Home దునియా ఒక్కసారి ఓడి చూడు!

ఒక్కసారి ఓడి చూడు!

Awinners-image

పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు వారి భవిష్యత్తును భూతద్దంలో చూసి ఎదిగేందుకు మైల్‌స్టోన్స్ నిర్దేశించడం సర్వసాధారణం అయింది నేడు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే సామర్థం పిల్లల్లో ఉందా లేదా అనేది తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు పట్టించుకోవడం లేదు. పిల్లల అభిరుచితో సంబంధం లేకుండా తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ బేస్‌గానే వారి కెరీర్‌ను నిర్దేశిస్తున్నారు. లక్షం చేరుకోలేని పిల్లలను  తోటివారితో పోలుస్తూ మానసికంగా మరింత బలహీనుల్ని చేస్తున్నారు. సక్సెస్ సాధించని జీవితమే దండగ అనే ప్రతికూల భావనలు పిల్లల మనోఫలకంపై తెలియకుండా చిత్రిస్తున్నారు పెద్దలు. ఈ రకమైన పెంపకం పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపకపోగా, అఘాయిత్యాలు చేసుకునేలా ప్రేరేపిస్తోంది. పిల్లల హార్డ్ టైమ్స్‌లో అక్కున చేర్చుకుని ఆదరించాల్సిన తల్లిదండ్రులు, టీచర్లే వారి కర్తవ్యాన్ని మరుస్తున్నారు.

అలాంటి సమయంలో ఏం చేయాలో పాలుపోక పిల్లలు ఎడాలసెంట్ ఏజ్‌లోనే జీవితాలను ఎండప్ చేసుకుంటున్నారు. గిరి గీసుకున్న నేటి బతుకుల్లో  పిల్లలు గోరంత కష్టాన్ని  కూడా కొండంతగా భావించి భయపడుతున్నారు. ఫెయిల్యూర్‌ను పాఠంలా తీసుకుని ‘బతికి సాధించాలనే’ కసిని  సుహృద్భావన లేని నేటి సమాజం పిల్లల్లో కల్పించలేక తనకు తానే ఫెయిలైపోతున్నది. పర్యవసానంగా యువత ఆడి పాడే వయసులో అన్యాయంగా బలిపశువులవుతున్నారు. ఈ రకమైన భావజాలం పెరిగేందుకు అనేక కారణాలున్నా, సక్సెస్‌ను స్వీకరించినట్లు ఫెయిల్యూర్‌ను తీసుకోకపోవడం ముఖ్య కారణంగా ఉంది. అలాగని ఫెయిల్యూర్ లేని సక్సెస్ ఉంటుందా అంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా లేదన్న సమాధానమే వస్తుంది. విజేతల జీవితాలను పరిశీలిస్తే ఫెయిల్యూర్‌ను స్టెపింగ్ స్టోన్‌గా చేసుకుని సక్సెస్ సాధించిన దృష్టాంతాలు అనేకం కనిపిస్తాయి. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ … తప్పుల్లేకుండా పని ఎలా చేయాలో నేర్పిస్తుంది, మరో మారు తడబడకుండా నడవడం ఎలాగో నేర్పిస్తుంది,  ఢక్కా మొక్కీలు తిన్నా నిలదొక్కుకోవడమెలాగనే  జీవిత సూత్రాన్ని నేర్పిస్తుంది, ఇలా ఎన్నో అమూల్యమైన పాఠాలను నేర్పిస్తుంది… అందుకే సక్సెస్ సాధించాలంటే ఒక్క సారి ఓడి చూడడమూ అవసరమే.

