Thursday, March 28, 2024

అమెరికా అభాసు

- Advertisement -
- Advertisement -

అమెరికా అభాసు.. పార్లమెంట్ భవనంలో ట్రంప్ మూకల అరాచకం

‘కేపిటల్’ ముట్టడి, ఘర్షణల్లో నలుగురు దుర్మరణం ఒక మహిళ పోలీసు కాల్పుల్లో, ముగ్గురు ఇతర ఘటనల్లో

అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణకు పార్లమెంట్ సమావేశం జరుగుతుండగానే వేలాది మందిని రెచ్చగొట్టి పంపించిన ట్రంప్
తనకు అనుకూలంగా వ్యవహారం జరిపించాలని విధేయ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ను కోరిన ట్రంప్
మౌనంగా అంగీకరించి ఆచరణలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి బైడెన్ ఎన్నికను ధ్రువపరిచి, గురువును ధిక్కరించిన శిష్యుడు పెన్స్

వాషింగ్టన్: అమెరికా చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో గురువారం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి జరిగింది. క్యాపిటల్ భవనంలో జో బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్ ఉభయ సభలు(సెనెట్, ప్రతినిధుల సభ) సంయుక్తంగా సమావేశం అయ్యాయి. వేలాది మంది ట్రంప్ మద్దతుదార్లు బయటగుమికూడారు. గాజు అద్దాలను పగులగొట్టి లోపలికి చొచ్చుకుని వెళ్లారు. లోపల జరుగుతున్న అధికారిక విజేత ధృవీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు యత్నించారు. భద్రతా బలగాలు పరిస్థితిని తెలుసుకుని, వారిని నివారించేందుకు యత్నించేలోగానే వారు బారికేడ్లు దాటుకుంటూ లోపలికి చేరుకున్నారు. గోడలు ఎక్కుతూ లోపలికి వెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు వెలుపల హింసాత్మక వాతావరణం నెలకొంది, ఆందోళనకారులను నివారించేందుకు పోలీసులు ముందు భాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో, వెలుపల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల క్రమంలో మొత్తం నలుగురు మృతి చెందారు. కాంగ్రెస్ సెషన్‌కు హాజరయిన సభ్యులు జరిగిన పరిణామాలతో భయభ్రాంతులు అయ్యారు.
బల్లల కింద నక్కి, సొరంగ మార్గంలోకి దూరి
కొందరు బల్లలు, కుర్చీల కింద తలదాచుకున్నారు. భద్రత సిబ్బంది వచ్చి వారిని ప్రత్యేక ఏర్పాటుగా ఉన్న భూగర్భ సొరంగ మార్గంలోకి తరలించారు. చాలా సేపటి వరకూ సభ్యులు ఇందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ట్రంప్ గుంపు లోపల తమ నేత జండాలు పట్టుకుని కలియతిరిగారు. సభ్యులు ఎక్కడ కన్పించడం లేదంటూ గద్దిస్తూ అరాచకానికి దిగారు, తలుపులు విసిరికొడుతూ, బల్లలు చరుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. భద్రతా సిబ్బం ది హెచ్చరికలతో భవనం అధికారులు అప్రమత్తం అయ్యా రు. వెంటనే తలుపులకు తాళాలు వేశారు. దీనితో లాక్‌డౌన్ దశను సభ్యులు అనుభవించాల్సి వచ్చింది. కొందరు సభ్యులు బల్లల కింద కూర్చుని దేవుడ్ని ప్రార్థించడం కన్పించింది. దేశంలో తలెత్తిన విభజన రేఖలు దీనితో చోటుచేసుకున్న హింసాత్మక ఫలాలను తాము చేదుగా అనుభవించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. క్యాపిటల్ బిల్డింగ్ ఉండే ప్రాంతం అంతా అట్టుడికిపోయింది. మాస్క్ లు వేసుకోకుండా ట్రంప్ మద్దతుదార్లు ఇష్టం వచ్చినట్లు తిరగడంతో సామాన్య జనం కంగుతిన్నారు. అత్యంత ఆకర్షణీయంగా, రాజరికం ఉట్టిపడినట్లు ఉండే ఇక్కడి మార్గం రోటుండా భాష్పవాయువులు, తొక్కిసలాటలు, తరువాతి క్రమంలో కాల్పులతో దెబ్బతింది. కాల్పులు ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. గాయపడ్డ ముగ్గురు చికిత్స దశలో మృతి చెందారు.


