Home ఎడిటోరియల్ చరిత్రాత్మక సమావేశం

చరిత్రాత్మక సమావేశం

trump

జూన్ 12వ తేదీన సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిం-జాంగ్ ఉన్ మధ్య జరిగిన సమావేశం ‘చరిత్రాత్మకమైంది’ అని మీడియా పదే పదే ప్రచారం చేసింది. కానీ ఈ ఇద్దరు నేతల సమావేశం తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటనను చూస్తే సమాధానం దొరకని అంశాలు అనేకం ఉన్నాయని తేలుతోంది. ఉత్తర కొరియాకు భద్రత కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారనీ, కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్రాలు లేకుండా చేస్తామని కిం హామీ ఇచ్చారని ఈ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
2018 ఏప్రిల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే -ఇన్‌తో సమావేశమైనప్పుడు కూడా కిం ఇదే మాట చెప్పారు కనక ఈ హామీని పునరుద్ఘాటించినట్టే. ఏప్రిల్ 27వ తేదీన ఉభయ కొరియాల నాయకులు ‘కొరియా ద్వీకల్పంలో అణ్వస్త్రాలు లేకుండా చేసే ఉమ్మడి లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం’ అని ప్రకటించారు. ఈ లక్ష్య సాధన కోసం అంతర్జాతీయ సమాజం మద్దతు తీసుకుంటామని కూడా ఈ ప్రకటనలో తెలియజేశారు. కిం సింగపూర్‌లో ఇదే విషయం చెప్పారు.
దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు నిలిపి వేసి ‘యుద్ధ తంత్రాలకు’ స్వస్తి చెప్తామని కిం తో సమావేశం తర్వాత ట్రంప్ విలేకరుల సమావేశంలో అన్నారు. దక్షిణ కొరియాలో ఉన్న తమ 32,000 మంది సైనికులను కూడా ఉపసంహరించుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా ‘సంపూర్ణ అణ్వస్త్ర నిరాయుధీకరణ సాధిస్తామని, ఇది తనిఖీకి అనువుగా ఉంటుందని, ఇక దీనికి తిరుగు ఉండదు’ అని తెలియజేశారు. ఇదేదో ఒక శిఖరాగ్ర సమావేశంతో సాధ్యమయ్యేటట్టు మాట్లాడారు. అయితే ‘పెద్ద సామ్రాజ్యవాద శక్తి’ మొట్ట మొదటి సారి ఉత్తర కొరియాకు భద్రత గురించి ఉన్న భయాందోళనలను గుర్తించింది. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ద్వారా ఉత్తర కొరియా మీద విధించిన తీవ్రమైన ఆంక్షల గురించి మాత్రం అమెరికా మాట్లాడలేదు. ఉత్తర కొరియా ప్రజలకు ఆహారం అందకుండా చేయడాన్ని అమెరికా అస్త్రంగా వినియోగించుకుంది. ఉత్తర కొరియా భూభాగంలో ఎక్కువ భాగం పర్వత ప్రాంతాలే కనక సేద్యయోగ్యమైన భూమి తక్కువ. అందుకని ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఆహార ధాన్యాల దిగుమతికి అవసరమైన కొరియా ఎగుమతులకు అమెరికా విధించిన ఆంక్షలవల్ల 90 శాతం విఘాతం కలిగింది. వీటన్నింటికీ అణ్వస్త్ర కార్యక్రమానికి సంబంధం ఏమిటి అని అడగవచ్చు. అమెరికా పగ, కక్ష సాధింపు ధోరణికి అవధులు లేవు.
1945 ఆగస్టులో జపాన్‌లోని హిరోషిమా మీద అణు బాంబులు ప్రయోగించినందువల్ల కనీవినీ ఎరగని విధ్వంసం జరిగిన అయిదేళ్లకు అప్పటి అమెరికా అధ్యక్షుడు హారీ ఎస్ ట్రూమాన్ ఉత్తర కొరియా మీద అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని బెదిరించారు. అప్పటి నుంచీ అమెరికా ప్రభుత్వం అణ్వస్త్రాలు ప్రయోగిస్తామనే బెదిరిస్తోంది. 1958లో కొరియా ద్వీకల్పంలో అణ్వస్త్రాలకు స్థానం కల్పించినప్పటి నుంచీ అమెరికా ఈ రకమైన బెదిరింపులే చేస్తోంది. సామ్రాజ్యవాదులు అనుసరించిన ఈ ఎత్తుగడల కారణంగానే తన భద్రత కోసం ఉత్తర కొరియా అణ్వస్త్రాలు తయారు చేయక తప్పలేదు.
2006, 2009, 2013, 2016లో ఉత్తర కొరియా అణు పాట వ పరీక్షలు నిర్వహించింది. అప్పటి నుంచి పరస్పరం బెదిరింపులు మొదలైనాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్ ఉత్తర కొరియాను, ఇరాన్‌ను దుష్ట శక్తులుగా ముద్ర వేశారు. ఇరాక్ మీద దురాక్రమణ చేయడానికి బుష్ ఈ పని చేశారు. అప్పటి నుంచి ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు తమ మీద కూడా అమెరికా ఎప్పుడో బాంబుల వర్షం కురిపిస్తుంది అని జడుస్తూనే ఉన్నాయి. కానీ అమెరికా ప్రభుత్వం కనక తమ దేశ భద్రతకు హామీ ఇస్తే సదుద్దేశంతో చర్చలు నిర్వహిస్తే అణ్వస్త్రాలకు స్వస్తి చెప్పి దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని ఉత్తర కొరియా నిరంతరం చెప్తూనే ఉంది.
అమెరికా మాత్రం ఉత్తర కొరియాను భూతంగా చిత్రించడం ఆపలేదు. దీనితో ఉత్తర కొరియా తన దారి మార్చుకోవడానికి అవకాశం రాలేదు. కానీ ఉత్తర కొరియా కూడా తమ దేశ రక్షణ కోసం అణ్వస్త్రాల ద్వారా నిరోధక చర్యలు చేపట్టడంతో అమెరికా సామ్రాజ్యవాదులు దిగిరాక తప్పలేదు. కనీసం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కొరియా విషయంలో తన విధానాన్ని మార్చుకోక తప్పలేదు.
శాంతి ప్రక్రియలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ నిర్వర్తించిన పాత్రను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఇక నిస్సైనికీకరణ కొనసాగించి ఉత్తర కొరియాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవలసిన బాధ్యత అమెరికాదే. ట్రంప్ విధానంలో వచ్చిన ఈ మార్పును డెమోక్రాటిక్ పార్టీ, ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. సింగపూర్‌లో ట్రంప్‌ను బోల్తా కొట్టించారు అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంపాదకీయంలో పేర్కొంది. ఉత్తర కొరియా అధినేతకు ట్రంప్ సమాన హోదా ఇచ్చి మాట్లాడినందుకు మైనారిటీ నాయకుడు నాన్సీ పెలోసి ఆవేదన వ్యక్తం చేశారు.
1950 నుంచి కొరియా విషయంలో అమెరికా సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న వైఖరిని దృష్టిలో ఉంచుకుని ఉత్తర కొరియా తర్వాత జరిగే సంప్రదింపుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.