సినిమా కథైనా, నవలలో హీరో పాత్రైనా చివరకు విజేతలుగానే నిలుస్తారు, అయితే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాకే వీరిని సక్సెస్ వరిస్తుంది. సక్సెస్ ఓ కలైతే ఫెయిల్యూర్ వాస్తవం. వాస్తవాన్ని అంగీకరించాలంటే పిల్లలకు కష్టాన్ని స్వీకరించడం నేర్పాలి. నిర్ణీత సమయంలో అప్పగించిన పనిని పూర్తిచేయడమెలాగో నేర్పిస్తే చాలు సక్సెస్ సాధించే మార్గం వారికే అర్థమవుతుంది. సక్సెస్ అనేదేదో బ్రహ్మపదార్థం కాదు, కేవలం స్థిరచిత్తంతో కష్టానికోర్చి పనిచేస్తే వచ్చేదే సక్సెస్. పిల్లలకు సక్సెస్ ఎలా సాధించాలో చెప్పడంతోబాటే, ఫెయిల్యూర్‌ను ఏ రకంగా డీల్ చేయాలో కూడా చెప్పాలి, పెద్దలు దీని గూర్చి చెప్పకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. పరాజితులు వారి సామర్థంపై అపనమ్మకం కల్గి ఉంటారు. నిరాశా, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూంటారు. వారు చేసే ప్రయత్నాలపై వారికే నమ్మకం ఉండదు. ఇలాంటి సమయంలో వారిని స్నేహితులో, తల్లిదండ్రులో అక్కున చేర్చుకుని సపోర్ట్ చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

ఈ సమయంలో దొరికే సపోర్ట్ పరాజితులకు మానసిక బలాన్నిస్తుంది. ఇలాంటి సున్నితమైన సందర్భాల్లో తప్పులను ఎత్తి చూపే ధోరణితో కాకుండా పరిష్కారం సూచించే దిశగా వారిని ప్రోత్సహిస్తే ప్రయోజనం ఉంటుంది. విశాల ప్రపంచంలో ఎదిగేందుకెన్నో మార్గాలున్నాయని ప్రేమతో చెబితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. తక్కువ మార్కులు వచ్చినవనో, ప్రేమ విఫలమైందనో, తల్లిదండ్రులు తిట్టారనో, స్నేహితులు గేలి చేశారనో, ఫోన్ కొనియ్యలేదనో, లైంగిక వేధింపులకు భయపడో, వ్యసనాలకు బానిసయ్యో… ఇలా చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న నేటి యువతకు ధైర్యాన్నిచ్చి స్ఫూర్తి నింపాల్సిన అవసరం సమాజంపై ఉంది. వీటి వల్ల జీవించే దారులు మూసుకుపోవనే ధైర్యాన్నివ్వాలి. డబ్బు, హోదా, జల్సా, మానం లాంటివన్నీ ప్రాణం కంటే గొప్పవి కావని వారికి తెలియజేయాలి.

ఇలాంటి విషయాలను చెప్పడంలో తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఓటమి వెనక గెలుపు తప్పకుండా వస్తుంది కాని ప్రాణం పోతే తిరిగి రాదు, అన్ని వయసులవారు దీన్ని అంగీకరించాల్సిందే. జీవితం విలువ తెలియాలంటే ఓడి గెలవాలి కాని ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం తగదు. ఓడి గెలవడంలో ఉండే కిక్కు నేరుగా వచ్చే గెలుపులో ఉండదు కూడా.

కష్టపడకుండా విజయం ఎవరినీ వరించదు. డబ్బు, అధికారం, హోదా, చేసే పనిలో విజయం ఇలా జీవితంలో ఏది సంపాదించాలన్నా అంకితభావంతో పనిచేయడం అవసరం. క్రమశిక్షణతో పనిచేస్తే సామాన్యుడు కూడా మాన్యుడవుతాడు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అసాధారణ విజయాలను సొంతం చేసుకున్నవవారెందరో ఉన్నారు.అతి సాధారణ కుటుంబాల్లో పుట్టి కేవలం పట్టుదలనే పెట్టుబడిగా పెట్టి విజేతలైనవారూ ఉన్నారు. తమకంటూ ఓ సొంత ఇమేజ్‌ను ఏర్పర్చుకుని  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన వీరి  జీవితాలు కూడా ముళ్లబాట దాటి వచ్చినవే…

