Thursday, April 25, 2024

రహదారులపై రణవీరులు

- Advertisement -
- Advertisement -

TRS protest demanding purchase of yasangi grain

యాసంగి ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ మండుటెండల్లో రోడ్లపై బైఠాయించిన టిఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు
రాష్ట్రమంతటా గంటల తరబడి ట్రాఫిక్ జామ్
వరి కంకులతో రోడ్లపై ఆందోళన జాతీయ రహదారులపై వరి ధాన్యం పోసి నిరసన

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనితీరాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులపై టిఆర్‌ఎస్ పార్టీ నేతలు రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేపటారు. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన పిలుపులో భాగంగా నాగపూర్, బెం గళూర్, ముంబై, విజయవాడ, కాన్పూర్ జాతీయ రహదారులతోపాటు జిల్లా కేంద్రాలతో అనుసంధానమైన జాతీయ రహదారులపై మంత్రులు, ఎం పిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతోపాటు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీశ్రేణులు భారీఎత్తున పాల్గొని రాష్ట్ర రైతాంగం పక్షాన ఆందోళనలు చేపట్టారు. జాతీ రహదారులపై రైతులు, నేతలు వరి కంకులు, ధాన్యాన్ని పోసి తమ నిరసనలను తెలిపారు.

మండుటెండలో టిఆర్‌ఎస్ శ్రేణులతోపాటు రైతులు భారీగా తరలివచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. ధర్నాలు, ఆందోళనలతో జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. నాగపూర్ జాతీయ ర హదారిపై కడ్తాల్, ఆదిలాబాద్ వద్ద, బెంగళూరు జాతీయ రహదారిపై భూతపూర్ వద్ద, విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, చౌటుప్పల్ వద్ద, ముంబై జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద పెద్దఎత్తున రాస్తారోకో, ధర్నాలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎంఎల్‌ఎలలు, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్ వద్ద ఇంద్రకరణ్ రెడ్డితోపాటు అయా నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సీలు, జడ్పి చైర్‌పర్సన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రైతుబంధు సమితి నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ధాన్యం కొనే వరకూ కేంద్రంలోని బిజెపి సర్కార్‌తో కొట్లాడుతునే ఉంటామని నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్ వద్ద జరిగిన ఆందోళనలో దేవాదాఁ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాల్లో మనం చేసే ఆందోళనల సెగ ఢిల్లీకి తాకాలాని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాక పోరాటం ఆగదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.

ప్రతి గింజ కొనే వరకూ ఉద్యమిస్తామని ముంబై హైవేపై పటాన్ చెరువు వద్ద జాతీయ రహదారి ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్ నేతృత్వంలో టిఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలపై అక్కసు పెంచుకుందన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన బిజెపి నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి చౌరస్తాలో జాతీయ రహదారిని దిగ్భందించారు. రైతులు పండించిన యాసంగి వరి మొత్తాన్ని కేంద్రమే కొనితీరాలని హైదరాబాద్-బెంగుళూరు (భూత్పూర్) జాతీయ రహదారిపై టిఆర్‌ఎస్ చేపట్టిన రాస్తారోకోలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, జైపాల్ యాదవ్, ఎస్ ఆర్ రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్‌పై బైఠాయించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పంజాబ్ తరహాలో తెలంగాణలో రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనాలన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనేలా చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. అదేవిధంగా వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేందం చేత ధాన్యం కొనిపించడంలో తెలంగాణ బిజెపి నేతలది చేతగానితనమని విమర్శించారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి ఈ రాష్ట్రానికి, రైతాంగానికి చేసింది ఏమీలేదని విమర్శించారు. రైతుల ఆందోళనలుచూసైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ప్రతి రైతు తమఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసనలు తెలపాలన్నారు. నల్లగొండ జిల్లా హైదరాబాద్‌విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఆందోళనలో ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు. ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో జరిగిన ధర్నాలో మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికైనా ధాన్యాన్ని కొనకుంటే తెలంగాణ రైతుల ఆగ్రహజ్వాలలు చూడాల్సి వస్తోందన్నారు.

వరి వేయండి.. మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బిజెపి నాయకులు ఇప్పడు మోహం చాటేస్తున్నారని ఆయన దెప్పిపొడిచారు. రాష్ట్ర రహదారులపై బైఠాయించి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంలేదని, రైతుల కోసమే ఆందోళన చేస్తున్నామన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకుంటే కేంద్రంలోని మోడి ప్రభుత్వానికి ఘోరి కడుతామని వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్ హెచ్చరించారు. వరంగల్‌లోని నాయుడుపెట్రోల్ పంపు జంక్షన్ వద్ద ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర వైఖరి పట్ల నిరసన గళం వినిపించారు. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల, షాద్‌నగర్ వద్ద యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేవరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామని ఎంఎల్‌ఎలు కాలె యాదయ్య, అంజయ్య యాదవ్ అన్నారు. జాతీయ రహదారిపై రైతులు, టిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి వారు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇలా హైదరాబాద్ మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదార్లను టిఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి ఆందోళనలతో ముంచెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News