Saturday, April 20, 2024

వేతనాల కోతపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్..

- Advertisement -
- Advertisement -

గవర్నర్ ఆమోదంతో గెజిట్ జారీ
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌లో గరిష్టంగా 50 శాతం కోత విధించేలా వీలు
మార్చి 24వ తేదీ నుంచి అమల్లోకి…
అప్పటి నుంచి ఆరు నెలల్లోపు వాయిదా మొత్తం చెల్లించేలా ఆర్డినెన్స్
మన తెలంగాణ/హైదరాబాద్: విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్‌లో కోత విధించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదంతో మంగళవారం రాత్రి గెజిట్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్‌లో గరిష్టంగా 50 శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ రూపొందించారు. మార్చి 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇప్పటి వరకు ఉద్యోగులు, పెన్షన్‌దారులకు కోత విధించిన మొత్తాన్ని వాయిదా తేదీ నుంచి ప్రభుత్వం 6 నెలలలోపు చెల్లించాలని పేర్కొంది. పూర్తి పెన్షన్‌ను చెల్లించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. పింఛన్‌లలో కోత ఏ చట్ట ప్రకారం విధిస్తున్నారని అడిగింది. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. జూన్ నెలలోనూ కోతలు ఉంటాయని తెలుస్తోంది.

వాస్తవానికి లాక్‌డౌన్‌తో రాష్ట్రం పూర్తిగా ఆదాయం కోల్పోయింది. సిఎంతో సహా ఇతర ప్రజాప్రతినిధులందరి వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల్లో ఐఎఎస్, ఐపిఎస్‌ల వేతనాల్లో 60 శాతం కట్ చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం, నాలుగో తరగతి ఉద్యోగులకు 10 శాతం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 10 శాతం కోత విధించారు. అన్ని రకాల విశ్రాంత ఉద్యోగుల పెన్షనర్లకు మొదట 50 శాతం కోత విధించారు. అయితే తరువాత దీనిని ప్రభుత్వం 25 శాతానికి కుదించింది. నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌లలో 10 శాతం కోత విధించారు. వాస్తవానికి వరుసగా రెండు నెలల పాటు రాబడి లేకపోవడంతో అప్పుల మీద ఆధారపడిన ప్రభుత్వం ముఖ్యమైన పథకాలకు నిధులిస్తోంది. ఈ నెలలోనే సడలింపులు ఇచ్చారు. అయినా ఇంకా పూర్తిస్థాయిలో రాబడి సమకూరడం లేదని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణతో చెప్పారు.

TS Govt brings ordinance on Salaries and Pensions cuts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News