Thursday, March 28, 2024

కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్ పే అమలు

- Advertisement -
- Advertisement -

జెఎసి జిఓ కాపీలు అందజేసిన మంత్రులు
అధ్యాపకుల గౌరవ వేతనం 30 శాతం పెంపు
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన లెక్చరర్ల సంఘం

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో తమను కలిసిన జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల జెఎసి నేతలకు బేసిక్ పే అమలుకు సంబంధించిన 104, 105, 106 జీవోలను మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జెఎసి నేతలను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల చేసినందుకు వారు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల జెఎసి ఛైర్మన్ కనక చంద్రం, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్, రాష్ట్ర మహిళా సెక్రెటరీ మాలతి, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల అధ్యక్షులు వినోద్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాల అధ్యక్షులు ఉమ శంకర్, రాష్ట్ర నాయకులు సదానందం, భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్లకు పెరిగిన వేతనాలు
రాష్ట్రంలో బేసిక్ పే అమలు ద్వారా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు వేతనాలు పెరగనున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 3,600 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు గతంలో నెలకు రూ.37,100 వేతనం పొందుతుండగా తాజాగా ఉత్తర్వుల మేరకు వీరి వేతనం రూ.54,220కు పెరిగింది. డిగ్రీ కళాశాలల్లో పనిచేసతున్న సుమారు 850 మంది గతంలో రూ.40,270 వేతనం పొందుతుండగా, వీరి వేతనం రూ.58,850కి పెరిగింది. అలాగే పాలిటెక్నిక్ కళాశాలల్లోని 450 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనం రూ.40,270 నుంచి రూ.58,850కు పెరిగింది.
గౌరవ వేతనం 30 శాతం పెంపు
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలల్లో గంటల ప్రకారం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల గౌరవం వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పార్ట్‌టైం జూనియర్ లెక్చరర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న లెక్చరర్లకు ఇచ్చే గౌరవ వేతనంలో 30 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం
ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల బేసిక్ పే వేతలనాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రమణారెడ్డి, కొప్పిశేట్టి సురేష్‌లు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి జగదీష్‌రెడ్డికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్ పే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి(టిప్స్) రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ గౌడ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

TS Govt hikes salary of contract lecturers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News