Home ఆదిలాబాద్ కారు జోరు … కాంగ్రెస్ బేజారు

కారు జోరు … కాంగ్రెస్ బేజారు

TRSఆదిలాబాద్  : పార్లమెంట్ ఎన్నికల్లో గులాబి శ్రేణులు రెట్టింపు ఉత్సహంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం టిఆర్ఎస్ శ్రేణులు తిరుగులేని విధంగా రణక్షేత్రంలో దిగుతున్నాయి. ఈ ఎన్నికల్ల టిఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. రాష్ట్రం ఆవిర్బావించిన తరువాత రెండో సారి అధికంగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నారు. అదే తరహాలో ఎంపి స్థానాలను పదిలంగా ఉంచుకునేందుకు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రత్యర్థి పార్టీలను వణుకు పుట్టిస్తున్నారు. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 11న జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఈ స్థానాన్ని మరోసారి దర్కించుకునేందుకు టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆదిలాబాద్ లోక్‌సభ ఇంచార్జీగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి బాద్యతలు పార్టీ అదిష్టానం అప్పగించింది. పార్లమెంట్ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 స్థానాల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా ఒక్క ఆసిఫాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు గెలిచారు. సిఎం కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు, గిరిజనులు, ఆదివాసీల కోసం పెద్ద ఎత్తున పథకాలు అమలు చేయడం పట్ల ఆకర్శితులై కాంగ్రెస్‌ను వీడీ టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆత్రం సక్కు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతోనే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా బోథ్‌కు చెందిన అనిల్ జాదవ్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. 2009, 2014 సాదారణ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో అనిల్ జాదవ్‌కు టికెట్టు ఇవ్వకుండా సోయం బాపురావుకు టికెట్ ఇవ్వడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. తాజాగా ఆయన బుధవారం కేటిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిస్తేజం అలుముకుంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాభవం చవిచూడటంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది. తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కీలక నేతలు, ప్రజా ప్రతినిధుల రాజీనామాలు ఆ పార్టీలో కల్లోలానికి  దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.  ఎంపి  అభ్యర్థిగా రాథోడ్ రమేష్‌ను ప్రకటించగా మిగతా నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఇంత కాలం పార్టీ కోసం పనిచేసిన తమకు అవకాశం ఇవ్వకుండా ఇటీవల పార్టీలో చేరిన, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి టిక్కెట్టు ఇవ్వడం పట్ల అసమ్మతి, అసంతృప్తికి కారణమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో సోయం బాపురావు చేరడంతో ఆ పార్టీలో సైతం అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. పార్టీ సీనియర్ నాయకులు ఎస్టీ అభ్యర్థి మాడవి రాజు ఉండగా ఎంపీ స్థానానికి సోయం పేరును ఖరారు చేయడం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు లంబాడా, ఆదివాసీ కీలక నాయకులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని వీడడం, తీవ్ర అసంతృప్తితో ఉండటం కాంగ్రెస్‌తో పాటు బీజేపీలో టికెట్ విషయంలో సీనియర్ నాయకుల అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు కార్యకర్తలను తికమకపెట్టుతున్నాయి. ఈ రెండు పార్టీలకు ఈ ఎన్నికలు పరీక్షగా మారానున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరైన నాయకత్వం లేకపోవడం,ఉన్న నాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో కార్యకర్తల్లో నిస్తేజం అమలుకోవడంతో ఆ పార్టీలకు గెలుపు ఆమడదూరంలో ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

TRS Workers in Happy Mood in Adilabad