Home తాజా వార్తలు ఐటి మాగ్నెట్ హైదరాబాద్!

ఐటి మాగ్నెట్ హైదరాబాద్!

IT-Sector

అంతర్జాతీయ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం
ఐటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట
ఐటి రంగంలో విస్తృతమైన ఉద్యోగావకాశాలు
వన్‌ప్లస్ ఆర్ అండ్ డి సంస్థను ప్రారంభించిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరబాద్ : ప్రభుత్వం ఐటి రంగానికి పెద్దపీట వేయడంతో పాటు స్నేహపూరితమైన పారిశ్రామిక విధానం అమల్లో ఉండటంతో ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తుంటడం హర్షనీయమని టిర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు, సుప్రసిద్ధ సంస్థల స్థాపనతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా వేగంగా రూపు దిద్దుకుంటుందని ఆయన చెప్పారు. సోమవారం నానక్‌రాగూడాలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటి పార్కులో ఏర్పాటుచేసిన వన్‌ప్లస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ సెంటను కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి పరిశ్రమలకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉందని చెప్పారు. ప్రపంచంలోని అనేక సుప్రసిద్ధ ఐటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. నూతన పరిశ్రమల ఆవిర్భావంతో ఐటి నిపుణులకు అత్యధిక ఉద్యోగావకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.

అంతర్జాతీయ ఐటి సంస్థల వ్యాపారాలకు హైదరాబాద్ అనువైన ప్రాతంతమన్నారు. వ్యాపారంగానే కాకుండా చరిత్రప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఇక్కడనే ఉండటంతో హైదరాబాద్ కీర్తి విశ్వవ్యప్తం అయిందన్నారు. అలాగే హైదరాబాద్ బిర్యాని ప్రపంచదేశాలను ఆకట్టుకుంటుందన్నారు. అనేక దేశాలనుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణసౌకర్యాలు కూడా ఉండటంతో పాటు నూతన పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో ప్రసిద్ధ కంపెనీలు వ్యాపా ర కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటున్నాయని చెప్పారు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ దేశంలోనే తన ప్రథమ పరిశోధనాభివృద్ధి సంస్థను హైదరాబాద్‌లో ప్రారంభించడం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలంలో ఈ సంస్థ వేయి కోట్ల రూపాయలు పెట్టుబడులుపెట్టి పరిశోధనలు చేయడంతో ఐటినిపుణులకు విస్తృత అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అలాగే పరోక్షంగా వేలాధి మందికి ఉపాధి లభించనుందని చెప్పారు.
సుప్రసిద్ధ అభివృద్ధి సంస్థ
దేశంలోని అనేక రాష్ట్రాలు చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ను తరలించుకుపోయేందుకు ప్రయత్నించాయని కెటిఆర్ చెప్పారు. బెంగుళూరులో ఏర్పాటు చేయాలని అక్కడి పాలకులు ఒత్తిడి పెంచినా తెలంగాణ ప్రభుత్వం ఐటి రంగానికి ఇస్తున్న ప్రోత్సహాలు,హైదరాబాద్ నగర గొప్పదనాన్ని పరిశీలించి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావంతో పాటు కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఈ సెంటర్‌లో ప్రధానంగా మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఇందులో ముఖ్యంగా కమ్యూనికేషన్ అండ్ నెట్‌వర్క్, కెమెరాల రూపకల్పన,తయారీ, నూతన ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తారని చెప్పారు. ముఖ్యంగా 5జి టెస్టింగ్, సాప్ట్‌వేర్,ఏఐ ప్రోడక్ట్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపైనే దృష్టి పెట్టనున్నారని ఆయన చెప్పారు.
మరింత విస్తరిస్తాం
దేశంలోని అనేక రాష్ట్రాలను పరిశీలించిన అనంతరం హైదరాబాద్ తమసంస్థ కార్యకలాపాలకు, పరిశోధనకు ముఖ్య కేంద్రంగా నిర్ణయించామని వన్‌ప్లెస్ వ్యవస్థాపక సిఈఓ పీట్ లౌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం ప్రోత్సహాలు గౌప్పగా ఉన్నాయన్నారు. కెటిఆర్ ఎంతో పట్టుదలగా పరిశ్రామిక రంగాభివృద్ధికి కృషి చేయడంతో పాటు అనేక దేశాల పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సకాలను వివరించి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని అభినందించారు. మూడు సంవత్సరాల్లో రూ. వేయి కోట్లు పెట్టబడులు పెట్టడంతో పాటు భవిష్యత్‌లో మరింత విస్తరించనున్నట్లు పీట్‌లౌ ప్రకటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాపారాలకు ముఖ్యకేంద్రంగా మారిందన్నారు. ఇక్కడి ఐటి నిపుణులు కూడా లభ్యం అవడంతో సంస్థను వేగంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. చైనా తర్వాత కేవలం హైదరాబాద్‌లోనే వన్‌ప్లస్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ కెటిఆర్ ఐటి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన కృషికి ఫలితంగా అనేక అంతర్జాతీయపరిశ్రమలు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయని చెప్పారు. దేశంలోని ఇతరరాష్ట్రాల్లో లేని పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉండటానికి ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానమే ప్రధానమన్నారు.

TS Government Preference to IT sector