధించిన చరిత్ర కెసిఆర్ కు సొంతమని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. గులాబీజెండా గల్లీ నుంచి ఢిల్లీవరకు రెపరెపలాడుతుండటంతో కెసిఆర్ లాంటి వ్యక్తి మాకు కావాలని దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారుతెలంగాణ సాధన దిశలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం దూసుకుపోతున్నా, జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించి కాళేశ్వరంలో సుజల దృశ్యాన్ని ఆవిష్కరించినా ప్రభుత్వం పై దుమెత్తిపోయడానికి గుంటనక్కల్లాగా ప్రతి పక్షపార్టీలు కాచుకుని కూర్చున్నాయని కెటిఆర్ దుయ్యబట్టారు. ఎంతో సాధించిన చరిత్ర ఉన్నప్పటికీ ఇంకా సాధించాల్సిన విజయాలు అనేకం ఉన్నాయన్నారు.

టిఆర్‌ఎస్ పార్టీ 18వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ తల్లికి పూలమాలవేసి పార్టీ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ 2001 ఫిబ్రవరి 27న జలదృశ్యంలో కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని  గుర్తుచేస్తూ 18 ఏళ్లుగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి పనిచేస్తున్నవారందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించడం దుస్సాహసంమన్నారు. తెలంగాణ పేరుతో నాయకులు పదవులు పొందుతుండటంతో ఆనాటి పౌరసమాజంలో ఉద్యమాలపట్ల గౌవరవం సన్నగిల్లిందని గుర్తు చేశారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను స్థాపించడం ఓసాహసమన్నారు. కొద్దిమంది కార్యకర్తలతో ఉద్యమం ప్రారంభించి లక్షలాధిమంది పార్టీశ్రేణులను సమీకరించి కెసిఆర్ తెలంగాణ సాధించడం ఓచరిత్రగా కెటిఆర్ గుర్తు చేశారు.

పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులు

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు 1948 సెప్టంబర్ 17 వరకు స్వేచ్ఛరాలేదు. ఆనాటి నుంచి తెలంగాణ వచ్చేంతవరకూ ఆంధ్రపాలకుల హస్తాల్లో తెలంగాణ నలిగిపోగా అనేకమంది నాయకులు తెలంగాణ పేరుతో ఉద్యమాలు చేసి పదవులు పొందారే కానీ తెలంగాణ సాధనకోసం చివరివరకు నిలవలేకపోవడంతో పౌరసమాజం విసిగిపోయిందని కెటిఆర్ గుర్తు చేశారు. ఆనేకపార్టీలు అవతరించానా కాంగ్రెస్‌లో విలీనం కావడమో కనుమరుగవడమో జరిగిందని ఆయన చెప్పారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుపార్టీలు మాత్రమే మనుగడసాధించాయని తెలిపారు. ఇందులో 1982లో ఎన్‌టిఆర్ స్థాపించిన టిడిపి అధికారంలోకి వచ్చిందనీ, ఆతర్వాత 2001లో కెసిఆర్ స్థాపించిన టిఆర్‌ఎస్ తెలంగాణ సాధించడంతో పాటు ప్రజల ఆశీస్సులతో రెండుపర్యాయాలు అధికారం సాధించిందన్నారు. అయితే టిడిపి స్థాపించిన ఎన్‌టిఆర్‌కు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు,కులం కాడ్, డబ్బు, మీడియా సపోర్టు, కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత అనుకూలించాయని ఆయన విశ్లేషించారు. 47 ఏళ్ల వయస్సులో టిఆర్‌ఎస్ స్థాపించిన కెసిఆర్ ధనవంతుడుకాదు. అప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు లేరు, మీడియా సపోర్టు లేదు కానీ సాహసం, ధైర్యం తెలంగాణ సాధిస్తాననే నమ్మకంతో ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు వెళ్లారని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని వదిలితే రాళ్లతో కొట్టి చంపే అధికారాన్ని ప్రజకు ఇస్తూ కెసిఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేశారని కెటిఆర్ గుర్తు చేశారు.71 ఏళ్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నోపార్టీలు పుట్టుకువచ్చినా ధైర్యంగా నిలబడి ప్రజలకు భరోసా ఇచ్చింది కెసిఆర్ మాత్రమేన్నారు. 2001లో కెసిఆర్ చెప్పిన మాట కాలక్రమేణ నిజమైందన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడుతుందని చెప్పినట్లు గానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు.

