Friday, March 29, 2024

రాయలసీమ ఎత్తిపోతలపై న్యాయ పోరాటం

- Advertisement -
- Advertisement -

ఎపి జల దోపిడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను తక్షణమే నిలిపివేయాలని పిటిషన్, టెండర్ల
ప్రక్రియ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి
సమైక్య రాష్ట్రంలోనే నీటి వాటాలో తెలంగాణ నష్టపోయిందని ఆవేదన

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎపిలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సమైక్య రాష్ట్రంలోనే నదుల నీటివాటాలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని తన పిటిషన్‌లో పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ప్రస్తావించింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు, టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తూ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించింది. ఈ ఫైలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమైంది.

ఈ తరుణంలో వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆగస్టు 5న ఈ భేటీ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఈ నెల 20 తరువాత ఈ భేటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ స్పష్టం చేయడంతో ఈ భేటీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా నీటిని అదనంగా తరలించేలా వచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ విషయంలో తదుపరి ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్రతిపాదించిన ఎపి ప్రభుత్వం అందుకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో పాటు టెండర్ ప్రక్రియను చేపట్టింది.
కృష్ణాబోర్డుకు ఫిర్యాదు
గతంలోనే ఈ విషయమై కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని, రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లరాదని బోర్డు కూడా ఎపికి స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కేంద్ర జలశక్తిశాఖ ఇవాళ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిపాదించింది. అయితే ముందుగానే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా 20వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అంతేకాకుండా రాయలసీమ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, సమైక్య రాష్ట్రంలోనే సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు టెండర్ల విషయంలో తదుపరి ముందుకెళ్లకుండా చూడాలని కోరింది. ఈ మేరకు నిన్న ఎలక్ట్రానిక్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
కెవియట్ పిటిషన్ వేసిన ఎపి
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు, ఎపి, తెలంగాణ హైకోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే ఎపి ప్రభుత్వం కేవియట్ లు దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.

TS Govt files Petition on Rayalaseema Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News