Home తాజా వార్తలు మంగళ్‌పల్లిలో… అందుబాటులోకి ట్రక్‌పార్కు..!

మంగళ్‌పల్లిలో… అందుబాటులోకి ట్రక్‌పార్కు..!

Truck park

 

త్వరలోనే ప్రకటన వెలువరించనున్న హెచ్‌ఎండిఎ
గోదాంలు, కార్యాలయాల కేటాయింపు ప్రక్రియ
వచ్చే ఏడాదిలో బాటసింగారం ట్రక్‌పార్కు

హైదరాబాద్ : నగర శివారు మంగళ్‌పల్లి, బాటసింగారంలలో రెండు భారీ ట్రక్‌పార్కుల ఏర్పాటు పనులు పూర్తికావస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఈ రెండు ట్రక్కు టెర్మినల్స్ నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి, నగరంలోని రవాణా వ్యవహారాలను నిర్వహించే సంస్థలను ఇక్కడికి రప్పించాలని భావిస్తున్నది. నగరంలో ట్రక్కులు, రవాణాధారిత భారీ వాహనాలు తిరగడం ఇక ముందు తగ్గనున్నది. ట్రాఫిక్‌ల సమస్య, వాటి అక్రమపార్కింగ్, చొరబాటు, కాలుష్యం తగ్గుముఖం పట్టనున్నది. సరిగ్గా గత తొమ్మిదేళ్ళ క్రితం అంటే ఆగస్టు 2010లో హెచ్‌ఎండిఎ ఈ ట్రక్ పార్కులను బాటసింగారం, మంగల్‌పల్లిలో ఏర్పాటు చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్(పిపిపి) విధానంలో టెండర్లను ఖరారు చేసింది.

హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ట్రక్‌పార్కుల అవసరాన్ని హెచ్‌ఎండిఎ గుర్తించి శివారు ప్రాంతంలోనే వీటి నిర్మాణం రెండేళ్ళలో పూర్తికావాలని నిర్ణయించింది. అయితే, గత రెండేళ్ళ క్రితమే వీటి పనులు ప్రారంభమై… ఇప్పుడు ఆ పనులు వేగంగా పూర్తిచేసుకోబోతున్నాయి. మంగళ్‌పల్లిలో పనులు దాదాపు పూర్తికావచ్చాయి. బాటసింగారం పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తికావచ్చని అధికార వర్గాల సమాచారం.

ఇవీ ట్రక్‌పార్కులు…
మంగల్‌పల్లి : నాగార్జునసాగర్ రాష్ట్రీయ రహదారికి చేరువగా ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలోనే ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గ్రామంలో ఈ ట్రక్ పార్కును ఏర్పాటు చేశారు. విస్తీర్ణం 22 ఎకరాలు. నిర్మాణ వ్యయం రూ. 20 కోట్లు. ట్రక్ పార్కింగ్ సామర్థం 250 ట్రక్కులు. లక్ష చ.అ.లుగా గోదాం. కోల్డ్‌స్టోరేజెస్ సామర్థం 5వేల మెట్రిక్‌టన్నులు. నిర్వాహణదారులకు కార్యాలయ సముదాయం 5 వేల చదరపు అడుగులు. ఆటోమొబైల్ సేవాకేంద్రాలు 5 వేల చ.అ.లు. 100 మంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా డార్మిటరీలు. రెస్టారెంట్స్ లేదా కేఫ్‌టేరియా నిర్మాణం 3 వేల చ.అ.లు. సిఎన్‌జితో కూడిన ఒక పెట్రోల్ బంక్. పరిపాలన, ఇతర అధికార వర్గం ఉండేందుకు 5 వేల చ.అ.లు.గా నిర్మాణం చేయాలి. వ్యాపార సముదాయం నిర్మాణం 1500 చ.అ.లు. ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ బ్రిడ్జి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం 1000 చ.అ.లుగా నిర్మిస్తున్నారు.

బాటసింగారం : విజయవాడ జాతీయ రహదారికి చేరువగా ఔటర్ రింగ్ రోడ్‌కు 7 కి.మీ.ల దూరంలోని బాటసింగారం గ్రామాన ట్రక్‌పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 40 ఎకరాల విస్తీర్ణం, రూ. 35 కోట్లు అంచనావ్యయం. 500 ట్రక్‌లకు పార్కింగ్ సౌకర్యం. 2 లక్షల చ.అ.లుగా గోదాం నిర్మాణం. 10 వేలు మెట్రిక్ టన్నుల కోల్డ్‌స్టోరేజెస్ సామర్థం. నిర్వాహణ కోసం కార్యాలయ సముదాయం 10 వేలు చ.అ.లు. ఆటోమోబైల్ సేవా కేంద్రాలు 10 వేలు చ.అ.ల విస్తీర్ణం. వాహన పరీక్షా కేంద్రం. 200 మంది విశ్రాంతి తీసుకునేందుకు డార్మిటరీలు.

రెస్టారెంట్స్ లేదా దాబాలు 5 వేల చ.అ.లు నిర్మాణం(కనీసంగా రెండుండాలి). సిఎన్‌జితో కలిపి పెట్రోల్ బంక్ లేదా ఒక ఇంధన కేంద్రం. పరిపాలన, ఇతర అధికారిక సంస్థ భవనం 2500 చ.అ.లు., వ్యాపార సముదాయం విస్తీర్ణం 2 వేల చ.అ.లు. ఒక ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1500 చ.అ.లు నిర్మాణం.

భారీ వాహనాల రాకపోకలు : ప్రస్తుతం నగరంలో ప్రతి రోజు 32 వేల ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు రహదారులపై రాకపోకలు సాగిస్తున్నాయి. కనీసంగా ఒక లక్ష పైచిలుకు టన్ను బరువుల వస్తువులను ఎగుమతి, దిగుమతులను చేస్తున్నాయి. కనీసంగా 10 లక్షల చ.అ.ల విస్తీర్ణంలో గోదాం, 10 వేల వాహనాలు పార్కింగ్‌లో ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న హెచ్‌ఎండిఎ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంగా జాతీయ, రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ఈ ట్రక్‌పార్కులను ఏర్పాటు చేస్తున్నది.

త్వరలోనే గోదాంలకై ప్రకటన
మంగళ్‌పల్లిలోని ట్రక్‌పార్కులో గోదాంలు, రవాణా సంస్థలు కావాల్సిన వారు నిర్మాణ సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. హెచ్‌ఎండిఎలోని ఇంజనీరింగ్ విభాగాపు అధికారులను సంప్రదించితే, కేటాయింపులకు సంబంధించిన పూర్తి సమాచారం అందుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Truck park available in Mangalpally