కెసిఆర్ కారణజన్ముడు అన్న ప్రణబ్ ముఖర్జీ

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కెసిఆర్‌ను కారణ జన్ముడిగా కొనియాడారు. 13 ఏళ్లలో తెలంగాణ సాధన లక్ష్యాన్ని చేరుకుని ప్రజల ఆశీర్వాదంతో సిఎం అయ్యారు మీరు కారణ జన్ములని ప్రణబ్ ఆశీర్వదించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. టిఆర్‌ఎస్‌లో 2001 నుంచి 2019వరకు ఎన్నో ఎత్తులున్నాయి,ఎన్నో పల్లాలున్నాయి, ఎన్నో విజయాలున్నాయి, ఎన్నో ఎదురు దెబ్బలున్నాయని కెటిఆర్ చెప్పారు. కెసిఆర్ ఎదురు దెబ్బతగిలినప్పుడు కుంగిపోలేదు,విజయాలు వచ్చినప్పుడు పొంగిపోలేదన్నారు. అన్నిటిని ధీరోదాత్తంగా స్వీకరించారని కెటిఆర్ తెలిపారు. ప్రజలతీర్పును గౌరవిస్తూ విజయంనుంచి పాఠా లు నేర్చుకుంటూ ముందుకు వెళ్లారన్నారు. 2014లో టిఆర్‌ఎస్‌ఉద్యమ పార్టీ లక్షం సిద్ధించిన అనంతరం పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది తిరుగులేని రాజకీయ శక్తిగాఅవతరించిందని చెప్పారు.

ఇంకా చేయాల్సింది ఉంది

ప్రజల దీవెనతో రెండవసారి అధికారంలోకి వచ్చాము, ప్రజలు 50 శాతం ఓట్లు వేసి 75 శాతం సీట్లు ఇచ్చి భుజం తట్టి కెసిఆర్ నాయకత్వాన్ని మెచ్చుకుని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్షని ఆశీర్వదిస్తున్నారని కెటిఆర్ చెప్పారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది మే 23 నాడు వచ్చే ఫలితాల్లో టిఆర్‌ఎస్ 16 ఎంపి స్థానాలు గెలుచుకుంటుంది. అదే మాదిరిగా ప్రస్తుతం జరుగుతున్న జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో సింహభాగం టిఆర్‌ఎస్ గెలుచుకోనుందనే ధీమాను కెటిఆర్ వ్యక్తం చేశారు. ఈమాట ఎందుకు చెపుతున్నానంటే గల్లీ నుంచి ఢిల్లీవరకు గులాబీ జెండా ఎగురుతున్న నేఫథ్యంలో పేదలు, రైతులు, మహిళలు, యువకుల గుండెల్లో కెసిఆర్ స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. ఇలాంటి నాయకుడు మాకు లేడని ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడే పరిస్థితి నెలకొందనేది వాస్తవమని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ దినదినాభివృద్ధి సాధిస్తూ సంక్షేమం ఆగకూడకుండా ముందుకు పోవాలంటే టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్షగా ప్రజలు భావిస్తుండటంతో నాయకులకు బాధ్యతలు మరింత పెరిగాయని కెటిఆర్ గుర్తుచేశారు. కొన్ని రాజకీయపార్టీల మాదిరిగా ఏ ఎండకు ఆగొడుగు పట్టకుండా ప్రజలకొరకు పేగులు తెగేంతవరకు టిఆర్‌ఎస్ పోరాడుతుందనే బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రజల విశ్వాసం సడలకుండా బాధ్యతతో పనిచేయాలని పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను కెటిఆర్ ఆదేశించారు.

