Friday, April 26, 2024

అవమానపరిచే అట్టహాసం!

- Advertisement -
- Advertisement -

Trump

 

ఒకరి పెళ్లి మరొకరి చావుకి వచ్చిందన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయన అడుగు పెట్టే ప్రాంతాల్లోని పేద సాదల, మురికి వాడల నివాసుల కొంపలు కూల్చుతున్నది. ముఖ్యంగా అహ్మదాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన మోతేరా క్రికెట్ స్టేడియం పరిసరాల్లోని పేదలను నిర్వాసితులను చేస్తున్నది. ఉన్నపళంగా కట్టుబట్టలతో, తట్టాబుట్టా చేత పట్టుకొని ఇళ్లు ఖాళీ చేయక తప్పని దుస్థితిలోకి నెట్టివేస్తున్నది. రాకరాక విచ్చేస్తున్న అత్యంత విలువైన అతిథి కోసం ప్రధాని మోడీ తన స్వరాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో భూమంత వేదిక, ఆకాశమంత పందిరి వేయిస్తున్నారు. గతంలో అమెరికాలోని హూస్టన్‌లో తన గౌరవార్థం ట్రంప్ జరిపించిన హౌడీ మోడీ కార్యక్రమం తల తన్నే విధంగా ఏర్పాట్లు చేయిస్తున్నారు. దాని నమూనాలోనే ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరగనున్నది. విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు అర కిలోమీటర్ దూరం 7 అడుగుల ఎత్తున గోడ నిర్మిస్తున్నారు.

కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉంటున్న దేవ్‌శరణ్ మురికివాడను ట్రంప్ కంట పడనీయకుండా చేయడానికి ఈ గోడ నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఈ మురికివాడలో 500 ఇళ్లు ఉన్నాయి. అందులో 2500 మందికి పైగా పేదలు నివసిస్తున్నారు. వారందరినీ ఉన్నపళంగా ఖాళీ చేయించడం కంటే వారు ట్రంప్ కంట పడకుండా గోడ కట్టడమే మంచిదని భావించినట్టున్నారు. గతంలో 2017లో భారత జపాన్ వార్షిక సమ్మిట్‌కు జపాన్ ప్రధాని భార్యతోపాటు గుజరాత్ వచ్చినప్పుడు ఇటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వస్తున్నది ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా అధినేత కాబట్టి ఆయన పదేపదే ప్రధాని మోడీ పట్ల చెప్పనలవికానంత శుష్క ప్రేమ ఒలకబోస్తున్నారు కాబట్టి ఆయన హృదయాన్ని ఉర్రూతలూగించే రీతిలో, స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అంతేకాదు తన భారత పర్యటన కార్యక్రమం ఖరారైన క్షణం నుంచి ట్రంప్ ఉప్పొంగిపోతూ ప్రకటనలిస్తున్నాడు. మోడీ తన కోసం విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు దారి పొడుగునా 70 80 లక్షల మందితో ఘనమైన స్వాగత ఘట్టాన్ని రక్తి కట్టించనున్నారని ప్రకటించాడు. దీనితో గుజరాత్ యంత్రాంగం మరింత రెచ్చిపోయి అట్టహాసంగా ఏర్పాట్లు చేయిస్తున్నది. ఆ మేరకు ట్రంప్ కాలు మోపనున్న ప్రాంతాల్లోని పేదలు అరచేతిలో ప్రాణాలు పట్టుకొని హడలెత్తిపోయే పరిస్థితిని సృష్టించడమే బాధాకరం. ఇలా వచ్చి అలా పోయే అతిథి కోసం దేశంలోని పేదలను కొంప, గూడు లేని పరిస్థితిలోకి నెట్టివేయడం ఆ విధంగా దేశమంతటా గల సాధారణ ప్రజానీకాన్ని అవమానానికి గురి చేయడం ప్రజాస్వామిక ప్రభుత్వ అధినేతలకు తగని పని. ట్రంప్‌కు ఘన స్వాగత ఘట్టాన్ని జరిపించడంలో భాగంగా అహ్మదాబాద్ మునిసిపాలిటీ తాజాగా మోతేరా స్టేడియంకు 1.5 కిలోమీటర్ల దూరంలోని 45 పేద కుటుంబాలకు ఇళ్లు ఖాళీ నోటీసులను జారీ చేసింది.

వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్లకపోతే బలవంతంగా పంపించవలసి వస్తుందని హెచ్చరించింది. అక్రమంగా నివాసముంటున్న వారి నుంచి మునిసిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకునే శాశ్వత కార్యక్రమం లో భాగంగానే నోటీసులిచ్చామని, ట్రంప్ పర్యటనకు దానికి ఎటువంటి సంబంధం లేదని మునిసిపల్ కార్పొరేషన్ బుకాయిస్తున్నది. అదే నిజమైతే ట్రంప్ వెళ్లిన తర్వాత ఈ నోటీసులు ఇవ్వవచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతున్నది. దేశంలో మురికివాడలు లెక్కపెట్టలేని సంఖ్యలో ఉన్నాయి. వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బ తిని గ్రామీణ యువత నోటి వద్ద కూడును కోలోతున్న పరిస్థితుల్లో వారు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు, నగరాలకు అసంఖ్యాకంగా వలసలు కడుతున్నారు. ఇది ఆయా పట్టణాలు, నగరాల్లోని వసతుల మీద తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నది. తల దాచుకోడానికి చోటు లేక ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. మంచినీరు, విద్యుత్తు, పారిశుద్ధం, మంచి గాలి, మురుగు పారుదల వంటి సౌకర్యాలు కొరవడి అవి మురికివాడలుగా మారిపోతున్నాయి.

దేశంలోని పట్టణాల్లోనూ, నగరాల్లో నివసిస్తున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మురికివాడల్లో తలదాచుకుంటున్నారని తేలింది. ముంబై నగరంలోని గృహస్థుల్లో 40 శాతం మంది మురికివాడల్లో ఉంటున్నారు. దేశ వ్యాప్తంగా 6 కోట్ల 40 లక్షల మంది మురికివాడల్లో ఉంటున్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీ జనాభాలో 15 శాతం మంది, కోల్‌కతాలో 30 శాతం మం ది, చెన్నైలో 29 శాతం మంది, బెంగళూరులో 9 శాతం మంది మురికివాడల్లో నివాసముంటున్నారు.వీరికి సకల సౌకర్యాలు గల గృహ వసతి కల్పించడం ప్రభుత్వాలకు అలవికాని పనిగా ఉంది. దీనికి తోడు ట్రంప్ వంటి విశేష అతిథులు ఇచ్చినప్పుడు దేశంలోని పేదలను, పేదరికాన్ని ద్వేషిస్తూ వాటిని అతిథి కంటికి కనిపించనీయకుండా కనుమరుగు చేయాలని ప్రయత్నించడం కుష్ఠు గాయాలకు ప్లాస్టిక్ పూత పూసుకోడం మాదిరి మూర్ఖత్వమే అవుతుంది.

Trump arrival is curse for the poor
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News