Saturday, April 20, 2024

టిఆర్ఎస్ ఇక జాతీయ పార్టీ

- Advertisement -
- Advertisement -

పార్టీ గుర్తుగా అంబాసిడర్ కారే
బ్లూ ప్రింట్ సిద్ధం ముఖ్యమంత్రి కెసిఆర్

ఒక ప్రాంతీయ పార్టీ జాతీయపార్టీగా ఎదగడం ఇదే ప్రథమం
త్వరలో ఢిల్లీకి కెసిఆర్
నెలాఖరున పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సారధ్యంలో జాతీయస్థాయిలో రాజకీయపార్టీని ఏర్పాటు చేయడం ఖాయమయ్యింది. జాతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి బ్లూ ప్రింట్‌ను కూడా అగ్రనాయకులు సిద్దం చేసినట్లు తెలిసింది. అంబాసిడర్ కారే జాతీయ పార్టీకి గుర్తుగా ఉండబోతోందని, ఆ మేరకు భారత ఎన్నికల సంఘాన్ని పార్టీ అధిష్టానం కోరనుందని, ఎన్నికల సంఘం వద్ద త్వరలోనే కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుందని కూడా ఆ నాయకులు వివరించారు. గులాబీ రంగులోనే జాతీయ పార్టీ జెండా ఉంటుందని, జెండాలో భారతదేశం మ్యాప్ ఉంటుందని, ఆ మ్యాప్‌లో భరతమాత ప్రతిమ ఉంటుందని వివరించారు. పార్టీ పేరు కోసం మూడు ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయని, వాటిలో జై భారత్ పార్టీ (జేబీపీ), నవ భారత్ పార్టీ (ఎన్.బి.పి), భారత రాష్ట్రీయ సమితి (బి.ఆర్.ఎస్) వంటి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి కే.సి.ఆర్. న్యూఢిల్లీకి వెళతారని వివరించారు. ఆ సమయంలోనే ఢిల్లీలో జాతీయస్థాయి మీడియా సమావేశంలో కే.సి.ఆర్.మాట్లాడతారని తెలిపారు.

ఈనెల 18వ తేదీన టి.ఆర్.ఎస్. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొంటారన్నారు. ఈనెల 27వ తేదీ తర్వాత మంచి రోజులు ప్రారంభం కానున్నాయని, ఈ నెలాఖరుకల్లా పేరుతో సహా కొత్త పార్టీపై సీఎం కే.సి.ఆర్. కీలకమైన ప్రకటన చేస్తారని ఆ నాయకులు మొత్తం షెడ్యూలును వివరించారు. జాతీయ పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి రాష్ట్రానికి కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆయా రాష్ట్రాల్లో ప్రజలతో సత్సంబంధాలు ఉండి, ప్రజా సేవలు అందిస్తున్న స్థానిక నాయకులతో మంతనాలు జరుగుతున్నాయని, ఈ చర్చలు ముగిసిన తర్వాత అన్ని రాష్ట్రాల కమిటీలతో విస్తృతస్థాయి సమావేశం కూడా జరిపే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) ఇక నుంచి జాతీయపార్టీగా రూపాంతరం చెందుతోందని, టి.ఆర్.ఎస్.పార్టీ పేరును కూడా మారుస్తున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి రెండు టర్మ్‌లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టి.ఆర్.ఎస్.పార్టీ జాతీయపార్టీగా ఎదగడం దేశచరిత్రలో ఇదే ప్రధమం అని ఆ పార్టీ నాయకులు సగర్వంగా చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయస్థాయికి ఎదిగినప్పటికీ వాటి పేర్లు మారిన ఉదంతాలు లేవని తెలిపారు.

అయితే టి.ఆర్.ఎస్. పార్టీలో ఉన్న రాష్ట్ర సమితిని యధావిధిగా రాష్ట్రీయ సమితిగా కొనసాగిస్తూ.. టి..కి బదులుగా భారత.. అనే పదాన్ని కలుపుతూ భారత రాష్ట్రీయ సమితిగా చేస్తే టి.ఆర్.ఎస్.కు బదులుగా బి.ఆర్.ఎస్.గా పిలుచుకోవడానికి సులువుగా ఉంటుందని, తెలంగాణ ప్రజలకే కాకుండా జాతీయస్థాయిలోనూ చాలా తేలికగా పార్టీ పేరును ఉచ్చరించడానికి సులభంగా ఉంటుందని, అంతేగాక టి.ఆర్.ఎస్.పేరుతో రెండు టర్మ్‌లు అధికారంలోకి వచ్చామని, ఆ సెంటింమెంట్‌తో కూడా ఆలోచన చేస్తున్నామని, అందుకే టి.ఆర్.ఎస్.పేరును బి.ఆర్.ఎస్.గా మారిస్తే తప్పకుండా నిర్దేశించుకొన్న లక్షాలు సాధించడానికి వీలవుతుందని, బి.జే.పి.బారి నుంచి దేశాన్ని కాపాడటానికి తేలిగ్గా ఉంటుందని ఆ నాయకులు అంటున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.సి.ఆర్. తప్పకుండా ఈ తరహా సెంటిమెంట్ అక్షరాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కొత్త రాజకీయ పార్టీ అనివార్యంః
ప్రమాదంలో పడిపోయిన దేశ ప్రజలను కాపాడేందుకు, దేశాన్ని అంతర్జాయస్థాయిలో పొంచి ఉన్న ప్రమాదాల నుంచి రక్షించేందుకు, దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించేందుకు, ప్రజా రంజకంగా పాలనను అందించేందుకు తప్పకుండా దేశానికి ఒక కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని టి.ఆర్.ఎస్.పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బల్లగుద్ది వాదిస్తున్నారు. దేశంలో అన్ని రకాల వస్తువులు, నిత్యావసరాల, ఇతరత్రా అన్ని రకాలుగా ధరలను ఆకాశాన్ని తాకే విధంగా పెంచేయడమే కాకుండా బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్ రంగాలు, పారిశ్రామిక రంగాలను సర్వనాశనం చేయడమే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముకొంటూ పోతూ ప్రైవేటుపరం చేస్తున్న నరేంద్రమోడీ బారి నుంచి దేశాన్ని, దేశ ప్రజలను రక్షించాల్సిన అత్యవసరమైన అవశ్యకత ఉందని టి.ఆర్.ఎస్.నేతలంటున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేవని, ఆ పార్టీ మునిగిపోతున్న పడవ అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, మిగతా రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీనిగానీ, నరేంద్ర మోడీనిగానీ ఢీ కొట్టే సత్తా లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రైతు-వ్యవసాయ రంగాల్లో ముఖ్యమంత్రి కే.సి.ఆర్. నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విప్లవాత్మకమైన పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా ఉన్నందున, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశం యావత్తూ చూస్తున్నది కనుకనే దేశాన్ని తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేసే నాయకుడి సారధ్యంలో ఒక నూతన రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అన్ని రాష్ట్రాల నుంచి అనేక విన్నపాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ తరహా నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ నాయకులు వివరించారు. అందుకే వివిధ రాష్ట్రాల్లోని నాయకులు, జాతీయస్థాయి రైతు సంఘాల నేతలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ నిపుణులు కూడా కే.సి.ఆర్.ను కలిసిన ప్రతిసారీ జాతీయస్థాయిలో పార్టీని ఏర్పాటు చేసి దేశాన్ని నడిపించాలని కోరారని, అందుకే పార్టీ అధిష్టానం ఈ మేరకు జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు.

TRS Party to turns into National Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News