పార్టీ నాయకులు సంయమనం పాటించాలి

రాష్ట్రంలోని ప్రతినియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండటంతోటిక్కెట్లను ఆశించేవారి సంఖ్య అత్యధికంగా ఉందని కెటిఆర్ తెలిపారు. వేలాది సంఖ్యలో పదవులకు పాటీ ఉందన్నారు. పదవులకోసం రచ్చకెక్కకుండా సంయమనంతో నాయకులు వ్యవహరించాలని ఆదేశించారు. కెసిఆర్ పై భరోసాతో ప్రజలను రెండవసారి అధికారం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ నాయకులు పనిచేయాలన్నారు. రెండవసారి ప్రజలు అధికారం ఇచ్చిన నేపథ్యంలో వార్షికోత్సవం ఆడంబరంగా జరగాల్సి ఉండాల్సింది ఆయితే ఎన్నికల కొడ్ అమల్లో ఉండటం, పార్టీశ్రేణులు స్థానిక ఎన్నిక ప్రచారంలో ఉండటంతో నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అందుకే పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు సలామ్ చేస్తూ జెండాలు ఎగరవేయడానికే పరిమితం చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ఎంపిస్థానాలు గెలిచిన అనంతరం జిల్లాలవారిగా ఘనంగా ఆవిర్భావ ఉత్సవాలను జరుపుకునేందుకు పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ అనుమతి తీసుకుందామని పార్టీ శ్రేణులకు కెటిఆర్ చెప్పారు.

బలోపేతం కోసం కార్యక్రమాలు

జిల్లా, మండల పరిషత్ ఎన్నికల అనంతరం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు కెటిఆర్ చెప్పారు. ఎన్నికల బూత్ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధిష్ఠానం ఆలోచిస్తుందన్నారు. ప్రతి జిల్లాలో టిఆర్‌ఎస్ కార్యాలయాలను నిర్మించి ప్రజలకు పార్టీ పరంగా సేవలను విస్తృత పర్చనున్నట్లు కెటిఆర్ తెలిపారు.
ఇప్పటికే కొన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం నాలుగున్నర సంవత్సరాలు పూర్తి స్థాయిలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాసేవలోనే నిమగ్నం కానుందన్నారు. సంస్థాగతనిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు కొత్తపాత వారందరికీ పార్టీ పరంగా అవకాశాలు కల్పించేందుకు అధిష్టానం ఆలోచిస్తుందన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ వాణిని చేరవేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సుక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు.

ప్రతిపక్షాలు నక్కల్లా ఎదురు చూస్తున్నాయి

టిఆర్‌ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేసేందుకు ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని కెటిఆర్ ఆరోపించారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందాని గొతికాడనక్కలా ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయని దుయ్యబట్టారు. ఎక్కడ లోటు పాట్లు లేకుండా ప్రభుత్వం ముందుకు పోతుందనీ, ఎక్కడైనా చిన్నపాటి లోపాలున్నా సరిచేసుకుంటూ పాలనా వ్యవస్థను కెసిఆర్ తీర్చి దిద్దుతున్నారని చెప్పారు.  ప్రతికూల పరిస్థితులను అధిగమించే నేర్పు, చాతూర్యం నాయకుడు కెసిఆర్‌కు ఉందన్నారు. కెసిఆర్ నాయత్వంలో బంగారు తెలంగాణ సాధనలో ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికుల్లా ముందుకు దూకాలని కెటిఆర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఆవిర్భవం నుంచి ఉన్న ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డిని కెటిఆర్ అభినందించి ముందువరుసలో కూర్చోబెట్టి గౌరవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బిబి పాటిల్,శాసనసభ్యుడు మూఠాగోపాల్ , మేయర్ బొంతు రామ్మోహన్ పలువురు కార్పోరేషన్ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.

 

TRS Party Formation Day Celebrations