Home జాతీయ వార్తలు అమెరికాకు రండి కానీ…

అమెరికాకు రండి కానీ…

Donald Trump speech

 

న్యాయబద్ధంగా రావాలని వలసదారులకు ట్రంప్ హితవు

మెక్సికో సరిహద్దులో గోడ కట్టి తీరుతా అమెరికా కాంగ్రెస్ ప్రసంగంలో అధ్యక్షుడి పునరుద్ఘాటన

వాషింగ్టన్: ప్రతిభ ఉన్నవారు తమ దేశానికి రావాలన్న ఉద్దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. అయితే తమ దేశానికి వచ్చే వారు న్యాయపరంగా రావాలని ఆయన కోరారు. ట్రంప్ మంగళవారం యుఎస్ కాంగ్రెస్‌నుద్దేశించి చేసిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ, అక్రమ వలసలు పెను ముప్పుగా పరిణమించాయని అన్నారు. ‘అమెరికన్ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. మా చట్టాలను గౌరవిస్తూ నేడు లక్షలాది మంది వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది అమెరికాకు రావాలనే నేను కోరుకుంటున్నాను. అయితే వారు న్యాయపరంగా రావాలి’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం గురించిప్రస్తావించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు.ఈ గోడ నిర్మాణంతో అక్రమ వలసలు, స్మగ్లింగ్‌ను నిరోధించవచ్చని పేర్కొన్నారు. దేశంలో అక్రమ వలసలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యగా ఆయన అభివర్ణించారు. కోడి గుడ్డుకు ఈకెలు పీకే ధోరణిలో డెమోక్రాట్లు అమెరికాలో శాంతికి భంగం కలిగిస్తున్నారన్నారు. గోడ నిర్మాణానికి నిధుల మంజేరుపై వ్యతిరేకలతను వారు వీడాలన్నారు.గతంలో ఈ సభలో చాలా మంది సరిహద్దు గోడ నిర్మాణానికి అనుకూలంగా ఓటు వేశారని అంటూ.. అయినా గోడ నిర్మాణం జరగలేదన్నారు. తాను మాత్రం గోడను నిర్మించి తీరుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

చైనాను కాదు.. మన నాయకుల్ని అనాలి
అమెరికాను అలుసుగా తీసుకొన్నందుకు చైనాను నిం దించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. దీనికి తమ నాయకులదే తప్పని ఆయన తేల్చారు. వారే చైనాకు ఆ అవకాశమిచ్చారన్నారు. చైనాపై 250 బిలియనన్ డాలర్ల మేర పన్నులు విధించడం వల్ల ఖజానాకు బిలియన్ డాలర్ల కొద్ద్దీ నిధులు సమకేరుతున్నాయని అన్నారు. అమెరికాలో ఉద్యోగాలను, మేధోసంపత్తిని చైనా దోచుకుంటోందని అన్నారు. తాము కఠినంగా వ్యవహరించి దానికి అడ్డుకట్ట వేశామని చెస్పుకున్నారు. అమెరికాను దోచుకోవడం ఎంతమాత్రం ఇక కుదరదని తేల్చి చెప్పామన్నారు. వాస్తవ పరిస్థితిలో మార్పు ఉంటే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగిత గత అయిదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉందని చెప్పుకొన్నారు.

రాజకీయ ఐక్యత అవసరం
అమెరికా శత్రువులను ఓడించాలంటే రాజకీయ ఐక్యత ముఖ్యమని ట్రంప్ అన్నారు.అత్యున్నతమైన ఎంపిక ఉండాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న విభేదాలను వీడి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. కోట్ల మంది ప్రజలు మనల్ని గమనిస్తున్నారని ఆయన డెమోక్రాట్లకు గుర్తు చేశారు. రెండు పార్టీల వలె కాకుండా ఒకే దేశంలాగా పని చేద్దామన్నారు.

27న కిమ్‌తో భేటీ
ఫిబ్రవరి 27న వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో మరోసారి భేటీ కానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశం రెండు రోజులు జరుగుతుందని చెప్పారు. ఉత్తరకొరియా అణ్వాయుధాలను వదిలిపెట్టేలా చూసే తన కృషి కొనసాగుతుందని చెప్పారు. గతంలో సింగపూర్‌లో తమ మధ్య జరిగిన సమావేశంతో సుహృద్భావ వాతావరణం నెలకొందని చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పారు.

తాలిబన్లతో చర్చలు
అఫ్గానిస్థాన్‌లో అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు సాగిస్తామన్నారు. ఈ వర్గాల్లో తాలిబన్లు కూడా ఉంటారని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల దళాల ఉపసంహరణ సులభమై, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతుందన్నారు. అయితే ఈ క్రమంలో ఒప్పందం కుదురుతుందో లేదో చెప్పలేనన్నారు. కానీ శాంతి సాధనకోసం తుది ప్రయత్నానికి సమయం ఆసన్నమైందన్నారు. అవినీతిపరులైన పాలకుల వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇరాన్‌తో తాము అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని 80 నిమిషాలపాటు సాగిన తన ప్రసంగంలో ట్రంప్ చెప్పారు. ఇప్పటివరకు ఏ దేశంపై విధించనంత కఠినమైన ఆంక్షలను ఇరాన్‌పై విధించామన్నారు. అమెరికా ‘ఇరాన్ వ్యూహం’లో దీనిని విప్లవాత్మకమైనదిగా అభివర్ణించారు.

Trump speech on Immigrants in Annual State of Union