జీవితంలో సక్సెస్ సాధించకపోవడానికి పేదరికమే కారణమని అనుకునేవారు చాలామందే ఉంటారు. ఇదే ఆలోచిస్తూ చేసేపనిపై శ్రద్ధ పెట్టరు. ఏం చేయాలో పాలుపోక జీవితాలను పణంగా పెడతారు. అయితే సక్సెస్ సాధించకపోవడానికి కారణం పట్టుదల, ప్రయత్న లోపమే ప్రధాన కారణమవుతుంది. దీనికి పేదరికాన్ని నిందించడం ఎంతమాత్రం సబబుకాదు. సినీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ జీవితాన్ని
పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

నవాజుద్దీన్ సిద్దిఖీ : వారసత్వం లేకుండా సినిమా రంగంలో నిలదొక్కుకోలేరనే అపోహలను తప్పని నిరూపించారు కష్టంతో పైకి వచ్చిన షారూఖ్, అక్షయ్‌లు. అదే కోవకు చెందిన వాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఇతని కుటుంబ నేపథ్యానికి ప్రస్తుతం ఇతడు చేరుకున్న లక్ష్యానికి పొంతనే లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని రైతు కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో ఒకడిగా జన్మించాడు. గ్రామంలో ఎద్దులను, గేదెలను కడిగే చెరువులోనే ఇతనూ ఈత కొట్టేవాడు. బిఎస్‌సి కెమెస్ట్రీ చదివి అదే గ్రామంలో కెమిస్ట్‌గా పనిచేశాడు. నటనపై ఉన్న ఆసక్తితో ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరాడు. ఈ సమయంలో డబ్బులు సమకూర్చుకునేందుకు వాచ్‌మ్యాన్‌గా పనిచేశాడు.

శిక్షణ పూర్తయ్యాక ముంబైకి వెళ్లి ఎక్స్రా రోల్స్ కోసం ప్రయత్నిస్తూ పెద్ద పోరాటమే చేశాడు. సర్ఫ్‌రోష్ సినిమాలో ఓ చిన్ని పాత్రలో నటించే అవకాశం మొదట దొరికింది. తర్వాత టైగర్ మెమన్ మీద తీసిన బ్లాక్ ఫ్రైడేలో మెమన్ ఫాలోవర్‌గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో తన నటనను నిరూపించుకునే అవకాశాన్ని వదులుకోలేదు, అందరి మెప్పూ పొందాడు. ఆ తరువాత నటనలో, పాత్రల ఎంపిక విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తేనే చేయాలని నిశ్చయించుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. ఎక్‌స్ట్రా పాత్రలతో మొదలైన సిద్దిఖీ సినీ జీవితం 20 యేళ్ల పోరాటం తర్వాత లీడ్ యాక్టర్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లేంతగా ఎదిగింది. పేదరికాన్ని పట్టించుకోకుండా తనపై తను అపారమైన నమ్మకాన్ని ఉంచుకున్నాడు నవాజుద్దీన్, అదే అతణ్ని నేడీ స్థాయిలో నిలిపింది. విజయం సాధించేందుకు పేదరికం ఎంతమాత్రం అడ్డుకాదన్నది ఇతని జీవితం తెలియజేస్తోంది.

మనిషన్నాక అనారోగ్యం రాకుండా ఉంటుందా? వచ్చినా తగ్గించుకునేందుకు ఎన్నో మందులు, ట్రీట్మెంట్లు ఉన్నాయి. కావల్సిందల్లా తట్టుకుని నిలబడే మానసిక స్థైర్యం, ఎదుర్కొనే శక్తి. అంతేకాని అనారోగ్యానికే ఆత్మహత్య చేసుకుని జీవితం లో ఓడిపోవడం ఎంతమాత్రం కాదు. దీనికి నిలువెత్తు ఉదాహరణ యువరాజ్ సింగ్.  కెరీర్ ఉన్నతంగా ఉన్న సమయంలో తనను కబళించాలనుకున్న క్యాన్సర్‌నే బౌన్స్‌ర్ ఆడాడు యువీ. బతుకుతాడా లేదా అనే దశ నుంచి  ఇండియన్ క్రికెట్ టీంలో తిరిగి చోటు సాధించి సత్తా చాటుతున్నాడు. అనారోగ్యాన్ని ఓడించి జీవితాన్ని గెలిచిన యువీ జీవితం ఊర్కెనే కలత చెందే యువతకెన్నో పాఠాలు నేర్పిస్తుంది.