సభాధ్యక్షుడి స్థానానికి అవమానం
సెనెట్‌లోకి చొచ్చుకుని వచ్చిన ట్రంప్ మద్దతు దార్లు సభాధ్యక్షుడి స్థానంపై కూర్చున్నారు. హోస్ స్పీకర్, సెనెట్ డయాస్ ఇతర ప్రాంతాలకు చేరుకున్న ట్రంప్ మద్దతుదార్లు బిగ్గరగా కేకలు పెడుతూ ట్రంపే గెలిచారు అంటూ గందరగోళం సృష్టించారు. పైగా స్పీకర్ నాన్సి పెలోసి ఛాంబర్‌లో దూరిన మద్దతు దారులు వారి జట్టు నేతలతో కలిసి ఫోటోలు దిగారు. కొందరు స్పీకర్ బల్లపై కాలు వేసి, అసభ్యకరంగా ఉన్నప్పటి ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతకు ముందు కొద్ది సేపటివరకూ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కూర్చున్న స్థానంలో కూడా ట్రంప్ మద్దతుదార్లు భైఠాయించారు. బిల్డింగ్ వెలుపల హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లు తెలియడంతో ఇతర సభ్యులతో పాటు పెన్స్ ఇతర ప్రముఖులు, వారితో పాటు కాంగ్రెస్ సిబ్బంది ఉరుకులు పరుగులపై ఆత్మరక్షణకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ ఘటనలకు ముందు ట్రంప్ గురువారం ఉదయం తన మద్దతుదార్లను ఉద్ధేశించి ఎల్లిపిసేలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. జనంతో పాటు తానుకూడా క్యాపిటల్ బిల్డింగ్‌కు వెళతానని తెలిపారు. అయితే వెళ్లలేదు. అయితే భవనం వద్దకు వెళ్లి ఏదో చేయాలనే రీతిలో వారిని కవ్వించి పంపించినట్లు వెల్లడైంది. అధికారంలో కొనసాగేందుకు ట్రంప్ చివరి నిమిషం వరకూ ప్రయత్నించిన వైనం ఈ దశలో స్పష్టం అయింది. మీరు భీకర స్థాయిలో పోరుకు దిగకపోతే ముందుకు వెళ్లకపోతే ఇక ఈ దేశం మీకు దక్కదని కూడా ట్రంప్ వారిని రెచ్చగొట్టారు, అల్పులు బలహీనులు దేశాధినేతలు అయితే చూస్తూ ఊరుకుంటారా? అని నిలదీశారు. సత్తా చూపాల్సిన సమయం ఇదే అన్నారు.

