Home తాజా వార్తలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

TRS party meeting Telangana Bhavan

నేటి టిఆర్‌ఎస్ విస్తృత భేటీలో పార్టీ నేతలకు ముఖ్య సూచనలివ్వనున్న ముఖ్యమంత్రి
వచ్చే 2న జరిగే ప్రగతి నివేదన సభపై చర్చ
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీని సమాయత్తంగా ఉంచేలా సలహాలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ పార్టీ విస్తృత సమావేశం తెలంగాణ భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరగనుంది. రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులతో పాటు పార్లమెంటు సభ్యు లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యేలా ఇప్పటికే పార్టీ కార్యాలయం నుంచి సమాచారం వెళ్ళింది. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర కార్యవర్గంతో సమావేశం నిర్వహించిన అనంతరం బుధవారం మంత్రులతో సమావేశం నిర్వహించిన కెసిఆర్ ఇప్పుడు ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలతో కూడా కలిపి సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు సెప్టెంబరు 2వ తేదీన కొంగరకొలన్‌లో జరప తలపెట్టిన ‘ప్రగతి నివేదన’ భారీ బహిరంగసభ ఏర్పాట్లు, ప్రస్తావించాల్సిన అంశాలు, పని విభజన తదితరాలన్నింటిపై కెసిఆర్ విస్తారంగా వివరించే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఎన్నికలకు సిద్ధం కావడంపై సూచనలను, ఆదేశాలను ఈ సమావేశం వేదికగా వివరించనున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల అమలు, హామీలు ఇవ్వకపోయినా అమలుచేస్తున్న వినూత్న పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం తదితరాలతో పాటు ఈ నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఈ సమావేశంలో వివరించడంతో పాటు సెప్టెంబరు 2వ తేదీన ప్రగతి నివేదన సభలో ప్రస్తావించాల్సిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ జరగని విధంగా సుమారు పాతిక లక్షల మంది హాజరయ్యేలా సభను నిర్వహించడం కోసం ప్రతీ జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాలుపంచుకోవడంతోపాటు విస్తృతంగా హాజరయ్యే ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు తదితరాలపై కూడా నిర్దిష్టంగా కమిటీల ఏర్పాటు, పని విభజన గురించి ఈ సమావేశంలో కెసిఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ఎన్నికలకు కార్యక్రమాలను సమాయత్తం చేయడం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా కార్యకర్తలను ఈ సమావేశం ద్వారా సమాయత్తం చేయడం కూడా ఈ సమావేశం ఉద్దేశాల్లో ఒకటని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూలు ప్రకారం వచ్చినా, ముందుగానే వచ్చినా సిద్ధంగా ఉండడంపై నొక్కి చెప్పే అవకాశం ఉందని తెలిసింది. ఎలాగూ షెడ్యూలుకంటే ఆరు నెలల ముందు ఎన్నికలు వస్తే వాటిని ‘ముందస్తు’గా భావించాల్సిన అవసరం లేదని స్వయంగా ముఖ్యమంత్రి ఈ నెల 13వ తేదీ సమావేశంలో వ్యాఖ్యానించినందువల్ల డిసెంబరులో ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఈ సమావేశం ద్వారా కెసిఆర్ స్పష్టం చేయనున్నారు. రాష్ట్రంలో ‘ముందస్తు’ ఎన్నికలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఏ వైఖరితో ఉందో స్పష్టం చేయనున్నారు. పార్టీ కార్యక్రమాలను ఇప్పటి నుంచే ఏ తీరులో నిర్వహించాలనే అంశంపైనా వివరణ ఇవ్వనున్నారు. పార్టీ ప్రస్తుత స్థితిగతులతో పాటు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడంతో పాటు ఇటీవల వచ్చిన సర్వే ఫలితాలను ఉదహరిస్తూ ఎక్కువగా కేంద్రీకరించాల్సిన అంశాలు, ప్రాంతాలపైన కూడా ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉంది.

వివిధ జిల్లాల నుంచి విస్తృతంగా టిఆర్‌ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్న ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలం పుంజుకుంటుందనేదానికి నిదర్శనమని వ్యాఖ్యానించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించ నున్న భారీ బహిరంగసభకు ముందు ఈ సమావేశాన్ని నిర్వహిస్తుండడం రాజకీయ ప్రాధాన్యతను సంతరిం చుకుంది.