యువరాజ్ సింగ్ : ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఓవర్లోని ఆరు బాళ్లను ఆరు సిక్సర్లుగా మలిచి క్రికెట్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పాడు. ఎన్నో మ్యాచుల్లో ఇండియన్ టీంను సింగిల్ హ్యండెడ్‌గా గెలిపించాడు. 2011లో వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్లినప్పుడు అపుకోలేని దగ్గు, శ్వాసలో ఇబ్బం ది తనలోని క్యాన్సర్ మహమ్మారిని బయటపెట్టంది. కాని యువీ ఢీలా పడలేదు, కీమో తీసుకుంటూ, పాజిటివ్‌గా ఉండడం అలవాటు చేసుకున్నాడు. శరీరంలో ఏదైనా సమ స్య ఉంటే దాన్ని నిర్లక్షం చేయ క నిపుణుల నుంచి సరైన సలహా తీసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలని చెబుతాడు యువీ. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఆదర్శంగా తీసుకుని క్యాన్సర్‌ను తరిమికొట్టాడు. తిరిగి 2012లో న్యూజీలాండ్‌తో జరిగిన ట్వంటీ -ట్వంటీ మ్యాచ్‌తో క్యాన్సర్‌ను జయించిన విజేతగా క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు.   స్ట్రాంగ్‌గా ఉంటే పాజిటివ్ ఆలోచనలు వాటంతటవే వస్తా యి, పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని స్ట్రెంగ్త్ డజ్‌నాట్ కమ్ ఫ్రం విన్నింగ్. యువర్ స్ట్రగుల్స్ డెవలప్ యువర్ స్ట్రెంగ్త్. వెన్ యు గోత్రూ  హార్డ్‌షిప్స్ ఆండ్ డిసైడ్ నాట్ టు సరెండర్, దట్ ఈజ్ స్ట్రెంగ్త్ అని తన విజయ రహస్యాన్ని సూచిస్తాడు యువి.

సెక్సువల్ అబ్యూజ్, హెరాస్‌మెంట్‌కు గురయ్యేవారిలో ఆడ మగా ఇద్దరూ ఉంటున్నారు. ఆడ పిల్లలు ఇలాంటి సవాళ్లను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. సొంతవారి నుంచి మొదలుకొని ముక్కూ మొహం తెలియనివాడు కూడా ఆడపిల్లలను అడ్వాంటేజ్ తీసుకుందామని ప్రయత్నించే వారే ఉంటారు. ఒప్పుకుంటే ఇబ్బందే లేదు, లేకుంటే బెదిరింపులకు దిగడం. ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లలు  అండర్‌లైన్ చేసి  జీవితకాలం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే… మానం కంటే ప్రాణం ముఖ్యం. మానాభిమానాలు ఇద్దరికీ సమానమే. మానం పోయినా ప్రాణం కాపాడుకున్న మహిళ గెలుపు ఎంత సౌండ్‌గా ఉంటుందో ఓప్రా జీవితం తెలియజేస్తుంది…

