Home తాజా వార్తలు కోటి 48 లక్షల ఎకరాలకు రైతుబంధు జమ

కోటి 48 లక్షల ఎకరాలకు రైతుబంధు జమ

TS govt deposits RS 7411 cr in rythu bandhu

 

62.99 లక్షల మందికి లబ్ధి
నల్లగొండ జిల్లాకు అత్యధికం, మేడ్చల్ జిల్లాకు అత్యల్పం
ప్రాంతాలను బట్టి పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద ఇప్పటివరకూ కోటి 48లక్షల 23వేల ఎకరాలకు పంట పెట్టుబడి నిధులు అందజేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం నాడు మంత్రి రైతుబంధు నిధుల పంపిణీ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 62.99లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7411.52 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601.74 కోట్లు అందజేసినట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతుల ఖాతాలకు రూ.370.74 కోట్లు అందించామన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 2,77,920 మందికి రైతులకు రూ.367.27 కోట్లు , ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది రైతులకు రూ.356.12 కోట్లు అందించామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2,94,972మంది రైతులకు రూ.345.33 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 2,94,362 మంది రైతులకు రూ.210.65కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,61,079 మంది రైతులకు రూ.309.28కోట్లు, వనపర్తి జిల్లాలో 1,58, 994మంది రైతులకు రూ.180.40కోట్లు అందిచామన్నారు.అత్యల్పంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 33,452మంది రైతులకు రూ.33.65కోట్లు అందించినట్టు తెలిపారు. రైతుబంధు పథకం అమలులో ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయరంగానికి ఒక దిక్సూచిలా నిలిచారన్నారు. రైతుబీమాతో ఆత్మబంధువు అయ్యారని తెలిపారు.

ప్రాంతాల వారీగా మద్దతు ధరలు అమలు చేయాలి:
వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానం అవలంబించాలని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు మద్దతు ధరలను ఆయా రా్రష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని కోరారు. పండించిన పంటలన్నీ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలన్నారు. స్వామినాధన్ కమిటి సిఫార్సులను యధావిధిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడం శోచనీయం అన్నారు. దేశంలో 60 శాతంపైగా జనాభా ఆధారపడిన వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానం మారాలన్నారు. రైతులు సంతోషంగాఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. దశాబ్దాలుగా పాలకులంతా రైతులను ఓటు బ్యాంకులుగానే చూశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు, నిర్ణయాలతో రైతుల పట్ల ,వ్యవసాయరంగం పట్ల, ఆయా రాష్ట్రాల దృక్పధం మారుతూ వస్తోందన్నారు. అన్నం పెట్టే అన్నదాతల కష్టాలను గుర్తించి చేయూతనందించింది ఒక్క కెసిఆర్ మాత్రమే అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

TS govt deposits RS 7411 cr in rythu bandhu