Thursday, April 25, 2024

మీ గుండెకు అండ

- Advertisement -
- Advertisement -

 బస్తీ దవాఖానాల్లో 60 రకాల వైద్య పరీక్షలు
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం
ఆరోగ్యశాఖ కృషితోనే కరోనా తీవ్రత తగ్గింది
వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తాం
కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఈటల, కెటిఆర్

TS Cabinet Sub Committee Meeting on Medical and Health

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. పట్టణాల నుంచి గ్రామీణా ప్రాంతాల వరకు కార్పొరేట్ చికిత్సను అందించేలా ప్రణాళికలు తయారు చేసింది. ఈ మేరకు సిఎం నియమించిన కేబినేట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమీక్ష నిర్వహించింది. మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిటీ సభ్యులు మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈసందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కిడ్నీ, హార్ట్, లివర్ ట్రాన్సప్లాంటేషన్‌ను తీసుకురావాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుత్లోనే కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు కొనసాగుతుండగా, వీటిని మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులకూ విస్తరింపజేస్తామని ఆయన చెప్పారు. కిడ్నీ, హార్ట్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల ఖర్చు అవుతుండగా, ఇది పేదలకు భారంగా మారిందన్నారు. ఈక్రమంలో ఈ మూడింటిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి పేదలకు రూపాయి భారం పడకుండా ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు.

