Wednesday, April 24, 2024

కరోనాను కలిసి ఎదుర్కొందాం

- Advertisement -
- Advertisement -

Trump Xi Jinping

 

బీజింగ్ : కరోనా మహమ్మారిని చైనా, అమెరికాలు కలిసికట్టుగా ఎదుర్కొవల్సిన సమయం వచ్చిందని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేతలు కరోనా తీవ్రత తరుణంలో ఫోన్‌లో మాట్లాడుకున్నారు. కరోనా కట్టడికి ఇరుదేశాలు ఉమ్మడిపోరు సల్పాల్సి ఉందని జిన్‌పింగ్ ట్రంప్‌ను అభ్యర్థించారు. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ట్రంప్ చొరవ తీసుకుని చైనా అధినేతతో ఫోన్ సంభాషణకు ముందుకు వచ్చారు. కరోనా నియంత్రణ విషయంలో ఇరుదేశాలు సత్సంబంధాలను నెలకొల్పుకోవల్సి ఉందన్నారు. వైరస్ గురించి గత కొద్ది వారాలుగా అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

కరోనా చైనా వైరస్ అని ట్రంప్ పదేపదే చెపుతూ వచ్చారు. అయితే ప్రపంచంలో నలుమూలల తిష్టవేసుకుని ఉన్న అమెరికా సేనల వల్లనే కరోనా పుట్టిందని చైనా ఎదురుదాడికి దిగింది. ప్రస్తుతం సంబంధాలు మెరుగుపర్చుకునే తరుణం అని జి జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. వైరస్ నియంత్రణలో చైనా చురుగ్గా వ్యవహరించిన అంశంపై ట్రంప్ ఆసక్తి ప్రదర్శించారు. ఈ వివరాలను చైనా నేత నుంచి తెలుసుకున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. వైరస్ విషయంలో సమాచారాన్ని , కట్టడిలో తమ అనుభవాన్ని అమెరికాకు తెలియచేసేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది.

చైనా బాగా చేసింది ః ట్రంప్
చైనా అధినేతతో ఫోన్ సంభాషణ పట్ల ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత సవాలుపై తామిరువురం పూర్తి స్థాయిలో మాట్లాడుకున్నట్లు ట్రంప్ ట్వీటు చేశారు. వైరస్‌ను పసికట్టడంలో చైనా బాగా వ్యవహరించింది. ముందు దీనిని అర్థం చేసుకుంది. తరువాత దీనిని అదుపులోకి తెచ్చిందని ట్రంప్ కొనియాడారు. ప్రస్తుత తరుణంలో పరస్పర ఆదరణ భావంతో సంఘటితంగా వ్యవహరిస్తామని తెలిపినట్లు ట్రంప్ వివరించారు.

వ్యాపార వాణిజ్య సంబంధాలు బెడిసికొట్టి, పన్నుల రగడ నెలకొనడంతో చైనా, అమెరికాల మధ్య తీవ్రస్థాయిలో సంఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలోనే వచ్చిపడ్డ కరోనాతో ఈ దూరం మరింతగా పెరిగింది. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత కీలక దశకు చేరుకున్నాయని సిసిటీవీ తెలిపింది. అయితే శరవేగంగానే చైనా ఈ వైరస్‌ను నియంత్రించడం, మరో వైపు అమెరికాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో ఇరు దేశాల నేతల చాలా కాలం తరువాత మాటలు కలిశాయి.

గత వైరాలు గుర్తుపెట్టుకునే తరుణం ఇది కాదని, పరస్పర సహకారంతో ముందుకు సాగడమే ఇరు దేశాల ముందున్న అత్యుత్తమ మార్గమని విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఇప్పుడు చైనాతో పోలిస్తే అమెరికాలో పెరిగింది. ఈ అతి పెద్ద ఆర్థికవ్యవస్థ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 82,400కు చేరుకుంది. మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వైరస్ గురించి తాము ఎక్కడా ఏమీ దాచలేదని, ప్రపంచ ఆరోగ్యసంస్థకు, ఇతర దేశాలకు ఎప్పటికప్పుడు దీని గురించి సమాచారం ఇస్తూనే వచ్చినట్లు జిన్‌పింగ్ ట్రంప్‌తో చెప్పారు.

అంటువ్యాధులు, వైరస్‌లు మానవాళికి ఉమ్మడి శత్రువులు, వీటికి సరిహద్దులు, జాతులు, వర్గాల తేడా లేదని, వీటిని కలిసికట్టుగా ఎదుర్కోవల్సి ఉంటుందనే చైనా అధినేత అభిప్రాయంతో ట్రంప్ ఏకీభవించారు. కరోనా నియంత్రణ కోసం ఇప్పటికే తమ దేశానికి చెందిన కంపెనీలు వైద్య సరఫరాలు అందిస్తున్నాయని జిన్‌పింగ్ తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు అమెరికాకు కూడా కరోనా విషయంపై తాము అన్ని విధాలుగా సహకరిస్తామని, సాయం అందిస్తామని చైనా తెలియచేసింది.

 

Trump Xi Jinping spoke about Corona Severity
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News