Home తాజా వార్తలు ప్రజలతో మమేకం

ప్రజలతో మమేకం

KTRరెండవ హరితవిప్లవానికి తెలంగాణ నాందీ
కేంద్రంలో సంకీర్ణమే, కేంద్రం మెడలు వంచాలంటే 16 పార్లమెంట్ స్థానాలు కావాలి
15 మంది ప్రధానులు మారినా రైతుల బతుకులు మారలేదు, కాంగ్రెస్, బిజెపిలు ప్రాంతీయ పార్టీలుగా అవతరించాయి, సిఎం కెసిఆర్ ఆలోచనలే దేశానికి మార్గదర్శకాలు

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 16 స్థానాలను అత్యధిక మెజారిటీలతో సాధించుకోవాలని, ఊరూరా ప్రతి ఒక్క ఓటరు మనసు గెలుచుకోడానికి ప్రజలతో మమేకమై పని చేయాలని టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని, కాంగ్రెస్ బిజెపిలు కలిసినా మెజారిటీ రాదని అన్నారు. ఈ నేపథ్యంలో మన 16 స్థానాలకు విశేష ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. నాగర్‌కర్నూల్, చేవెళ్ల సన్నాహక సభల్లో కెటిఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి విశేషస్పందన లభించింది.

హైదరాబాద్: రెండవదశ హరితవిప్లవానికి తెలంగాణ నాంది పలుకుతుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం పచ్చబడుతుండటంతో దేశం తెలంగాణ వైపు దృష్టి సారించిందన్నారు. తెలంగాణ అభివృద్ధిని విస్మరించిన ప్రధాని మోడీ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రధాని కిసాన్ సమ్మాన్ పేరుతో అమలు చేస్తుండటంతో దేశంలోని 13 కోట్ల రైతులు లబ్దిపొందటం తెలంగాణకు గర్వకారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై టన్నులకొద్ది దుమ్ముపోసే పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఐదురాష్ట్రాలు సిఎం కెసిఆర్ రైతు బంధుపథకం, రైతుబీమాపథకాన్ని అమలు చేయడంతో దేశానికి తెలంగాణ ఆదర్శమై రెండవ దశ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ లో పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలోని నాగవరం శివారులోని మైదానంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కెటిఆర్ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్ధేశం చేస్తూ పార్టీశ్రేణులు మరింత సంఘటితమై 16 పార్లమెంట్ స్థానాల్లో టిఆర్‌ఎస్‌ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శం అవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో టిఆర్‌ఎస్ కీలకం కానుందన్నారు. దేశాన్ని పాలించిన 15 మంది ప్రధానులు ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలను తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తూ దేశానికి ఆదర్శమయ్యారని చెప్పారు.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది..
జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బిజెపిలు కొంచం పెద్ద ప్రాంతీయ పార్టీలుగా అవతరించాయని కెటిఆర్ విమర్శించారు. దక్షిణాధిలో బిజెపిలేదు, కాంగ్రెస్ క్షీణించింది ఉత్తరాధిలో కూడా అదేపరిస్థితి నెలకొని ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. 2014లో మోడి ఏదో చేస్తారని 283 పార్లమెంట్ స్థానాలు అప్పగించి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలు ఇస్తే అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళల పోపులడబ్బాలో దాచుకున్న డబ్బులను పెద్దనోట్ల రద్దుతో దోచుకున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత సర్వేల ఫలితాలు విశ్లేషిస్తే కాంగ్రెస్, బిజెపి కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మెజారిటీ రాదని కెటిఆర్ చెప్పారు. ఈనేపథ్యంలో ప్రాంతీయ పార్టీల ప్రాభల్యం పెరుగుతుందన్నారు. తెలంగాణ 16 పార్లమెంట్ స్థానాల్లో విజయ కేతనం ఎగరవేస్తే కేంద్రంలో శాసించే స్థాయికి టిఆర్‌ఎస్ ఎదుగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని విస్మరించిన మోడి, అనేక సంవత్సరాలనుంచి తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పార్టీశ్రేణులు గుర్తించాలని చెప్పారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందనే స్పష్టమైన సంకేతాలు ఉండటంతో టిఆర్‌ఎస్ కార్యకర్తలు మరింత సంఘటితమై 16 పార్లమెంట్ స్థానాలను సిఎం కెసిఆర్‌కు అప్పగిస్తే కేంద్రం నుంచి భారీ నిధులు తెచ్చి తెలంగాణను స్వర్ణమయం చేస్తారని చెప్పారు. ఇతరపార్టీల నుంచి కాంగ్రెస్,బిజెపి కార్యకర్తలు, నాయకలు టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు.