ఓప్రా విన్ ఫ్రే : డివోర్స్‌డ్ టీనేజ్ తల్లికి పుట్టిన బిడ్డగా ఓప్రా జీవితం ముళ్లబాటతో మొదలయింది. కేవలం జీవన స్థితిగతులే కాకుండా ఆడపిల్లగా చిన్నప్పటి నుంచే సెక్సువల్ అబ్యూజ్ ఎదుర్కొన్నది, అదీ సొంతవారి నుంచే. కేవలం 14 సంవత్సరాల వయసులో గర్భం ధరించింది. పుట్టిన అబ్బాయి మరణించడంతో తండ్రి వద్దకు వెళ్లి తన సహకారంతో చదువుపై శ్రద్ధ పెట్టింది. స్కాలర్‌షిప్‌తో చదవు కొనసాగించింది. కమ్యూనికేషన్స్‌లో పట్టా పొందింది. లోకల్ రేడియో స్టేషన్‌లో ఇంటెర్న్‌షిప్ తీసుకుని మీడియాలో తన కెరీర్‌కు ఫౌండేషన్ వేసుకుంది ఓప్రా. ఆ తర్వాత కూడా పరిస్థితులు వెక్కిరించినా అధైర్య పడలేదు. బాల్టిమోర్‌లో ఉద్యోగం కోసం వెళితే ప్రొడ్యూసర్లు ‘అన్‌ఫిట్’ అని సర్టిఫై చేశారు. ఇలా ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత ‘పీపుల్ ఆర్ టాకింగ్’ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించింది. అక్కడితో సంతృప్తి చెందక చికాగోకు తిరిగి వెళ్లి ఏఎమ్ చికాగో అనే లో రేటింగ్ టాక్‌షో హోస్ట్ చేసి, దాన్ని ‘డోనాహ్యూ’ కంటే ఎక్కువ ఎత్తుకు తీసుకువెళ్లి నంబర్‌వన్ షోగా నిలిపింది. తర్వాత ఓప్రా పేరే ఆ షోకు పెట్టేంత స్థాయికి చేరుకుంది.

వివాహం విద్య నాశాయ అనేది పాత సామెత. ఇలాంటి ఆలోచనలు కూడా తప్పేనని నిరూపించింది నగరానికి చెందిన సమిత పాండ్య. పాతాళంలోకి పడిపోయినా భర్త సహకారంతో పైకి లేచి ఉన్నతంగా ఎదిగింది. పై వారంత గొప్ప విజయాలను నమోదుచేయకపోయినా, మనలో ఒకరిగా సమిత సాధించిన విజయం మనందరికి స్ఫూర్తిదాయకం.

డాక్టర్ సమిత పాండ్య : గుజరాతీ కుటుంబానికి చెందిన సమిత నగరంలో పుట్టిపెరిగింది. చదువుల్లో, ఆటపాటల్లో చలాకీగా ఉండేది. యూనివర్సిటీ స్థాయిలో కూడా బాస్కెట్‌బాల్ ఆడింది. చదువుకుంటూనే ఎన్‌జివోలతో కలిసి పనిచేయడం, సమయం చిక్కితే పేద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం హాబీగా మార్చుకుంది. చదువు పూర్తి కాకుండానే పెళ్లి కావడం, ఇద్దరబ్బాయిలు పుట్టడం వెంటనే జరిగిపోయాయి. ఇంట్లోనే ఉండడం నచ్చక ఏదో చేయాలన్న తపన పడేది. కాని ఏం చేయలేని నిస్సహాయత వెరసి డిప్రెషన్‌కు గురైంది. ఈ స్థితిలో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. కొడుకు హ్యాండ్ రైటింగ్ బాగాలేదని టీచర్లు చెప్పడంతో, అబ్బాయికి నేర్పేందుకు తానూ గ్రాఫాలజీ నేర్చుకుంది. ఇలా మొదలైన రెండో ఇన్నింగ్స్‌లో సైకాలజీలో రెండు పోస్ట్ గ్రాడ్యేయేషన్లు పూర్తిచేసింది.