అంతేగాక క్యాన్సర్ పేషెంట్ల కొరకు రూ.40 కోట్లతో ఎంఎన్‌జే ఆసుపత్రిలో మరోక నూతన బ్లాక్‌ను అతి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నిమ్స్, ఎంఎన్‌జే ఆసుపత్రుల్లో ఇప్పటికే 90 శాతం సౌకర్యాలు సమకూరగా, మిగతా ఆసుపత్రుల్లోనూ అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వీటి ఏర్పాట్లు కోసం అవసరమైతే చట్టంలో కూడా మార్పులు చేస్తమన్నారు. మరోవైపు ఆరోగ్య శ్రీ , ఈహెచ్ సి కింద ప్రతి ఏడాదికి రూ. 1200 కోట్లు, సిఎం రిలీఫ్ పండ్ కింద కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతోందని మంత్రి గుర్తుచేశారు. అయితే సిఎం రిలీఫ్ ఫండ్ అవసరం లేకుండా ఆరోగ్య శ్రీలో ప్రత్యేక మార్పులు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పథకం ఆయూష్మాన్ కంటే వంద రెట్లు బెటర్ అని మంత్రి అభిప్రాయపడ్డారు. కానీ మరిన్ని మార్పులు చేసి హైదరాబాద్ నుంచి గ్రామస్థాయిలో అందరికీ కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
బస్తీ దవాఖానల్లో 60 పరీక్షలు…
బస్తీ దవాఖానల్లో సుమారు 60 పరీక్షలు వైద్య పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కేబినేట్ ఉపసంఘం అధికారులకు ఆదేశాలిచ్చింది. గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాలు మంజూరు కాగా ప్రస్తుతం 193 పనిచేస్తున్నాయని, అతి త్వరలో మరో 26 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. వీటన్నింటికి తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను అనుసంధానం చేసి మూత్ర, రక్త, పరీక్షలతో పాటు మొత్తం 60 రకాల పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతేగాక హైదరాబాద్‌ను 8 జోన్లగా విభజించి ఒక్కోక్క జోన్‌లో ప్రజలు సౌకర్యార్థం బట్టి మౌళిక వసతులను ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీంతో ప్రజలకు టెస్టుల భారం తప్పుతుందన్నారు. అదే విధంగా జనాభా ప్రతిపాదికన అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ఏ మండలానికి ఎన్ని కావాలో? అంచనా వేసి కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. అంతేగాక ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఆసుపత్రులకు అవసరమైనన్నీ అంబులెన్స్‌లను రెడీ చేయనున్నట్లు మంత్రి ఈటల అన్నారు.
ప్రతి వ్యక్తి హెల్త్ ఫ్రోఫైల్‌ను తయారు చేస్తాం..
రాష్ట్రంలో ప్రతి వ్యక్తి హెల్త్ ఫ్రోఫైల్‌ను తయారు చేయబోతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ మరోసారి వ్యాఖ్యానించారు. అర్బన్, బస్తీ దవాఖానాల నుంచే ఈ ప్రక్రియ షురూ అవుతోందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్, కార్పొరేట్లకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ప్రభుత్వాసుపత్రులను తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో సుమారు 12 వేల పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. వీటి కోసం సుమారు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిఎం అనుమతి ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
దీర్ఘకాలిక రోగుల సేవల కోసం స్వచ్ఛంధ సంస్థలను అనుసంధానం…
దీర్ఘకాలిక రోగుల సేవల కోసం వైద్యశాఖతో స్వచ్ఛంధ సంస్థలను అనుసంధానం చేయబోతున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు.యాక్సిడెంట్లు తర్వాత కోలుకోలేని వాళ్లు, క్యాన్సర్ పేషెంట్లు, ఫెరాలసిస్‌తో బాధపడుతున్న వాళ్లకు ప్రభుత్వం అన్ని రకాల సేవలందించాలని భావిస్తుందని తెలిపారు. ఈక్రమంలోనే స్వచ్ఛంధ సంస్థలను అనుసంధానం చేయనున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు.
వైద్యారోగ్యశాఖ 365 రోజులు పనిచేస్తుంది…
ప్రజలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ నిర్వీరామంగా కృషి చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. 365 రోజులు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనివని అన్నారు.
గత ఆరు నెలలుగా అందరూ ఇళ్లకు పరిమితం అయినప్పటికీ, వైద్యశాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయిందన్నారు. అయితే కరోనా ప్రభావం వలన వైద్యశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అడుగులు వేయాలని సిఎం కూడా సూచించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ నియంత్రణ కోసం పనిచేసిన ప్రతి వ్యక్తికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యరంగంలో దేశంలో మూడవ స్థానం…
తెలంగాణలోని వైద్యారోగ్యశాఖ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శమని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యం కానీ పనులను కూడా అమలు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించామన్నారు. మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు తర్వాత మూడవ స్థానంలో తెలంగాణ ఉందని మంత్రి గుర్తు చేశారు. కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ని తరిమేశామన్నారు. దీంతో పాటు కల్యాణ లక్ష్మీపథకాల ద్వారా బాల్య వివాహాలు, కెసిఆర్ కిట్ ద్వారా గర్భిణీ స్త్రీల మరణాలు తగ్గాయన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎంఎమ్‌ఆర్(మెటర్నిటీ మోర్టాలిటీ రేట్) 92 ఉంటే, ప్రస్తుతం 63కి తగ్గిందన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో తగ్గలేదన్నారు. అంతేగాక శిశు మరణాల శాతం కూడా 39 నుం 26కి తగ్గిందన్నారు. అయితే ఇప్పటికే వైద్యరంగంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తుండగా, రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా తయారు చేసేందుకు ఒక రిపోర్టును తయారు చేశామని, దాన్ని సిఎంకి ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల్లో మరింత పటిష్ఠంగా వైద్యవ్యవస్థను తయారు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలో సబ్ సెంటర్లను వెల్ సెంటర్లుగా మార్చుతున్నామన్నారు. ఇప్పటికే పిహెచ్‌సి స్థాయిలో ఓపి కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో అక్కడే అన్ని రకాల మందులను సప్లై చేస్తామన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలోనే ఆసుపత్రి కెపాసిటిని బట్టి వైద్యపరికరాలు, మౌళిక వసతులను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సిటీస్కాన్, ఎంఆర్‌ఐ, ఇతర యంత్రాలను కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆసుపత్రుల వారిగా అవసరాన్ని బట్టి సౌకర్యాలను సమకూర్చుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..
గత ఆరు నెలలుగా వైద్యారోగ్యశాఖ అద్బుతంగా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ నాయకత్వంలో వైద్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ ప్రజలను కాపాడుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్‌ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా వైద్యారోగ్యశాఖ అద్భుతమైన పనితీరును కనబరిచిన అనేక విజయాలను సాధించిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రోబోయే ప్లానింగ్‌పైనే గురువారం మంత్రి వర్గ ఉపసంఘం కమిటీ భేటీ అయినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఉన్న భయాందోళన చెందుతున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు, డిఎంఇ డా రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

TS Cabinet Sub Committee Meeting on Medical and Health

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News