Friday, March 29, 2024

డేేంజర్

- Advertisement -
- Advertisement -

 కాంగ్రెస్, ఎంఐఎం మద్ధతు, అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
 బిల్లు ఆమోదిస్తే అంతా కేంద్రం నియంత్రణలోనే, ప్రైవేటుకు ధారాదత్తమే
 రైతులు, పేదల ఉసురు తీసే నియంతృత్వ బిల్లును ఒప్పుకునేది లేదు 
 26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టే బిల్లును బిజెపి స్థానిక నేతలు ఒప్పుకుంటారా?  
 ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్, బిజెపిలది ఒకే తరహా వైఫల్యం 
 నేను తెలంగాణ నినాదాన్ని చేపట్టడం వెనుక కరెంటూ ఒక కారణమే 
 70శాతం దేశ ప్రజలకు నీరివ్వలేని దుస్థితి 
 28వేల టిఎంసిల నీటిని వాడుకోలేకపోతున్నాం

Crops and Roads damaged due to heavy rain in telangana

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరంగా ఉందని, ఈ బిల్లును పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభ మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిఎం కెసిఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్ధతు తెలిపాయి. అనంతరం కేంద్ర విద్యుత్ చట్టం బిల్లు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందుకు ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం పోయినట్టుగా కేంద్ర చట్టం ఉందని సిఎం కెసిఆర్ దుయ్యబట్టారు. విద్యుత్ సంస్థలుపోతే ఉద్యోగులు పరిస్థితి ఏమిటనీ, క్రాస్ సబ్సిడీ చేయలేమన్నారు. ఈఆర్‌సి మనచేతిలో ఉండదన్నారు. కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని సిఎం పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల అధికారాలు, రాష్ట్రాల లోడ్ సెంటర్లు అన్నీ ఢిల్లీకి వెళతాయని ఆయన వివరించారు. మనరాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. కొత్త చట్టంలో రెన్యుబుల్ విద్యుత్ 20 శాతం ఉండాలని నిబంధన ఉందని, కొత్త చట్టం ద్వారా రాష్ట్రాలు తప్పనిసరిగా విద్యుత్ కొనాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు.
కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రాల హక్కులను హరిస్తున్నాయి
కేంద్రంలో అధికారంలో ఎవరున్నా రాష్ట్రాల హక్కులను హరిస్తున్నాయని సిఎం కెసిఆర్ ఆరోపించారు. మన దగ్గర ఉన్న వరదకాలువల మీద పది, పదిహేను వేల మీటర్లు ఉండేవని, ఒక్కొక్కరే ఒకటి, రెండు ఎకరాలను ఆ కరెంట్‌తో పండించుకునే వారని వారిని కూడా అప్పటి ప్రభుత్వాలు ఘోరంగా దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక వారిని కాపాడుకున్నామన్నారు. ప్రస్తుతం 30 నుంచి 40 వేల మోటార్లు నడుస్తున్నాయని ప్రస్తుతం కొత్త చట్టం వస్తే వాటికి కూడా కరెంట్ మీటర్లు పెట్టాల్సి వస్తుందన్నారు. విద్యుత్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటే వీటినన్నింటిని రక్షించుకోవచ్చన్నారు. దీంతోపాటు డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కో అభివృద్ధి చెందుతాయని, ఈ సంస్థలు లేకుంటే వేల మంది ఉద్యోగులు రోడ్డు మీద పడతారని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 22 వేల ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేశామని సిఎం కెసిఆర్ తెలిపారు. తాను చిన్నగా ఉన్నప్పుడు బిల్లు కలెక్టర్లు ఉండేవారని, ఆయన్ను చూస్తే జిల్లా కలెక్టర్ కంటే రైతులు ఎక్కువ భయపడే వారని సిఎం తెలిపారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చే చట్టం ద్వారా మీటర్లు వస్తాయని, దీంతోపాటు రెండు నుంచి మూడువేల మంది బిల్లు కలెక్టర్లు వస్తారని సిఎం పేర్కొన్నారు. ఇది రైతులకు, ప్రజలకు అంగీకారమని ఆయన ప్రశ్నించారు.
అంబేడ్కర్ ప్రవేశపెట్టిన ఆదేశిక సూత్రాలను కాంగ్రెస్, బిజెపిలు ఉల్లంఘిస్తున్నాయ్
గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లు నమూనాను కూడా పంపించిందని ఈ నేపథ్యంలో తాను ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రెండు నెలల క్రితమే కేంద్రానికి లేఖ రాశానని సిఎం తెలిపారు. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే రైతులు బిల్లులు చెల్లించకలేక చనిపోతారని ప్రధానితో పేర్కొన్నానన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు వృద్ధిలోకి వస్తున్నారని ఈచట్టం అమల్లోకి వస్తే వారి పరిస్థితి పెనం నుంచి పోయ్యిలోకి పడ్డట్టు అవుతుందని పిఎంతో పేర్కొన్నానని కెసిఆర్ పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని పరిపాలించే విధానంలో అంబేడ్కర్ ఇతర గొప్ప వ్యక్తులు ప్రవేశపెట్టిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నా యని సిఎం కెసిఆర్ విమర్శించారు. కొత్త విద్యుత్ చట్టం వస్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలు వస్తాయనీ, ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారని, కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. కొత్త చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటర్లు పెట్టాల్సి వస్తుందని, కొత్త మీటర్ల కోసం రూ. 700 కోట్లు కావాలన్నారు. మీటర్ రీడింగ్ తీస్తారని, బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తారని, రాష్ట్రంలోని 26 లక్షల బోర్లకు మీటర్లు పెట్టేందుకు రాష్ట్ర బిజెపి నాయకులు ఒప్పుకుంటారా అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెచ్చే చట్టాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇప్పటికే కేంద్రరంగ సంస్థలైన ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, విమానయాన రంగాన్ని చంపేస్తున్నాయన్నారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలపై ఒత్తిడి
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, రైతులు, పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగిందన్నారు. దేశ ప్రజలపై ఈ చట్టంను రుద్దవద్దని కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలని కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే సందర్భంలో తనపై కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చిందని, వాటిని ప్రైవేటుకు కేటాయించాలని సూచించిందని, అయినా తాను వినకుండా విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టానని సిఎం తెలిపారు. 135 కోట్ల జనాభా ఉన్న దేశంలో 70 వేల టిఎంసీల నీరు ఉందని, 45 వేల టిఎంసిలే వాడుతున్నామని, అయినా, చెన్నైలాంటి నగరం తాగునీటి కోసం అలమటిస్తుందని, దేశంలో తాగు, సాగునీటి ఇబ్బందులెందుకు వస్తున్నాయో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తెలియచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్లపైనే ఉంది
ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే దృక్ఫథం బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు లేకుండా పోయిందన్నారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉందని, పుష్కలంగా సరిపోయే నీరు ఉన్నా సాగుకు అందడం లేదన్నారు. దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్లపైగానే ఉందని, ఇప్పటివరకు 2 లక్షల 16 వేల మెగావాట్లను మాత్రమే దేశంలో వాడారన్నారు. దేశ ప్రగతి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన కేంద్రానికి లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చే ఈ చట్టాన్ని తాము పార్లమెంట్ వ్యతిరేకిస్తామని సిఎం తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన కారణంగా విద్యుత్ బిల్లులు రికార్డు చేయలేదని, ఆ సమయంలో అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ఆ మూడునెలలు డివైడ్ చేసి ఏదైనా భారం పడితే తొలగిస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. అటువంటి భారం ప్రజలపై పడనివ్వబోమని సిఎం స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటానని ఆయన హామినిచ్చారు.
నిర్వహణ భారం పెరుగుతుంది : జగదీశ్వర్ రెడ్డి
రాష్ట్రాలను సంప్రదించాకే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహారిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేంద్రం తీసుకువస్తున్న నూతన విద్యుత్ చట్టం, ఇతర అంశాలపై ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చే నూతన విద్యుత్ చట్టంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కొత్త చట్టంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాల్సి వస్తోందని, మీటర్ల తయారీ వ్యయం డిస్కంలకు పెనుభారంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. కొత్త చట్టంతో ఎక్కడినుంచైనా విద్యుత్ తీసుకునే అవకాశం ఉందని, క్రాస్ సబ్సిడీ విధానం పాటిస్తున్న తెలంగాణకు అదనపు భారం కానుందని జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దానికితోడు గ్రిడ్‌ల నిర్వహణ భారం కూడా పెరుగుతుందన్నారు. కొత్త చట్టం మేరకు లైసెన్స్ ఉన్న సంస్థలు ఎక్కడైనా విద్యుత్ కొని ఎవరికైనా అమ్మవచ్చని, రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించామన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని ఆయన తెలిపారు.