కెసిఅర్ ఆలోచనలే దేశానికి ఆచరణగా మారాయి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనావిధానం, ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి దిక్చూచిగా మారాయని కెటిఆర్ చెప్పారు. కెసిఆర్ స్వతహాగా రైతు కావడంతో రైతుల బాధలు ఆయనకు తెలవడంతోనే అనేకపథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయం దండుగన్న చంద్రబాబు ఈరోజు రైతుబంధు కాపీకొట్టలేదా? కళ్యాణ లక్ష్మీపథకానికి పసుపు కుంకుమ పేరు పెట్టలేదాని ప్రశ్నించారు. భారతదేశంలో 43 లక్షల మందికి ఆసరా పించన్లు ఇస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. అలాగే ఏప్రిల్ నుంచి ఆసరాపించన్లు ప్రభుత్వం రూ.2016 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పెన్షనర్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించడంతో మరో 8 లక్షల మందికి పెన్షన్ అందనుందని చెప్పారు. అలాగై సిఎం కెసిఆర్ విధానాలు ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాలు ముందుకు వెళ్లుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై టిఆర్‌ఎస్ పెత్తనం ఉంటే తెలంగాణ అభవృద్ధి శరవేగమవుతుందన్నారు. దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలతో నిత్యం సిఎం కెసిఆర్ టచ్‌లో ఉన్నారని చెప్పారు. దేశభవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే ప్రధాన్యత వహిస్తున్నాయన్నారు. కెసిఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే ఢిల్లీ గద్దెమీద ఎవరి కూర్చో పెట్టాలనేది తెలంగాణ నిర్ణయిస్తుందన్నారు.

ప్రతికుటుంబానికి సిఎం కెసిఆర్ పెద్దకొడుకయ్యారు
తెంలగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు అనేక కష్టాలు, ఆర్థిక ఇబ్బందలు పడిన వృద్ధులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ప్రభుత్వం బాసటగా నిలిచి సంక్షేమానికి పాటు పడటంతో ప్రతి కుటుంబానికి కెసిఆర్ పెద్దకొడుకయ్యారని పర్యటనల్లో అనేకమంది చెప్పినట్లు కెటిఆర్ అన్నారు. అయితే చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. అన్నిరంగాల్లో అభివృద్ధి మరింత వేగవంతం చేయాల్సి ఉంది, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే సంక్షేమ, భివృద్ధి పథకాలు అమలవుతున్నాయని ఈ నేపథ్యంలో 16 పార్లమెంట్ స్థానాలు టిఆర్‌ఎస్ సాధించి కెసిఆర్‌కు బహుమతి ఇస్తే కేంద్రం మెడలు వంచి తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువస్తారన్నారు. ఇద్దరు ఎంపిలతోనే దేశరాజకీయాలను మలుపు తిప్పి తెలంగాణను సాధించిన సిఎం కెసిఆర్‌కు 16 పార్లమెంట్ సభ్యలు అండగా ఉంటే గుణాత్మకమైన మార్పులను తీసుకువస్తారని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం లో తెలంగాణ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలైతే దేశస్వరూపమే మారి పోతుందని చెప్పారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దావఖానకు అనే పాట ఆనాటి ఆసుపత్రుల దుస్థితిని చాటితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ఉన్నాయని కెటిఆర్ చెప్పారు. ఈ విధానం దేశంలో అమలైతే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవించదాని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు
పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభంజనానికి కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. మహబూబ్ నగర్ నుంచి డికె అరుణను పోటీలో నిలపాలని కాంగ్రెస్ ఆలోచిస్తే కాంగ్రెస్ బాగున్నప్పుడు జైపాల్ రెడ్డి కాంగ్రెస్ క్షీణించినప్పుడు నన్ను పోటీ చేయమంటారని డికె అరుణ ప్రశ్నించినట్లు కెటిఆర్ విమర్శించారు. ఇదే పరిస్థితి రాష్ట్ర మంతటా నెలకొని ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీకు అభ్యర్థుల కొరత ఉందని కెటిఆర్ హేళన చేశారు. అయితే టిఆర్‌ఎస్ నుంచి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు పోటీలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీచేస్తున్నట్లు భావించి ఓట్లు వేయాలని కెటిఆర్ ప్రజలను కోరారు. టిఆర్‌ఎస్ నాయకులు ఇంట్లో గెలిచి రచ్చగెలవాలనే సామెతను పాటిస్తూ ఎంతటి నాయకుడైనా మొదట స్వంత గ్రామంలో టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాలని చెప్పారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల దగ్గరకు వెళ్లి స్థానిక నాయకలు ఓట్లు అడగడంతో పాటు వారు టిఆర్‌ఎస్‌లో చేరితే ప్రాంతీయ రాజకీయాలు పక్కకు పెట్టి పార్టీలో చేర్పించుకోవాలని కెటిఆర్ ఆదేశించారు. స్థానిక నాయకులు పార్టీల్లోని విభేదాలను పరిష్కరిస్తూ కాంగ్రెస్.బిజెపి తదితరపార్టీల కార్యకర్తలను టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలను అనుభవిస్తున్న అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులు టిఆర్‌ఎస్‌కు ఓటు ఎందుకు వేయరని ప్రశ్నించారు. విభేదాలు పక్కకు పెట్టి వారిదగ్గరకు వెళ్లి అడిగితే తప్పనిసరిగాటిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారన్నారు.

పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడుతున్నాయి
తెలంగాణ ఉద్యమంలో సాగునీటి అంశం ప్రధానంగా చోటు చేసుకున్నా ప్రధాని మోడి తెలంగాణకు ఒక్కసాగునీటి ప్రాజెక్టు ఇవ్వలేదని కెటిఆర్ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ పాలమూరు ప్రాజెక్టుకు కానీ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని మోడీని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకుంటే పాలమూరు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి జాతీయ హోదా తన్నుకుంటూ రాదాని ప్రశ్నించారు. వ్యవసాయంలో అనుభవమున్న సిఎం కెసిఆర్ పాలమూరును పచ్చగా చేసేందుకు అనేక ప్రాజెక్టులను నిర్మించి. చెరువులను పునరుద్ధరించి సాగునీరు అందిస్తుంటే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడుతున్నాయని దుయ్యబట్టారు. పాలమూరు ప్రజలు వలస బతుకులలతో దారిద్య్రం అనుభవిస్తుంటే రాజకీయం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులకు పాలమూరు పచ్చబడుతుంటే వారి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. గత పాలనలో పాలమూరును దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన చంద్రబాబు పాలమూరును పేదరికంలోకి నెట్టి రాజకీయం చేశారని నిందించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేసి నీల్లు ఇస్తుంటే కాంగ్రెస్‌కు నిద్రపట్టడంలేదన్నారు. పాలమూరు బతుకులను తీర్చిదిద్దాలంటే కేంద్రం మెడలు వంచి ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చుకోవాలని కెటిఆర్ పునరుదిఘాటించారు.

నాగర్‌కర్నూల్ లో గులాబి జెండా ఎగరాలి
గతమూడు పర్యాయాలు నాగర్‌కర్నూలు అనేక కారణాలతో టిఆర్‌ఎస్‌కు దూరం అయినా ప్రస్తుతం లక్షలాది మెజారిటీతో నాగర్‌కర్నూల్‌ను గెలిపించుకునే బాధ్యత పార్టీ నాయకులపై ఉందన్నారు. మెదక్, కరీంనగర్‌తో పోటీపడి మెజారిటీ సాధించాలని చెప్పారు. పాలనాసంస్ఖరణల్లో భాగంగా ఒకే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటు జరిగాయని తెలిపారు. ఇందులో నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాలజిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ గెలుపుకోసం పార్టీశ్రేణులంతా పట్టుదలతో ఎన్నికల క్షేత్రం లోకి దూరి గెలిపించుకుంటే పాలమూరు ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారనీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తారని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఢిల్లీలో గులాంగిరి చేసే కాంగ్రెస్ నాయకులు కావాలో అభివృద్ధికోసం పేగులు తెగేంతవరకు పోరాటం చేసే గులాభీల గుబాళింపు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కెటిఆర్ చెప్పారు. ఇదిలా ఉండగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి రాములు, జూపల్లి కృష్ణారావు, శాసన సభ్యులు మర్రి జనార్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అబ్రహం, చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, శాససనమండలిసభ్యులు పల్లారాజేశ్వర్ రెడ్డి,కర్నే ప్రభాకర్, నారాయణ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు మాట్లాడుతూ పోటీతత్వంతో ముందుకు కదిలి నాగర్ కర్నూల్ విజయం కోసం ఎన్నికల క్షేత్రంలో పోరాడుతామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్వాగత తోరణాల నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ సభావేదిక పైకి కెటిఆర్ చెరుకున్నారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి సభాకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

TRS Working President KTR Speech at Nagarkurnool Meeting