అమెరికా ప్రభుత్వం నిర్వహించే గ్రాఫాలజీ ప్రవేశ పరీక్ష రాసి అక్కడ నిర్వహించే సమావేశాలకు భారత ప్రతినిథిగా వెళ్లింది. ఒత్తిడికీ చేతిరాతకు ఉండే సంబంధాన్ని విశ్లేషించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం వివిధ దేశాల్లోని విద్యార్థుల చేతి రాతను విశ్లేషిస్తోంది. ఒత్తిడితో సతమతమయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్(గ్రాఫోథెరిపీ)నిర్వహిస్తోంది. ఈ రంగంలో సమిత చేస్తున్న కృషిని గుర్తించి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హ్యాండ్‌రైటింగ్ ఎనలిస్ట్(ఆహా) తనకు సభ్యత్వం ఇచ్చింది. చేతిరాతలో మెళకువలు నేర్పుతూ 1500 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందిస్తోంది. స్నేహితురాలితో కలిసి రాణీగంజ్ లోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తోంది. ఇవన్నీ చేస్తూనే కాలిఫోర్నియాలోని బర్క్లీ యూనివర్సిటీలో థియరెటికల్ సైన్సెస్‌లో పిహెచ్‌డి పూర్తి చేసి, డాక్టర్ అయ్యింది.

పై ఉదాహరణలన్నీ పిల్లల్లో స్ఫూర్తినింపేవైతే,  పిల్లల ఎదుగుదలకు సహకరించాల్సిన పెద్దలు కూడా కొన్ని విషయాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇదివరకే చెప్పుకున్నట్లు ఫెయిల్యూర్ లేని సక్సెస్ కిక్కివ్వదు. అలాంటప్పుడు ఫెయిల్యూర్‌ను ఎదుర్కునే ఆత్మవిశ్వాసం పిల్లల్లో నింపాల్సిన బాధ్యత  పెద్దలదే. ఫెయిల్యూర్ పాఠం నేర్పిస్తుందని తెలియని పెద్దలు  పిల్లలకేం చెబుతారు. ఇలాంటి తల్లిదండ్రులు, టీచర్లు ఉండడమే పిల్లల జీవితంలో పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. తల ఎగరేస్తూ ఓడిపోవడం ఎలా అనే పాఠం ప్రపంచానికి నేర్పిన ఈ సంఘటన అలాంటి పెద్దల కోసమే…

రియో ఒలెంపిక్స్ 2016లో జరిగిన సంఘటన ఇది. ఇదేదో అత్యధిక గోల్డ్‌మెడల్స్ సాధించిన, అద్భుతమైన ఆటగాళ్లున్న దేశానికి చెందిందో కాదు. న్యూజీలాండ్ డిస్టెన్స్ రన్నర్ అయిన నిక్కి హంబ్లిన్ అమెరికా అథ్లెట్ ఎబ్బె డి అగోస్టినో లకు సంబంధించిన హార్ట్ టచింగ్ స్టోరీ. రియో ఒలెంపిక్స్‌లో 5000 మీటర్ల పరుగుపందెంలో చివరి మజిలీ చేరే క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు గుద్దుకొని పడిపోయారు. హంబ్లిన్ మొదట కింద పడిపోయింది. వెనకాలే పరిగెత్తుతోన్న డి అగస్టినో కింద పడిఉన్న హంబ్లిన్‌కు చేయందించి రేస్‌లో కొనసాగేలా ప్రోత్సహించింది. కాని అగస్టినో యాంకిల్‌కు బలమైన దెబ్బ తగలడంతో నిలదొక్కుకోలేక తిరిగి పడిపోయంది.

ఒలెంపిక్స్‌లో రేసును కొనసాగించే అవకాశం ఉన్నాకూడా హంబ్లిన్ వదులుకొంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నా పోటీ పడకుండా ఆగి అగస్టినో నిలదొక్కుకునేందుకు సాయమందించి. చివరకు కుంటుతూనే ఇద్దరూ ఎలాగోలా రేసును పూర్తిచేశారు. అయితే రేసును అందరికంటే చివరగా పూర్తిచేసింది వీరిద్దరే. వారి ఒలెంపిక్స్ ఆశలు అడియాసలే అయినా వారికవి ఫెయిల్యూర్ మూమెంట్స్ మాత్రం కావు. ఎందుకంటే ఎప్పుడైతే కిందపడ్డారో అప్పుడు మొదలుపెట్టిన రేసును పూర్తి చేయాలన్నదే వారిద్దరి లక్షంగా మార్చుకున్నారు. అదే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. వచ్చే ఒలెంపిక్స్‌లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటామని కూడా చెప్పారు.

