Home తాజా వార్తలు టిఆర్ఎస్ కే పురస్కారం

టిఆర్ఎస్ కే పురస్కారం

TRS wins Warangal, Khammam, five other urban local bodies

 

అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన కెసిఆర్

మినీ మున్సిపోల్స్‌లో కారు క్లీన్‌స్వీప్
రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలు కైవసం
కొత్తూరు మినహా అన్నింటా గులాబీ ఏకపక్ష ప్రభంజనమే
కాంగ్రెస్, బిజెపిలకు చెంపపెట్టు ఫలితాలు
అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టిన ప్రజలు
వరుస విజయాలతో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు
లింగోజిగూడలో బిజెపికి షాక్
ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం, కమలం పార్టీ విన్నపం మేరకు బరిలో దిగని టిఆర్‌ఎస్

రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి, 74 శాతం వార్డులలో టిఆర్‌ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు. మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను టిఆర్‌ఎస్‌కు, 3 స్థానాలను మిత్రపక్షం సిపిఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి టిఆర్‌ఎస్‌కు తిరుగులేదని మరోమారు నిరూపించారు. టిఆర్‌ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మాకు ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ఓటర్లకు కృతజ్ఞతలు           – ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: మినీ పురపోరులోనూ గులాబీ పార్టీ సత్తా చాటింది. పక్కా ప్రణాళికలతో టిఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. ఎన్నిక ఏదైనా విజయం తమదేనని చెప్పుకునే టిఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. గతంలో మున్సిపాలిటీలన్నీ కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ పార్టీ, మినీ పోరులోనూ అదే దూకుడు కొనసాగించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్ధిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్‌లో సునాయసం గా గెలుపు బావుటా ఎగరవేసింది. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఫలితాలతో కొంత నిరుత్సాహ పడిన టిఆర్‌ఎస్ శ్రేణులకు మళ్లీ వరుస విజయాలు కొత్త ఊపునిచ్చాయి. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలను సునాయసంగా కైవసం చేసుకుంది.

ముఖ్యంగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కొంతకాలంగా ప్రత్యేక దృష్టి పెట్టిన టిఆర్‌ఎస్, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఓటర్లను ఆకర్షించింది. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిరంతరం స్థానిక నేతలతో సమాలోచనలు జరపుతూ సలహాలు ఇస్తూ.. ముందుకు నడిపారు. పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో వ్యూహాలన్నీ ఫలించి విజయం చేకూరింది. అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు స్వల్ప స్థానాలకే పరిమితమై పోటీలో నామమాత్రంగా నిలిచాయి. వరంగల్‌లో బిజెపి, ఖమ్మంలో కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచాయి.

గులాబీల్లో రెట్టింపయిన ఉత్సాహం
మినీ పురపోరులో ఘన విజయంతో గులాబీ పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయింది. దుబ్బాక ఉపఎన్నిక, జిహెచ్‌ఎంసి కొంత హవా తగ్గినట్టు కనిపించినా మరోసారి మెరుపువేగంతో పుంజుకుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా,జోరు కారుదే అన్న చందంగా కొనసాగుతోంది. పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నికల్లోనూ వరంగల్, ఖమ్మం స్థానాన్ని నిలబెట్టుకోడంతో పాటు, హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్‌లోనూ పాగా వేసింది. తాజాగా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించింది.

24 గంటల వ్యవధిలోనే వెలువడిన మినీ పురపోరు ఫలితాల్లోనూ అదే జోరు కొనసాగించింది. కొత్తూరు పురపాలిక మినహా ఎక్కడా కూడా విపక్షాలు ఎదురు నిలవలేకపోయాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు కొంతమేరకు పోటీ ఇవ్వగలిగారు. వరంగల్ కార్పొరేషన్‌లో బిజెపి, ఖమ్మంలో కాంగ్రెస్ కొన్ని డివిజన్లను దక్కించుకోగలిగాయి. బిజెపి పట్టణాలలో బలంగా ఉందని భావించినప్పటికీ మున్సిపల్ ఎన్నికలలో అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన బిజెపి రాష్ట్రంలోనూ సాగర్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణులు డీలా పడిపోయారు.

జోరుగా ప్రచారం
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు అధికారపక్షం వ్యూహాత్మకంగా విపక్షాలను డైలమాలో పడేసింది. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార వ్యూహాలతో పావులు కదిపింది. ఉన్న కొద్ది సమయంలోనే మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రచారాన్ని వేడెక్కించారు. వీటికి తోటు కరోనా పరిస్థితుల్లో స్వతంత్రులు, పార్టీల ప్రచారానికి జనం నుంచి పెద్దగా స్పందన లభించలేదు. గతంలో ఆయా కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ ఖాతాలోనే ఉండటం మరింతగా కలిసివచ్చింది. వీటికితోడు ప్రభుత్వం అండగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే బలమైన సంకేతాలను జనంలోకి తీసుకెళ్లడంలో టిఆర్‌ఎస్ మరోసారి విజయవంతమైంది. స్థానికంగా జిల్లాల మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు మినీ పురపోరును సవాల్‌గా తీసుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించారు.

బుజ్జగించడంలో సఫలం
అసంతృప్తులను బుజ్జగించడంలోనూ టిఆర్‌ఎస్ సఫలమైంది. ఆశావహులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ వారిని బుజ్జగించడంలోనూ పార్టీ సఫలమైంది. వరంగల్, ఖమ్మం సహా మున్సిపాలిటీల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని మంత్రులు భరోసా కల్పించారు. కొవిడ్ పరిస్థితుల్లో మెరుపువేగంతో జరిగిన మినీ పురపోరులోనూ జోరు ప్రదర్శించిన టిఆర్‌ఎస్, ఉపఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లోనూ అధికార పక్షం పట్టునిలుపుకుంది.

