Home అంతర్జాతీయ వార్తలు జన భారత్‌లో ఘన పర్యటనకు రెడీ

జన భారత్‌లో ఘన పర్యటనకు రెడీ

Trump

 

అమితోత్సాహంతో ట్రంప్
ప్రధాని మోడీకి పొగడ్తలు
ఫీల్‌గుడ్ చాన్స్‌గా ఆనందం

వాషింగ్టన్: భారతదేశంలో తొలి పర్యటనకు తాను ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండియాలో లక్షలాది మంది జనం సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24, 25వ తేదీలలో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. పలు ఒప్పందాలు ఈ సందర్భంగా ఖరారు అవుతాయని భావిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు వెలువరించారు. సుంకాల హెచ్పింపు, భారత ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో ప్రతిబంధకాల కోణంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యపరంగా చిక్కులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు ట్రంప్ ఆగమనం కీలకంగా మారింది.

బుధవారం అమెరికా అధ్యక్షులు తమ ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. ఇండియా పర్యటన కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆయన (మోడీ) గ్రేట్ జంటిల్మెన్ అని ట్రంప్ కొనియాడారు. అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి, ఈసారి రిపబ్లిక్ డే వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొంటారని భావించారు. అయితే వీలు కాలేదు. దీనితో ఫిబ్రవరి చివరి వారం పర్యటనను ఖరారు చేశారు. ఒక్కరోజు క్రితమే ట్రంప్ భారత్ పర్యటన తేదీలను వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. దేశంలో అభిశంసన గండం నుంచి గట్టెక్కిన తరువాత ట్రంప్ భారత్‌కు వస్తున్నారు.

సరైనదైతే ట్రేడ్‌డీల్
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి తాము సిద్ధంగానే ఉన్నామని ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సరైన ఒప్పందం అయితే కుదుర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో భారతదేశం ముందుకు వస్తోందని, అయితే ఒప్పందం మంచిదే అయితే తాము ఎందుకు కాదంటామని ట్రంప్ ప్రశ్నించారు. భారత్ పర్యటన గురించి తాను ప్రధాని మోడీతో మాట్లాడినట్లు తెలిపారు. ఆ తరువాత ఎప్పుడెప్పుడు ఇండియా పర్యటనకు వెళ్లుతానా? అనే తపన పెరిగిందని అన్నారు. న్యూఢిల్లీలో అధికారిక పర్యటన తరువాత ట్రంప్ అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలలో సందర్శనకు వెళ్లుతారు. అహ్మదాబాద్‌లో లక్షలాది మంది భారతీయులు ట్రంప్ రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోడీ తనతో ఫోన్‌లో చెప్పారని విలేకరులకు ట్రంప్ వివరించారు.

ఆయన మాటలతో భారత్ సందర్శన ఆసక్తి పెరిగిందన్నారు. తనకైతే అమెరికాలో తన సభలకు వచ్చే 40 లేదా 50 వేల మంది జనం ముందు ప్రసంగించడం పెద్దగా సంతోషం అన్పించదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన (మోడీ) సభకు లక్షలాది మంది వస్తారని చెప్పారని , ఇక్కడి అరలక్ష జనం సభ తనకు ఫీల్‌గుడ్‌గా తోచదని తెలిపారు. తనకు తెలిసినదాని ప్రకారం అహ్మదాబాద్‌లో విమానాశ్రయం నుంచి న్యూస్టేడియం వరకూ కనీసం 70 లక్షల మంది జనం రావచ్చునని ట్రంప్ ఉత్సాహం ప్రదర్శించారు. ప్రపంచంలోనే ఆ స్టేడియం అతి పెద్దదని, మోడీనే దీనిని నిర్మించారని ట్రంప్ తెలిపారు. అహ్మదాబాద్‌లో దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకున్న మోటేరా స్టేడియంలో మోడీ, ట్రంప్‌లు సంయుక్తంగా మాట్లాడనున్నారు.

అమెరికా హుస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ తరహాలోనే అహ్మదాబాద్‌లో ఈ అట్టహాసపు సభను ట్రంపెట్ తరహాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. పదికోట్ల అమెరికన్ డాలర్ల వ్యయ అంచనాలతో ఈ స్టేడియంను నిర్మించారు. లక్ష మంది వరకూ హాజరయ్యే స్థాయిలో దీనిని నిర్మించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం స్థాయిని మించిన సామర్థం ఈ స్టేడియంకు ఉంది. ట్రంప్, మోడీల మధ్య వ్యక్తిగత సత్సంబంధాల దిశలో ట్రంప్ అధికారిక పర్యటన మైలురాయిగా నిలుస్తుందని అమెరికాలో భారతదేశ నూతన రాయబారి తరంజిత్ సింగ్ ఆ తరువాత తెలిపారు. ఇప్పుడు జరిగే పర్యటనతో ఈ బంధం మరింతగా ఇనుమడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరస్మరణీయ స్వాగతం: మోడీ
ఈనెలలో ట్రంప్ భార్యతో భారతదేశానికి రావడం పట్ల ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం దీనిపై ఆయన పలు ట్వీట్లు వెలువరించారు. ట్రంప్ అధికార పర్యటన కీలకమైనదని, దంపతులకు కలకాలం గుర్తుండిపొయే రీతిలో స్వాగతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రజాస్వామ్యం, వైవిధ్యత్వపు అంకితభావావాలతో భారత్, అమెరికాలు భావ సారూప్యతను సంతరించుకున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృత అంశాలపై రెండు దేశాలూ ఎంతగానో సహకరించుకుంటున్నాయని, ధృఢమైన స్నేహబంధం కేవలం భారతీయులు, అమెరికన్లకే కాకుండా ప్రపంచమంతటికీ ప్రయోజనకరం అవుతుందని తెలిపారు. 24, 25 తేదీలలో ట్రంప్ పర్యటన ప్రత్యేకమైనదని, ఇరు దేశాల స్నేహబంధానికి ఈ సందర్భం మరింత పటిష్టతను అందిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌కు గౌరవప్రద అతిధికి ఘనమైనదే కాకుండా చిరస్మణీయం అయిన స్వాగతం ఉంటుందని తెలిపారు.

Trump says he is looking forward to first visit to India