Friday, April 19, 2024

మాది రికవరీ.. బిడెన్‌ది రివర్స్‌గిరి

- Advertisement -
- Advertisement -

Trump says the presidential election is crucial

 

ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ఘాటు

ఫ్లోరిడా : నవంబర్ 3 దేశాధ్యక్ష ఎన్నికలు చాలా కీలకమైనవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దేశ విశిష్ట పునరుజ్జీవనం, బిడెన్ నిరాశావాదం మధ్య దేనిని ఎంచుకుంటారో తేల్చుకోవాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు. సూపర్ రికవరీ, డెమోక్రాటిక్ పోటీదారు డిప్రెషన్‌లు ఇప్పుడు ముంగిట నిలిచాయని అన్నారు. అత్యంత కీలకమైన ఫ్లోరిడా నుంచి ట్రంప్ శనివారం తమ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి జో బిడెన్‌పై విమర్శనాస్త్రాలు గుప్పించారు. తామేమో దేశం ఘనంగా తిరిగి కోలుకుంటుందని చెపుతున్నామని, మరో పక్షం తీవ్ర నిరాశ నిస్ప్రహలను రగిలిస్తోందని అన్నారు. ప్రెసిడెన్షియల్ డిబేట్ తుది దశ తరువాత ట్రంప్ ఫ్లోరిడాలో మాట్లాడారు. డిబేట్ దశలో బిడెన్ సామర్థ్యం ఏమిటనేది తేలిందని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అధ్యక్షులు అయ్యే అర్హత లేదని ఆయన తన మాటలక్రమంలోనే నిరూపించుకున్నారని స్పందించారు. ఇప్పటి ఎన్నికలలో ఇప్పటికే సరైన స్పష్టత వచ్చిందని, దేశం అంతా కూడా ట్రంప్ సాగిస్తున్న రికవరి వైపు ఆశతో ఎదురుచూస్తోందని తెలిపారు. ఎప్పుడూ పెదవి విరిచినట్లుగా ఇక అంతా అయిపోయినట్లుగా మాట్లాడుతోన్న బిడెన్‌ను దృష్టిలో పెట్టుకుని తాను ఆయన నిరాశావాదం గురించి చెపుతున్నానని వ్యాఖ్యానించారు.

తాము అమెరికన్ల కలల గురించి పాటుపడుతామని , ఈ అంశమే తమకు ప్రాధాన్యతక్రమమని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ దేశం ప్రపంచంలో అతి గొప్పదేశమనే భావన తమకుందని, ఈ దిశలోనే తాము సాగుతున్నామని ప్రకటించారు. ప్రత్యర్థి బిడెన్ పూర్తి స్థాయిలో తీవ్రవాద, సోషలిస్టు, వామపక్ష శక్తుల చేతుల్లో బందీగా ఉన్నారని, వారు చెప్పినట్లే ఆయన నడుచుకుంటారని హెచ్చరించారు. దేశంలో చమురు పరిశ్రమ రద్దు చేస్తానని బిడెన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక బిడెన్ సహపోటీదారు అయిన సెనెటర్ కమలా హారిస్ ఏకంగా సూపర్ రాడికల్ లెఫ్ట్ అని విమర్శించారు. వీరిద్దరూ అధికారంలోకి వస్తే ఇక దేశానికి చమురుపరమైన స్వాతంత్య్రం హరించుకుపోతుందన్నారు. ఇప్పటివరకూ దేశానికి ఇంధన స్వేచ్ఛ ఉందని, వారువస్తే ముందు దీనిని కబళించివేస్తారని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా సెనేట్‌లో పూర్తి స్థాయి లిబరల్ సభ్యురాలు హారిస్ అని, ఈ విధంగా ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ దేశానికి తొలి మహిళా నేత కాజాలదని తేల్చిచెప్పారు. ప్రత్యర్థులు అమెరికాను కమ్యూనిస్టు క్యూబాగానో సోషలిస్టుల వెనిజులాలాగానో మార్చివేయాలని చూస్తున్నారని ట్రంప్ హెచ్చరించారు. అయితే అమెరికన్లు ఇటువంటి యత్నాలను ముందుకు సాగనివ్వరని ట్రంప్ తేల్చిచెప్పారు.

అందరికీ యాంటిబాడీస్ చికిత్స

కరోనా చికిత్స విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ట్రంప్ హామీ ఇచ్చారు. తనకు యాంటీబాడీస్ చికిత్స జరిగిందని, ఇటువంటి చికిత్సా విధానాన్ని అవసరమైన వారందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తాను దీనిని తీసుకున్న తరువాత ఇప్పుడు సూపర్‌మెన్‌గా మారానని ట్రంప్ చమత్కరించారు. ప్రస్తుతానికి అమెరికన్లకు రోగనిరోధక శక్తిని కల్గించే యాంటీబాడీస్ చికిత్స ఏర్పాట్లు జరుగుతాయని, తరువాత అందరికీ వ్యాక్సిన్ ఏర్పాట్లు జరుగుతాయని, అంటువ్యాధో, మహమ్మారోగా మారిన కోవిడ్ వైరస్‌ను నిర్మూలించే శక్తివంతమైన మందు వస్తుందని అన్నారు. ఇది వచ్చేలోగానే వైరస్ అంతం అవుతుందని, అయితే ఈ వ్యాక్సిన్‌తో ఈ వైరస్ మరింత తొందరగా నశిస్తుందని తెలిపారు.

చైనా ఆధిపత్యాన్ని తుదముట్టిస్తాం

రిపబ్లికన్స్‌కు వేసే ఓటు దేశంలోని సురక్షిత వాతవరణానికి దారితీస్తుందని, మంచి ఉద్యోగాలు వస్తాయని, అమెరికన్లందరికీ అపరిమిత ఉజ్వల భవిత అందుతుందని అన్నారు. ఇది అమెరికన్ల కలలకు వేసే ఓటు అవుతుందని భరోసా ఇచ్చారు. వచ్చే నాలుగేళ్లలో అమెరికా ప్రపంచంలోనే ఉత్పత్తికి అగ్రస్థాయి కేంద్రం అవుతుంది, సరుకుల ఉత్పత్తి విషయాలలో చైనాపై ఆధారపడే పరిస్థితి ఉండదని, చైనా ఆధిపత్యం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు. ప్రత్యర్థి బిడెన్ ఈ దేశాన్ని యుద్ధాల ఊబిలోకి లాగుతారని, అంతులేని మధ్యప్రాచ్య ఇతర అనవసర యుద్ధాలలో అమెరికన్లను పాలుపంచుకునేలా చేస్తారని, ఇది ఆ పార్టీ విధానం అన్నారు. బిడెన్ తన 47 ఏళ్ల నిద్రావస్థలో చేయలేని గొప్ప పనులను తాను కేవలం 47 నెలల్లో చేసి చూపించానని ఈ దేశాన్ని యుద్థానికి అతీతం చేశానని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News