Home తాజా వార్తలు చైనాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించలేదు

చైనాతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించలేదు

Donald Trump

 

బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్: అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడిందన్న ఆశలకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గండికొట్టారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేసే దిశగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రకటించి బాంబు పేల్చినంత పని చేశారు. అమెరికాతో తొలి దశ ఒప్పందం కుదిరిందని.. దీని ప్రకారం దశలవారీగా ఒకరి వస్తువులపై మరొకరు సుంకాలు వెనక్కి తీసుకోనున్నామని చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్ దీన్ని కొట్టిపారేశారు.‘ సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు (చైనా)కోరుకున్నారు. అయితే పూర్తిస్థాయి సుంకాల ఎత్తివేతపై మాత్రం వారు చర్చించలేదు. ఎందుకంటే నేను చేయనని వారికి తెలుసు. నేను మాత్రం ఇంకా ఎలాంటి అంగీకారం తెలపలేదు’ అని వైట్‌హౌస్‌లో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, అందుకే ఒప్పందానికి వారు ఉబలాటపడుతున్నారన్నారు. అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకోవడానికి అమెరికా అంగీకరించిందని.. తుది ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నారని, ఇరు దేశాల మధ్య వ్యక్తమైన ఆందోళనలపై చర్చించామన్నారు. దీంతో అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడినట్లేనని అందరూ భావించారు. కానీ ట్రంప్ తాజా ప్రకటనతో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా ప్రకటనతో ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ ప్రకటనపై మార్కెట్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Trump says has not agreed to trade deal with China