వారిలో ఉన్న డిటర్మినేషన్, స్పోర్ట్‌మెన్ స్పిరిటే కాకుండా ఫెయిల్యూర్‌ను ఎలా ఎదుర్కోవాలో ఈ సంఘటన తెలియజేస్తోంది. తల్లిదండ్రులు, టీచర్లు ప్రతి ఒక్కరు దీన్నుంచి పాఠం నేర్చుకోవాల్సి అవసరం ఉంది. సక్సెస్ సాధించటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగని ఫెయిల్యూర్ లేకుండా విజయం పొందటం వీలుకాదు. కాకుంటే ప్రయత్నలోపం, సెల్ఫ్ డిసీవింగ్ లేకుండా, విజయంపై నమ్మకం ఉంచి పనిచేస్తే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. అనేక రంగాల్లో విజయవంతమైన వారు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు వారి జీవితాలనుంచి స్ఫూర్తి పొందుతూ అడుగు ముందుకేస్తే విజయం మీ ఇంటి ముందు నిలుస్తుంది. కాసేపు జయాపజయాలను పక్కన పెట్టి పిల్లల్ని ప్రేమించడమూ అవసరమే. తల్లిదండ్రుల నుంచి అన్‌కండిషనల్ ప్రేమ, సపోర్ట్ దొరికిన పిల్లలు జీవితంలో ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువ. అందుకే ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు ద గేట్‌వే ఆఫ్ సక్సెస్ అని హగ్ చేసి పిల్లలకు చెబుదాం. ఒక్కసారి ఓడనిచ్చి గెలిచేలా ప్రోత్సహిద్దాం.

వందేళ్ల క్రితం విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది.
ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగ్గా సరిపోతుంది.!! ఒక చిలుక ఉండేది.చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది.అది రాజు గారి తోటలోని చిలుక.
ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి ’ఎడ్యుకేట్ ఇట్’ అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి. ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే మొదట అది కుదురుగా ఉండాలి. అంటే అది ఎగురకూడదు.వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు. కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. ’ ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు’ అన్నాడు.గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది. పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ’ అబ్బా… భలే చిలుక’ అనటం లేదు. ’ అబ్బా… ఏం పంజరం!’ అంటున్నారు. లేదంటే ’ అబ్బా…ఎంత చదువు!’ అంటున్నారు. రాజు గారిని మెచ్చుకుంటున్నారు.మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ’ ఆహా… ఓహో ’ అని కీర్తిస్తున్నారు.

రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు.. ఎన్ని లక్షల వరహాలు ఖర్చైనా పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని. ’ అలాగే ’ అని లక్షల వరహాలు దఫ దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.
ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. ’చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ’ అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు. రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం లేదు.పండితుడు ఒక్కడే చూస్తున్నాడు.

ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప , చిలకెలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించి పోయింది.
మానసికంగా బాగా నలిగిపోయి ఉంది. ఆ రోజైతే , రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది ! ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు. రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, చిలుక ఎలా చదువుతోంది? అని అడిగాడు. చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి అన్నాడు మేనల్లుడు. రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట.ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?  ఎగరదు ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? పాడదు
సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. అసలు కదలనే కదలటం లేదు. ఆ కడుపులోనిది ఏమిటి! అని అడిగారు రాజు గారు. జ్ఞానం మామయ్య అని చెప్పాడు మేనల్లుడు.చిలుక చనిపోయినట్లు ఉంది కదా అన్నారు రాజుగారు. చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా, బతికిందా? అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.