ఖమ్మం కార్పొరేషన్ టిఆర్‌ఎస్ కైవసం
ఖమ్మం కార్పొరేషన్‌పై ఎగిరిన గులాబీ జెండాఖమ్మం కార్పొరేషన్‌ను తెరాస మరోసారి నిలబెట్టుకుంది. 60 డివిజన్లకుగాను 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం 10వ డివిజన్ టిఆర్‌ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది. 59 డివిజన్‌లలో ఇప్పటివరకు 43 స్థానాల్లో అధికారపక్షం విజయం సాధించి ఖమ్మం కార్పొరేషన్‌లో సత్తా చాటింది. కాంగ్రెస్ అభ్యర్థులు 9 చోట్ల గెలుపొందారు. బిజెపి ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు.

గ్రేటర్ వరంగల్‌లో ఎగిరిన గులాబీ జెండా
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ప్రసిద్ధిగాంచిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో గులాబీ జెండా ఎగిరింది. కారు జోరు తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. మొత్తం 66 డివిజన్లకు గానూ అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థులు 49 డివిజన్లలో విజయం సాధించారు. బిజెపి 10 డివిజన్‌లలో గెలుపొందింది. కేవలం మూడు డివిజన్లలో మాత్రమే హస్తం అభ్యర్థులు విజయం సాధించారు. ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు.

సిద్దిపేట ఏక పక్షమే
సిద్దిపేట మున్సిపాలిటీలో టిఆర్‌ఎస్ విజయదుందుభి మోగిచింది. మొత్తం 43 స్థానాల్లో తెరాస 36 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు ఆరు చోట్ల విజయం సాధించారు. బిజెపి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఏ ఒక్క వార్డులోనూ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

కొత్తూరులో పోటాపోటీ
జడ్చర్ల మున్సిపాలిటీని టిఆర్‌ఎస్ దక్కించుకుంది. మొత్తం 27 వార్డులకు గాను 23 స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని ఖాతాలో వేసుకుంది. జడ్చర్లలో చెరో రెండు వార్డుల్లోనే ఉనికి చాటుకుని కాంగ్రెస్,బిజెపిలు చతికిల పడ్డాయి. అచ్చంపేటలోనూ టిఆర్‌ఎస్ ఆధిక్యం నిలబెట్టుకుంది. మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆరు వార్డులను కాంగ్రెస్ నిలబెట్టుకుని ఫర్వాలేదనిపించగా బిజెపి ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. అలాగే కొత్తూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ ఏడింట విజయం సాధించింది. ఐదు వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు చేజిక్కించుకుని అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చారు. కొత్తూరులో కమలం పార్టీ బోణి కొట్టలేకపోయింది. నకిరేకల్ మున్సిపల్ పోరులోనూ గులాబీ పార్టీ సత్తా చాటింది. మొత్తం 20 వార్డులుండగా 11 మంది టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచి పురపీఠాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ రెండు వార్డులు గెలుచుకోగా, ఇతరులు ఆరు వార్డుల్లో గెలుపొందారు. నల్గొండ 26వ వార్డుకు జరిగిన ఉపఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది.

లింగోజిగూడలో అనూహ్యంగా కాంగ్రెస్ విజయం
గజ్వేల్ ప్రజ్ఞాపూర్, నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీల్లోని ఒక్కో వార్డుకు జరిగిన ఉపఎన్నికలోనూ అధికార పార్టీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని లింగోజిగూడ ఉపపోరులో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి రాజ శేఖర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప బిజెపి అభ్యర్థి అఖిల్ గౌడ్‌పై 1,272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిఆర్‌ఎస్ మద్దతిచ్చినా బిజెపి తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. తాజా గెలుపుతో జిహెచ్‌ఎంసి కాంగ్రెస్ కార్పొరేటర్ల బలం మూడుకు చేరింది. గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు అనుమతించకపోవడం వల్ల సందడి అంతగా కనిపించలేదు.

లింగోజిగూడలో బిజెపికి షాక్
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. బిజెపి అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి 1,272 ఓట్ల తేడాతో గెలుపొందారు. లింగోజిగూడ డివిజన్‌లో విజయం సాధించడంతో జిహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ బలం మూడుకు పెరిగింది. బల్దియా ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి విజయం సాధించిన రమేశ్‌గౌడ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేశ్‌గౌడ్ మృతితో ఆ డివిజన్‌ను ఏకగ్రీవం చేసేందుకు బిజెపి యత్నించింది. ఆ పార్టీ నేతలు మంత్రి కెటిఆర్‌ను కలిసి లింగోజిగూడ డివిజన్‌లో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని నిలపమని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒప్పంచేందుకు బిజెపి నేతలు యత్నించినా లాభం లేకపోయింది.

అభ్యర్థిని వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరుగగా సోమవారం లెక్కింపు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 49,203 ఓట్లకు గాను కేవలం 13591 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ 38 ఓట్లతో కలిపి మొత్తం 13,629(28 శాతం) మాత్రమే పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లలో 33 కాంగ్రెస్‌కు, 5 చెల్లని ఓట్లు ఉన్నాయి. 101 నోటాకు, 188 ఓట్లు చెల్లుబాటు కాలేదు. వరదల సమయంలో లింగోజిగూడ దాదాపుగా పూర్తిగా ముంపునకు గురైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆస్తి పన్ను మాఫీకి పోరాడటంతో పాటు ఇతర అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయం సాధించిన రాజశేఖర్‌రెడ్డి గెలుపు పత్రం అందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

TRS wins Warangal, Khammam, five other urban local bodies