యాకుత్‌పురా ఎమ్మెల్యే పాషాఖాద్రీ అడిగిన ప్రశ్నకు రాష్ట్రం ఏర్పడిన తరువాత పాతబస్తీలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచామని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమాధానమిచ్చారు. విద్యుత్‌రంగంలో ప్రభుత్వ చర్యలను పాషాఖాద్రీ అభినందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. మాదన్నపేటలో ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ ఇచ్చామని మంత్రి తెలిపారు. పాతబస్తీలో అండర్‌గ్రౌండ్ కేబుల్‌పని ప్రారంభమయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 206 కి.మీలు పూర్తి చేశామన్నారు. దీంతోపాటు పాతబస్తీకి సబ్ స్టేషన్లు కూడా మంజూరు చేశామని, మొత్తం 15 సబ్ స్టేషన్లు మంజూరు చేయగా, అందులో 9 పూర్తి చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు రూ.1300 కోట్లను ఖర్చు చేశామన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు
నాడు కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిందన్నారు. దేశంలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ ఉద్యోగులకు రెండు సార్లు వేతనాలు పెంచామని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కంట్రోల్ ప్యానల్‌లో ప్రమాదం జరగడంతో విధుల్లో ఉన్న సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించిన ప్పటికీ ఫలించలేదని, మొత్తం 35 మంది ఉద్యోగుల్లో 29 మంది టన్నెల్ ద్వారా బయటకు రాగలిగారని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదం వలన 9 మంది విగతజీవులు అయ్యారని ఆయన వెల్లడించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మృతిచెందిన ఏడుగురు కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించేలా చూడాలని జెన్‌కోకు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రమాదంపై సిఐడి విచారణకు ఆదేశించామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
భట్టి విక్రమార్కపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఫైర్
చర్చలో భాగంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ రంగంలో ఉన్నది ఉన్నట్టే చెప్పామని, అబద్ధాలను చెప్పలేదని భట్టిని ఉద్ధేశించి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడే కంటే ముందు 7 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే రాష్ట్రం ఏర్పడ్డాక అది 17 వేల మెగావాట్లకు చేరిందన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌లో 2 నుంచి 4 గంటల పాటు కరెంట్ కోత ఉండేదని, గ్రామాల్లో 6 నుంచి 8 గంటల పాటు విద్యుత్ సరఫరాను ఆపివేసేవారన్నారు. రైతాంగానికి 3 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్నారు. ఇవన్నీ మీ హయాంలో జరిగినవి కాబట్టే చెప్పామని మంత్రి పేర్కొన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చెప్పాలని భట్టికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటివరకు పూర్తి కాలేదని, 10 నుంచి 30 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన పనులు 100 శాతం పూనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. పులిచింతల, కెటిపిపి స్టేజ్ 2తో పాటు ఎస్‌ఈపిపి సింగరేణి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని మంత్రి స్పష్టం చేశారు. భద్రాద్రి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఎన్జీటి కేసు వల్లే ఆలస్యమయ్యిందన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ రంగంలో చర్యలు తీసుకుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మీరు అన్ని పనులు చేస్తే తెలంగాణ రాక ముందు చీకట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలు, ఎందుకు మూతపడ్డాయి, రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్‌లలో 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతులకు కరెంట్ సమస్యలు తొలగిపోయాయన్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ సమస్యను మూడేళ్లలో సరిచేసిన నాయకుడు కెసిఆర్ అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

TS Assembly refused New Electricity Bill 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News