Home అంతర్జాతీయ వార్తలు మాట మార్చిన ట్రంప్..!

మాట మార్చిన ట్రంప్..!

Trump continues assault on mail-in voting

 

ఎన్నికల వాయిదాను
కోరడం లేదంటూ వివరణ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరోజులోనే మాట మార్చారు. నవంబర్ 3న జరగాల్సిన ఎన్నికల్ని వాయిదా వేయాలని గురువారం ట్విట్ చేసిన ట్రంప్, తానిప్పుడు ఆ విధంగా కోరుకోవడం లేదంటూ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు. ‘ఆలస్యం కావాలని నేను కోరడం లేదు. ఎన్నికలు జరగాలన్నదే నా అభిమతం. అయితే, ఫలితాల కోసం మూడు నెలలపాటు వేచి చూడటం కూడా తనకు ఇష్టం లేదు’ అంటూ తన ట్విట్‌పై అడిగిన ప్రశ్నపై మీడియాకు సమాధానమిచ్చారు. గురువారం ట్రంప్ తన ట్విట్‌లో ఇలా అన్నారు.. ‘మెయిల్ ఇన్ ఓటింగ్ వల్ల 2020 ఎన్నికలు చరిత్రలోనే అతి తప్పుడు, మోసపూరిత ఎన్నికలుగా మిగిలిపోతాయి.

ప్రజలు కరోనా నుంచి కోలుకొని క్షేమంగా ఓటు వేసేదాకా ఎన్నికల్ని వాయిదా వేయాలి’ అన్నది ట్రంప్ ట్విట్‌లోని సూచన. మరుసటి రోజే ట్రంప్ మాట మార్చడానికి తన సొంత పార్టీ(రిపబ్లికన్) ముఖ్య నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం కావడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికల వాయిదా అనేది సరైన ఆలోచన కాదంటూ రిపబ్లికన్ పార్టీ సెనేట్ జ్యుడిషియరీ చైర్మన్ లిండ్సేగ్రాహమ్ ట్రంప్ సూచనను తిరస్కరించారు. ట్రంప్ సూచప ఎలా ఉన్నా నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని సెనేట్‌లో రిపబ్లికన్ విప్ జాన్‌థూనే స్పష్టం చేశారు.

1788 నుంచి నవంబర్‌లోనే అధ్యక్ష ఎన్నికలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం నవంబర్‌లో మొదటి సోమవారం లేదా నవంబర్ 1 తర్వాత వచ్చే మంగళవారం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. ఒపీనియన్ పోల్స్‌లో తన ప్రత్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ పట్ల ఓటర్లు మొగ్గు చూపడంతోనే ట్రంప్ ఎన్నికల వాయిదాను కోరుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మెయిల్ ఇన్ ఓటింగ్‌కు డెమోక్రట్లు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మెజారిటీ అమెరికన్లు మద్దతు ఇస్తున్నారు. పోలింగ్ బూతుల్లో క్యూలో నిలబడటం పట్ల అమెరికన్లు ఆసక్తి చూపడంలేదు.

Trump continues assault on mail-in voting