చట్టసభ లోపల పరీక్షలు కాదు మనం ఇక్కడ బలపరీక్షకు దిగి సత్తా ప్రదర్శించుకుందాం అంటూ ట్రంప్ లాయర్ రూఢీ గియూలియాని గుంపుతో చెప్పారు. ఈ ప్రాంతంలో రెండు పైపు బాంబులను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడనే ఓ లాంగ్ గన్‌ను, మోలోటెవ్ కాక్‌టైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. భవనంలోపల చాలా భయానక పరిస్థితి ఏర్పడిందని డెమొక్రాటిక్ ప్రతినిధి జిమ్ హైమ్స్ తెలిపారు. లోపల ఉన్న భద్రతా అధికారులు చేతుల్లో రివాల్వర్లను కిటికిల బయట ఉన్న అల్లరిమూకల ముఖాలకు గురి పెట్టి ఉంచారని, ఈ లోగా లోపలి సభ్యులకు తగు హెచ్చరికలు వెలువరించారని తెలిపారు. ఈ దశలో భవనంలోపలి అధికారులు ఏ క్షణంలో అయినా బయట ఉన్నవారిపై కాల్పులు జరపవచ్చు అన్పించిందని హైమ్స్ చెప్పా రు. తరువాత క్యాపిటల్ భవనం నుంచి ట్రంప్ మద్దతుదారులను బయటకు తీసుకువెళ్లారు. ఆ తరువాతనే కాంగ్రెస్ జాయింట్ సెషన్ తిరిగి ఆరంభం అయింది. అయితే ట్రంప్ మద్దతుదార్లు భవనం చుట్టుపక్కలనే ఉండి నినాదాలు చేస్తూ గడిపారు. క్యాపిటల్ బిల్డింగ్ ఘటనల నేపథ్యంలోవాషింగ్టన్ డిసిలో మేయర్ మురియెల్ బౌజర్ కర్ఫూ విధించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రాకూడదని ఆదేశాలు వెలువరించారు. అయినప్పటికి ట్రంప్ మద్దతుదార్లు అక్కడక్కడ గుమికూడారు. దీనితో మరింత తీవ్ర చర్యగా నగర వ్యాప్తంగా 15రోజుల అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు, ఆంక్షలు ఉల్లంఘించిన వారిని సహించేదిలేదని మేయర్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో గుమికూడిన నిరసనకారుల చేతుల్లో ఒకరి వద్ద భారత త్రివర్ణ పతాకం కూడా ఉండటం సంచలనానికి దారితీసింది. ఈ వ్యక్తి ఎవరు? ట్రంప్ అనుకూలంగా సాగిన అత్యంత హింసాత్మక ప్రదర్శనలో ఈ వ్యక్తి భారతీయ జండాతో అక్కడికి ఎందుకు వెళ్లారనేది ప్రశ్నగా మారింది. నిరసనకారుల అరాచకాన్ని తెలిపే వీడియో, ఇందులో భారతీయ జెండా కూడా ఉండటం ఇప్పుడు వైరల్ అయింది.
వారే దేశభక్తులు : ఇవాంక ట్రంప్
అరాచకానికి దిగిన గుంపు చర్యలను ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ సమర్థించారు. ఈ మేరకు ట్వీటు వెలువరించారు. దేశం కోసం వారు ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధపడ్డారని, ట్రంప్ విజయానికి వారు పాటుపడ్డారని, నిజానికి వీరే అసలు సిసలు దేశభక్తులంటూ ఇవాంక చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెలువడ్డాయి. శాంతియుత వాతావరణానికి పాటుపడాల్సింది పోయి ఈ విధంగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తారా? అని నెటిజన్లు ప్రశ్నించారు. ఎంతైనా ట్రంప్ సలహాదారు పైగా కూతురు కదా. ఆయన చెప్పినట్లే చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తీవ్రవిమర్శలు వెలువడటంతో తరువాత కొద్ది సేపటికి ఈ ట్వీటు కన్పించకుండా పోయింది.
బాస్ బాసే రూల్స్ రూల్సే: పెన్స్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుత కీలక దశలో తమ చట్టబద్ధత,విధి నిర్వహణను పాటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారని ప్రశంసలు వెలువడ్డాయి. జో బైడెన్ గెలుపును నిర్థారించే ఫలితాల ప్రక్రియకు ఏర్పాటు అయిన జాయింట్ కాంగ్రెస్ సెషన్‌కు ఉపాధ్యక్షులు ఆనవాయితీ ప్రకారం అధ్యక్షత వహించారు. అయితే ఎన్నికల ఫలితాన్ని రద్దు చేయాలని విజేత ప్రకటనను తనకుండే అధికారంతో నిలిపివేయాలని తనకు అత్యంత సన్నిహితుడైన పెన్స్‌కు ట్రంప్ సూచించారు. అయితే దీనికి అవునని కానీ కాదని కానీ చెప్పకుండా పెన్స్ యధావిధిగా విధి నిర్వహణలో భాగంగా తన కర్తవ్యం పాటించారు. ఎన్నికల ఫలితంపై ఇప్పుడున్న అధ్యక్షులు ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను ఆమోదిస్తున్నట్లుగానే ప్రకటించిన పెన్స్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను, ఓట్ల లెక్కింపు ద్వారా వెలువడ్డ ఫలితాన్ని కాదనలేమని, దీనిని ధిక్కరించే అధికారం తనకు లేదని చెప్పిన పెన్స్ ఈ ఫలితాల క్రమంలో బైడెన్ దేశాధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఓ వైపు ఇంతకాలం ట్రంప్ వద్ద అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉంటూ వచ్చిన పెన్స్ అత్యంత కీలకమైన దశలో చిట్టచివరికి తన అంతర్మాత ప్రబోధం ప్రకారం పద్ధతి మేరకు వ్యవహరించినట్లు స్పష్టం అయింది.
క్యాపిటల్ బిల్డింగ్‌కు అత్యంత విశిష్టత
ఇప్పుడు అరాచక పరిస్థితి ఏర్పడ్డ క్యాపిటల్ బిల్డింగ్‌కు అత్యంత విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. చలవరాతితో ఇటుకలతో నిర్మించిన ఈ భవనం తొలి భవనం 1826లో నిర్మించారు. విశాలమైన ఆవరణ, నార్త్ సౌత్ వింగ్స్‌తో అనుసంధాన మార్గాలతో ఉంటుంది. ఇక్కడి డోమ్ అందరిని ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. దీనిని 8,909,200 పౌండ్ల ఇనుముతో రూపొందించారు. ఇక్కడనే స్వాతంత్ర ప్రతీకగా థామస్ క్రాఫోర్డ్ విగ్రహం ఉంచారు. దీనిని దేశ స్వాతంత్య్రానికి చిహ్నంగా ఆరాధిస్తారు.

Trump Supporters Attack on US Capitol Building

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News