Thursday, April 25, 2024

ట్రంప్ వీసా రుసరుసలతో సొంత నష్టం 100 బిలియన్ డాలర్లు

- Advertisement -
- Advertisement -

Trump restrictions on visas are huge loss to companies

విదేశీ నిపుణులకు ఎసరుతో స్వదేశీ లాస్

చితికిన ఆర్థిక వ్యవస్థపై మరింత భారం

వాషింగ్టన్ : విదేశీ ఐటి ఇతరత్రా నిపుణుల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో అమెరికా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లనుంది. ప్రత్యేకించి హెచ్ 1 బి, ఎల్ 1 వీసాల నియంత్రణపై ట్రంప్ వెలువరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో చివరికి అమెరికానే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ట్రంప్ వేటుతోఐటి సంస్థలు ప్రత్యేకించి అమెరికా కంపెనీలు దాదాపుగా వంద బిలియన్ డాలర్లు నష్టపోతాయి. భారతీయ కరెన్సీలో చూస్తే ఈ నష్టం విలువ రూపాయలు 7 లక్షల కోట్లు వరకూ ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన బ్రోకింగ్స్ ఇనిస్టూట్ సంస్థ తమ విశ్లేషణల తరువాత వెల్లడించింది. వీసాల నిలిపివేతలు, పలు రకాల ఆంక్షలతో దాదాపు 2 లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికాకు రాకుండా పోతారని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన పృథ్వీరాజ్ చౌదరీ, పెన్సిల్వేనియాకు చెందిన డేనీ బహాసర్ తమ నివేదికలో తెలిపారు. పలు దేశాలలోని ఐటి ఇతరత్రా ప్రత్యేక నైపుణ్యతల వ్యక్తులను వివిధ కంపెనీలు పోటాపోటీగా ఉద్యోగాలలోకి తీసుకోవడం వారికి బృహత్తరమైన ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతూ వస్తోంది.

ఈ దిశలో హెచ్ 1 బి , ఎల్ 1 వీసాలు మార్గాలుగా ఉన్నాయి. వివిధ రంగాలలో ప్రతిభావంతులైన వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికా ఐటి కంపెనీలలో పనిచేయడం జరుగుతోంది. ఈ క్రమంలో అత్యధికంగా భారతీయ యువ ఐటి మేథకు ప్రాధాన్యత దక్కుతోంది. విదేశీ నైపుణ్య వ్యక్తుల ద్వారా కంపెనీల ఆదాయం, ఉత్పాదకత, పెట్టుబడి , సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలలో చాలా మెరుగైన ఫలితాలు వస్తూ ఉన్నాయని దీనిని నిరూపించే అంశాలు చాలా ఉన్నాయని నివేదికలో తెలిపారు. కోవిడ్ తరువాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు చేపడుతున్న పలు చర్యలు ఇప్పటి తాజా వీసా ఆంక్షల నిర్ణయాలతో సరైన ఫలితాలను ఇవ్వలేకపోతాయి. కుంటుపడుతాయని నిపుణులు హెచ్చరించారు. స్కిల్డ్ వర్కర్లను తీసుకుని వివిధ అమెరికన్ కంపెనీలు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రాజెక్టులకు మెరుగులు పెట్టుకుంటున్నాయి. స్వదేశీ ప్రతిభకు పట్టం , ఉద్యోగం అనే నినాదంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావం చివరికి అమెరికా కంపెనీలకు నష్టం కలుగచేస్తాయి.

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇండియన్ ఐటి వృత్తినిపుణులకు హెచ్ 1 బి వీసా ఆశాజనకంగా ఉంటూ వచ్చింది. అయితే వీటి వడపోతకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం జూన్ 22వ తేదీన కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించారు. దీనితో తాత్కాలికంగా దేశంలో తాజాగా హెచ్ 1 బి, ఎల్ 1 వీసాలను డిసెంబర్ 31 వరకూ జారీ చేయకుండా నిషేధించారు. దీనితో ఫార్చూన్ 500 కంపెనీలపై చూపే ప్రభావం విలువ 100 బిలియన్ డాలర్లు పైబడి ఉంటుందని బ్రూక్సింగ్స్ తెలిపింది. వలసల నిరోధం పేరిట ట్రంప్ తీసుకుంటున్న చర్యల ప్రభావంతో విదేశీ నైపుణ్య శక్తిపై ఆధారపడి ఉండే పలు అమెరికా కంపెనీలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వీసాల ప్రతికూలత ఈ విధంగా ఉండగానే మరో వైపు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం మరో నిర్ణయం తీసుకోనుంది. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండే కాలాన్ని కుదించడం, శాస్త్రీయ పరిశోధకుల పరస్పర మార్పిడిని తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీని వల్ల శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక సృజనాత్మకతలో అమెరికా సారధ్యం, బాధ్యతాయుత నాయకత్వానికి గండిపడుతుందని అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ అభిప్రాయపడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News